logo

ప్లాస్టిక్‌ నిషేధం అమలు ఉత్తమాటేనా?

తొర్రూరు మున్సిపాల్టీలో ప్లాస్టిక్‌ నిషేధం ఆరంభ శూరత్వంగానే మిగిలింది. పురపాలిక పరిధిలో ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం అటకెక్కింది. ఈ ఏడాది జులై 1 నుంచి 120 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధిస్తూ

Published : 01 Oct 2022 06:16 IST

తొర్రూరులో నిరుపయోగంగా ప్లాస్టిక్‌ నియంత్రణ కేంద్రం

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: తొర్రూరు మున్సిపాల్టీలో ప్లాస్టిక్‌ నిషేధం ఆరంభ శూరత్వంగానే మిగిలింది. పురపాలిక పరిధిలో ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం అటకెక్కింది. ఈ ఏడాది జులై 1 నుంచి 120 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రారంభంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాలీలు నిర్వహించి ప్లాస్టిక్‌ సంచులు, గ్లాసులు, ఇతర వస్తువులను విక్రయించే వారిపై జరిమానాలు విధించారు. అనంతరం ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసుల వినియోగం పెరిగింది. గతంలో పురపాలికల్లో ప్రత్యేకంగా ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ వస్తువులను సేకరించేవారు. ప్రస్తుతం ఈ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించొద్దు. దీన్ని అతిక్రమిస్తే ప్లాస్ట్టిక్‌ వస్తువులతో పాటు దుకాణాన్ని  సీజ్‌చేసేలా నిబంధనలు ఉన్నాయి.

పర్యావరణానికి చేటు
* ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణం దెబ్బతింటుంది. ప్లాస్టిక్‌లో ఉండే రసాయనాలు మొక్కలు పెరుగకుండా అడ్డుపడతాయి * భూసారం దెబ్బతింటుంది. * ప్లాస్టిక్‌ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి సుమారు వందేళ్లు పడుతుంది. * చెత్తకుప్పల్లో పడేసిన ప్లాస్టిక్‌ వస్తువులను మూగజీవాలు తిని మృత్యువాత పడుతున్నాయి. * ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌లో వెలువడే క్లోరోనేటెడ్‌ హైడ్రోకార్బడ్‌ నాడీమండలాన్ని దెబ్బతీస్తుంది. * ప్లాస్టిక్‌ను అధికంగా వాడితే  విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి మందగిస్తుంది

జరిమానాలు.. శిక్షలు
* 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ తయారీదారులు, వ్యాపారులకు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ః విక్రయదారులకు రూ.500 నుంచి 1000 వరకు జరిమానా విధిస్తారు. ః ప్లాస్టిక్‌ వస్తువులు వాడిన వారికి రూ.200 వరకు జరిమానా విధిస్తారు.

నిరుపయోగంగా సేకరణ కేంద్రాలు
గతంలో పని చేసిన కలెక్టర్‌ శివలింగయ్య హయాంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ వస్తువుల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్లాస్టిక్‌ వస్తువులను సేకరించి కేంద్రాల్లో నిల్వ చేసి అక్కడి నుంచి తరలించే వారు. మున్సిపాలిటీ సిబ్బంది దుకాణాల్లో తనిఖీలు చేసి ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించే వారిపై జరిమానాలు విధించారు. మద్యం దుకాణాల వద్ద ప్రత్యేకంగా డబ్బాలు ఏర్పాటు చేసి.. వాడిన ప్లాస్టిక్‌ గ్లాసులు, ఇతర వ్యర్థాలను అందులో పడేసేలా కొన్ని నెలల పాటు అమలు చేశారు. ప్రస్తుతం ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. పలు మద్యం దుకాణాల యజమానులు ప్లాస్టిక్‌ గ్లాసులు, ఇతర వ్యర్థాలను ఆరుబయట ఇష్టానుసారంగా కాల్చివేస్తున్నారు.


తనిఖీలు ముమ్మరం చేస్తాం
- గుండె బాబు, మున్సిపల్‌ కమిషనర్‌, తొర్రూరు

120 మైక్రాన్లలోపు మందం కలిగిన ప్లాస్టిక్‌ వస్తువులను వాడోద్దని సూచించాం. వాటిని ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాల్లో వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో పలు దుకాణాల్లో తనిఖీలు చేసి జరిమానాలు విధించాం. మద్యం దుకాణాల ముందు డబ్బాలు ఏర్పాటు చేసుకోవాలని, కవర్లు, గ్లాసులను కాల్చకుండా ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రాలకు తరలించాలని సూచించాం. తనిఖీలను ముమ్మరం చేస్తాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని