logo

ఇక్కడ హిమాలయాలే చిన్నబోతాయి..

అవి సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు, అబ్బురపరిచే గుహలు, ప్రాచీనమైన వర్ణ చిత్రాలు, నీటి చెలిమెలు ఇలా ఎన్నో విశేషాలు అక్కడ కనిపిస్తాయి. చుట్టూ పచ్చని పంట చేలు.. ఆ మధ్యలో రమణీమైన ప్రకృతి అందాలు.. ఇవన్నీ జయశంకర్‌ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారు రావులపల్లి సమీపంలో ఉన్న పాండవుల గుట్టల్లో దాగివున్నాయి.

Updated : 20 Mar 2024 05:01 IST

అద్భుతం పాండవుల గుట్టలు
జియో టూరిజం అభివృద్ధికి జీఎస్‌ఐ ఏర్పాట్లు..

రేగొండ మండలం తిరుమలగిరిలోని పాండవులు గుట్టలు

అవి సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు, అబ్బురపరిచే గుహలు, ప్రాచీనమైన వర్ణ చిత్రాలు, నీటి చెలిమెలు ఇలా ఎన్నో విశేషాలు అక్కడ కనిపిస్తాయి. చుట్టూ పచ్చని పంట చేలు.. ఆ మధ్యలో రమణీమైన ప్రకృతి అందాలు.. ఇవన్నీ జయశంకర్‌ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారు రావులపల్లి సమీపంలో ఉన్న పాండవుల గుట్టల్లో దాగివున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించింది. హిమాలయాల కంటే పురాతనమైన గుట్టలకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) ప్రత్యేక గుర్తింపు తెస్తోంది.

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

ఎన్నో విశేషాలు

చెట్ల పసరుతో గీసిన చేప, జింక, తాబేలు, కప్ప, చిలుక, మేక, మనిషి ఆకారాల వంటి చిత్రాలు కనిపిస్తాయి. గుహలు, నీటి తొట్టెలు కనిపిస్తాయి. నాగు పాము ఆకారంలో పెద్ద గుహ ఉంటుంది. ఇక్కడి గుహలకు మేకల బండ, కుంతిదేవి, మంచినీటి గుహ, వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మంచినీటి గుహలో  ఎల్లప్పుడూ చల్లని నీరు దొరుకుతుంది. వర్షా కాలంలో గుట్టల పైనుంచి పలుచోట్ల జలపాతాలు జాలువారుతాయి. వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తారు.

రాష్ట్రం నుంచి ఏకైక ప్రాంతం..

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) దేశ వ్యాప్తంగా 90 అతి ప్రాచీన ప్రాంతాలను గుర్తించింది. అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి పాండవుల గుట్ట ఏకైక ప్రాంతం. దీని విశిష్ఠతను తెలిపేలా, అవగాహన పెంచేందుకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.   జియో హెరిటేజ్‌ వాక్‌ నిర్వహించారు.

  • సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాంతాలను భావితరాలకు అందించాలనే కృతనిశ్చయంతో జీఎస్‌ఐ కృషి చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో జియో టూరిజం అభివృద్ధికి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం బిల్లు ప్రవేశ పెట్టనుంది. దశల వారీగా నిధులు కేటాయించనున్నారు.

రాక్‌ క్లైంబింగ్‌ అనువైన ప్రదేశం..

రాక్‌ క్లైంబింగ్‌కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని సాహస క్రీడాకారులు చెబుతున్నారు. 100 నుంచి 150 వందల మీటర్లకు పైగానే ఎత్తుగా.. నిటారుగా, ఏటవాలుగా ఉండటంతో రాక్‌క్లైంబింగ్‌, రాపెల్లింగ్‌, ట్రెక్కింగ్‌కు ఉపయుక్తంగా ఉన్నాయి.

  • పాండవుల గుట్టలు 150 మీటర్ల ఎత్తుతో దాదాపు 7 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.
  • రాష్ట్ర కూటులు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు.  రాష్ట్రకూట కాలానికి చెందిన ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ అనే శాసనము మూడు పంక్తులలో ఉంది.
  • పాండవులు వనవాసం చేసిన సమయంలో కొంతకాలం ఇక్కడ నివాసమున్నారని.. అందుకే వాటికి ఆ పేరొచ్చినట్లుగా స్థానికులు చెబుతారు.
  • దీనిపై కోట గోడ ముఖద్వారం ఉంటుంది. అక్కడక్కడ రాతి కట్టడాలున్నాయి.
  • 10 వేల సంవత్సరాల కిందట ఆదిమానవులు గీసిన చిత్రాలు (రాక్‌ పెయింటింగ్స్‌) ఇప్పటికీ కనిపిస్తాయి..
  • గుట్టలు పలు ఆకృతుల్లో కనిపిస్తాయి. చెక్కని శిల్పాల్లా దర్శనమిస్తాయి.
  • ఇక్కడి వర్ణచిత్రాలు శిలాయుగం నాటివని 1990లో పురావస్తుశాఖ వెలుగులోకి తెచ్చింది.

యునెస్కో గుర్తింపు దక్కాలి

ప్రొఫెసర్‌ పాండురంగారావు, పరిశోధకులు

పాండవుల గుట్టలు అతి ప్రాచీనమైనవి. ఇలాంటివి మధ్యప్రదేశ్‌లోని బెంబెట్కా ప్రాంతంలోనే ఉన్నాయి. వాటికి యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. వీటికి కూడా ఆ గౌరవం దక్కాలి. భావితరాలకు వీటిపై అవగాహన కల్పించాలి. వీటి అభివృద్ధికి, పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

హిమాలయాల కంటే అతి పురాతనమైనవి

రమేశ్‌ గుండ, సీనియర్‌ సైంటిస్ట్‌, పీఆర్‌ఓ జీఎస్‌ఐ, హైదరాబాద్‌

పాండవుల గుట్టలు ఇసుక రాయితో ఆవిర్భవించాయి. ఇవి పాకల్‌ సూపర్‌ గ్రూపునకు చెందిన మెసో-ప్రోటెరోజోయిక్‌ ములుగు జాకారం సమూహానికి చెందినవి. 168.5 కోట్ల సంవత్సరాల కిందట  పాకల్‌ సూపర్‌ గ్రూపు శిలలు ఏర్పడ్డాయి. పాండవుల గుట్టలు 1565 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఆవిర్భవించాయి. హిమాలయాలు 50 మిలియన్‌ ఏళ్ల క్రితం సెనోజోయిక్‌ యుగం నాటా తృతీయ కాలంలో ఏర్పడ్డాయి. అందువల్ల పాండవుల గుట్ట రాళ్లు హిమాలయాల కంటే పురాతనమైనవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని