logo

ఓరుగల్లు.. సాగునీటి వనరుల ఖిల్లా!

రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఓరుగల్లు సాగునీటి వనరులు ఖిల్లాగా మారింది. ఇదివరకే కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులతో కళకళలాడింది.

Published : 07 Jun 2023 04:29 IST

ఈనాడు డిజిటల్‌,జయశంకర్‌ భూపాలపల్లి

మేడిగడ్డ బ్యారేజీ

రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఓరుగల్లు సాగునీటి వనరులు ఖిల్లాగా మారింది. ఇదివరకే కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులతో కళకళలాడింది.  గోదావరిపై నూతనంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సైతం ఉమ్మడి జిల్లాలో ఉంది. ఫలితంగా పంటల సాగు సైతం పెరిగింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘సాగునీటి దినోత్సవం’ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సాగునీటి   వనరులపై కథనం.

* సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని రామప్పలో మంత్రి కేటీఆర్‌ సరస్సు వద్ద ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో  పాల్గొననున్నారు.
* ప్రతి నియోజకవర్గంలో  చెరువుల వద్ద సాగునీటి దినోత్సవాన్ని నిర్వహించ నున్నారు.

మిషన్‌ కాకతీయతో  చెరువుల పునరుద్ధరణ

రామప్ప సరస్సు

ఎనిమిది శతాబ్దాల క్రి¨తమే సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. నేటికీ ఉమ్మడి జిల్లాలో ప్రధాన వనరు కాకతీయుల చెరువులే. రామప్ప, లక్నవరం, గణపసముద్రం, తదితర చెరువులు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 8 వేలకు పైగా చెరువులున్నాయి. మిషన్‌ కాకతీయ పథకంతో 2 వేల చెరువుల్లో పూడిక తీసి పునరుద్ధరించారు. దీంతో సాగునీటి సమస్య పరిష్కారమైంది. నియోజకవర్గానికో చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌లా నిర్మించి ఆహ్లాదభరితంగా రూపొందించారు.

దేవాదులకు అనుసంధానంగా..

మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు దేవాదుల. ఏడు లక్షల ఎకరాల సాగునీరు లక్ష్యంగా నిర్మించిన దేవాదుల ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మూడో దశ పనులు వేగవంతం అయ్యాయి. దేవాదుల నుంచి ఏడాదికి 70 టీఎంసీˆలను ఎత్తిపోసేందుకు దేవాదులకు అనుసంధానంగా నిర్మించిన సమ్మక్కసాగరం(తుపాకులగూడెం) అందుబాటులోకి వచ్చింది. వేసవిలోనూ ఎత్తిపోస్తున్నారు.

కాళేశ్వరంతో జీవనదిగా గోదావరి

వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే గోదావరిలో నీరుండేది. వేసవి కాలంలో గోదావరి నీటిధారలు కూడా కనిపించేవి కావు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు గోదావరిలో జలకళ ఉట్టిపడుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు, కాళేశ్వరం పంప్‌హౌస్‌ నిర్మించారు. 45 లక్షల ఎకరాల సాగునీటి లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఈ ఏడాది 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌కు మధ్యమానేరు, ఎల్‌ఎండీ నుంచి ఎస్సారెస్పీ డీబీఎం ద్వారా సాగునీరు అందుతోంది. గతంలో వర్షాకాలంలోనే ఎస్సారెస్పీ నుంచి సాగునీరు వచ్చేది. నేడు రెండు పంటలకు చివరన ఉన్న నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, నియోజకవర్గాలకు కూడా సరఫరా అవుతోంది.

ఇది గొప్ప ప్రాజెక్టు

ఎన్‌. వెంకటేశ్వర్లు, ఈఎన్‌సీ రామగుండం

కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి ఎంతో మేలు కలుగుతోంది. వెనక్కు ఎత్తిపోతలనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతో ఇది సాధ్యమైంది. దీంతో రాష్ట్రానికి 70 శాతం వరకు నీటి అవసరాలు తీరుతాయి. గోదావరిపై బ్యారేజీల నిర్మాణంతో నదికి జీవకళ వచ్చింది. 6 నుంచి ఏడున్నర మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో ఎస్సారెస్పీ నీటి ద్వారా ఒక పంటే సాగుచేసేవారు. కాళేశ్వరం నీటితో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, తదితర ప్రాంతాల్లో రెండు పంటలు పండిస్తున్నారు. వరి సాగు రెండున్నర రెట్లు పెరిగింది.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు