logo

Super Star Krishna: జగదేకవీరుడు.. ఓరుగల్లుకు సుపరిచితుడు

నటశేఖరుడు, జగదేకవీరుడు కృష్ణతో ఓరుగల్లు వాసులకు ఆత్మీయ అనుబంధం ఉంది. సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొందిన ఆయనకు ఇక్కడ అభిమానులు, సినిమాబంధం గలవారు ఎందరో ఉన్నారు. ఆయన మృతి చెందారని తెలిసి తీవ్ర  విషాదంలో మునిగిపోయారు.

Updated : 16 Nov 2022 10:20 IST

- కాశీబుగ్గ, డోర్నకల్‌, న్యూస్‌టుడే

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌లోని కృష్ణ అభిమాన సంఘం 1987లో ఉమ్మడి రాష్ట్రంలో వరదలొచ్చినప్పుడు

ఔదార్యం చూపింది. ఇక్కడ వస్త్రాలు సేకరించి ఆంధ్రలో వరద బాధితులకు అందజేశారు.

నటశేఖరుడు, జగదేకవీరుడు కృష్ణతో ఓరుగల్లు వాసులకు ఆత్మీయ అనుబంధం ఉంది. సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొందిన ఆయనకు ఇక్కడ అభిమానులు, సినిమాబంధం గలవారు ఎందరో ఉన్నారు. ఆయన మృతి చెందారని తెలిసి తీవ్ర  విషాదంలో మునిగిపోయారు.


మాధవరావుకు గుర్తింపు

నగరానికి చెందిన తిరునగరి మాధవరావు దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన తాళిబొట్టు సినిమా 1970 మార్చి 27న విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మాధవరావు ఇంటిపేరు తాళిబొట్టుగా మారిపోయింది.


తోట ప్రభాకర్‌ దర్శకత్వంలో డియర్‌ బ్రదర్‌

డియర్‌ బ్రదర్‌ సినిమా దర్శకుడు ప్రభాకర్‌

ములుగు జిల్లాకు చెందిన సినీ దర్శకుడు తోట ప్రభాకర్‌ దర్శకత్వలో కృష్ణ డియర్‌ బ్రదర్‌ సినిమా చేశారు. 1995లో విడుదలై ఘన విజయం సాధించింది. మొత్తం 11 చిత్రాలకు దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్‌కు కృష్ణతో మంచి అనుబంధం ఏర్పడింది. దర్శక, నిర్మాతలంటే కృష్ణకు ఎంతో గౌరవమని ఆయన అన్నారు.


జిల్లాలో పర్యటన..

మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభిమాని. 1989 పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్‌ ఎంపీ స్థానం నుంచి పోటీచేసిన ఆర్‌.సురేందర్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సతీమణి విజయనిర్మలతో కలిసి వరంగల్‌, మహబూబాబాద్‌లో పర్యటించారు. వరంగల్‌ పోచమ్మ మైదాన్‌లోని ఆంజనేయస్వామి దేవాలయం నుంచి స్థానిక కార్మిక భవన్‌ ప్రాంగణం వరకు ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ సభాస్థలికి చేరుకున్నారు. ఆ ఎన్నికల్లో సురేందర్‌రెడ్డి విజయం సాధించారు.  ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అప్పుడు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా, తుమికి రమేశ్‌బాబు యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కృష్ణ వెంట ఉన్నారు.


నేరెళ్లకు గుర్తింపు తెచ్చిన గూఢచారి 116

సినిమా చిత్రీకరణలో కృష్ణతో నేరేళ్ల వేణుమాధవ్‌ (ఎడమవైపు నల్ల కోటు వేసుకున్న మొదటి వ్యక్తి)

ప్రపంచ ధ్వన్యనుకరణ సమ్రాట్‌గా పేరు తెచ్చుకున్న నగరానికి చెందిన మిమిక్రీ పితామహుడు నేరెళ్ల వేణుమాధవ్‌కు కృష్ణతో మంచి స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి నటించిన ‘గూఢచారి 116’ చిత్రం 1966 ఆగస్టు 11న విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో చేసే మిమిక్రీ సన్నివేశాలు నేరెళ్లకు మంచి గుర్తింపు తెచ్చాయి.


అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం  

- మహేశ్‌బాబు అభిమాన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గందె నవీన్‌

సూపర్‌స్టార్‌ కృష్ణకు నేను 1983 నుంచి వీరాభిమానిని.  ‘కృష్ణ బ్యూటీ స్టార్‌’ పేరుతో అభిమానం సంఘం స్థాపించాను. 1990 నుంచి 1999 వరకు సూపర్‌స్టార్‌ కృష్ణ అభిమాన సంఘం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. 1999 నుంచి మహేశ్‌బాబు అభిమాన సంఘానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. అనేక రక్తదాన శిబిరాలు, సిసిమాల విడుదల రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాం. నన్ను వరంగల్‌ నవీన్‌గా కృష్ణ పిలిచేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని