logo

నాణ్యతా.. వారికి మామూలే!

ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.

Published : 29 Mar 2024 06:03 IST

ఈనాడు, మహబూబాబాద్‌: ఉపాధిహామీ పథకం నిధులతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. చాలా చోట్ల నాణ్యతకు పాతరేసి నాసిరకం పనులు చేపడుతున్నారు. దీనికి కారణం దగ్గరుండి పనులు చేయించాల్సిన ఇంజినీరింగ్‌ అధికారులు అందుబాటులో లేకపోవడం ఒకటైతే.. కొందరు పనులు ఎలా ఉన్నా తమకు ముట్టాల్సినవి ముడితే చాలు అన్నట్లు వ్యవహరిస్తుండడమే. ప్రతి పనిలో దాదాపు 10 శాతం ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

1,597 రోడ్లు మంజూరు..

మహబూబాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 1,597 సీసీ రోడ్లు మంజూరయ్యాయి. ఇందుకు ప్రభుత్వం రూ.112.72 కోట్లు మంజూరు చేయగా ఆర్థిక సంవత్సరం చివర్లో పనులు ప్రారంభించారు. అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లాకు రోడ్లు వచ్చాయి. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందని తెలిసి ఇంజినీరింగ్‌ అధికారులు హుటాహుటిన అనుమతులు ఇచ్చారు. అందుకు కూడా గుత్తేదారుల నుంచి ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. మహబూబాబాద్‌ జిల్లాలో దాదాపు 70, భూపాలపల్లిలో 60, ములుగులో 65 శాతం నిర్మాణాలు పూర్తి చేశారు.


ఈ సీసీరోడ్డు మహబూబాబాద్‌ మండలం సండ్రలగూడెంలో గత ఫిబ్రవరిలో నిర్మించారు. ఉపాధిహామీ నిధులు రూ.5 లక్షలతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో 135 మీటర్ల పొడవు.. మూడు మీటర్ల వెడప్పుతో రెడ్‌మిక్స్‌ సహాయంతో నిర్మాణం చేపట్టారు. నిబంధనల ప్రకారం రోడ్డుకు ఇరువైపులా మొరంతో సైడ్‌ బర్మ్‌లు నిర్మించలేదు.

న్యూస్‌టుడే, మహబూబాబాద్‌ రూరల్‌


ఈ సీసీ రోడ్డు ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోనిది. ఈ నెల 17న ఉపాధిహామీ నిధులు రూ.5 లక్షలతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో 105 మీటర్ల పొడవు నిర్మించారు. రెడ్‌మిక్స్‌ ద్వారా రోడ్డు నిర్మాణం చేపట్టారు. వైబ్రేట్‌ యంత్రంతో సమాంతరం చేయలేదు. దీంతో నిర్మాణంలో నాణ్యత లోపించింది. క్యూరింగ్‌ కూడా సరిగా చేపట్టలేదని స్థానికులు వాపోతున్నారు.  

న్యూస్‌టుడే, ఇనుగుర్తి


‘ఎస్టిమేషన్‌, అగ్రిమెంట్‌, క్యూసీ, ఎంబీ రికార్డు, చెక్‌ ఆన్‌లైన్‌ ఇలా ఐదు రకాల అంశాలను ముడిపెడుతూ ఒక్కోదానికి రెండుశాతం చొప్పున మొత్తం ఒకేసారి గంపగుత్తగా 10 శాతం కమీషన్‌ ఇవ్వాలంటూ ఇంజినీరింగ్‌ అధికారులు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.’


ఇదీ పరిస్థితి..

  • మహబూబాబాద్‌ జిల్లాలో ఒక డివిజన్‌ పరిధిలోని  ఏఈ ఒకరు రోడ్డుకు రూ.20 వేలు ఇవ్వాలని అడిగారు. ఆ గుత్తేదారు అంతగా ఇచ్చుకోలేనంటూ మూడు రోడ్లు నిర్మించినందుకు ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున రూ.30 వేలు ముట్టజెప్పారు.
  • డోర్నకల్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఒక మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు చేయించడానికి అధికార పార్టీ నేత స్వయంగా గుత్తేదారులకు పెట్టుబడి పెడుతున్నారు.
  • ఇదే నియోజకవర్గం మరో మండలంలోని ఇంజినీరింగ్‌ అధికారులు ఉన్నతాధికారుల పేరు చెప్పి 10 శాతం ముడుపులు తీసుకుంటున్నట్లు తెలిసింది.
  • భూపాపల్లి జిల్లాలో కొన్ని మండలాల్లో 10 శాతం, ఇంకొన్ని మండలాల్లో 5 నుంచి 8 శాతం చొప్పున ముడుపు తీసుకుంటున్నారు. ములుగు జిల్లాలోనూ గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని