logo

ఇసుకాసురులపై పోలీసుల కొరడా

సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు.

Published : 29 Mar 2024 06:03 IST

జిల్లాలో జనవరి నుంచి 123 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  94 ట్రాక్టర్లు, 5 జేసీబీలు, 4లారీలను సీజ్‌ చేశారు.

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: సహజ వనరులను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించినప్పుడే మనుగడ సాధ్యమవుతుంది. కానీ చాలా వరకు గుట్టలు, ఇసుక, మట్టిని గుళ్ల చేస్తూ వనరులను అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇసుక అక్రమ రావాణా మాత్రం అధికమవుతుంది. కొంతమంది ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు సైతం జేబులు నింపుకుంటున్నారు. పోలీసు అధికారులు రవాణాను అడ్డుకోవడానికి నిరంతరం గస్తీ పెంచినా అక్రమాలు ఆగడం లేదు. కానీ చాలా వరకు పోలీసుల చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయి.

తరలింపునకు అడ్డుకట్ట..

సులవుగా డబ్బు వచ్చే పని కావడంతో కొంచెం రిస్క్‌ చేస్తే ఒక్క రోజు రాత్రి రూ.10 నుంచి 15వేల వరకు సంపాదించొచ్చు అని ఇసుక తరలింపునకు అలవాటు పడుతున్నారు. దీనినే అదునుగా చేసుకుని కొంత మంది ఇదే తమ వృత్తిగా ఎంచుకుని దందా సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఈ సంవత్సరం జనవరి నుంచి అక్రమంగా తరులుతున్న ఇసుకపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బృందాలుగా ఏర్పడి తరలిస్తున్న వారికి అడ్డుకట్ట వేస్తున్నారు.

ఇటీవల గృహ అవసరాలకు స్థానికంగా ఉన్న వాగు నుంచి ఇసుకను తరలించుకోవచ్చని, దీనికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాని ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు అక్రమార్కులకు ఇదొక సరైన అవకాశమని స్థానికులు భావిస్తున్నారు. గృహ అవసరాల పేరుతో ఇసుకను డంపు చేసి వేరే ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై అంచనా వేసి, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బంది చర్యలు చేపట్టాలి.

ప్రధాన ప్రదేశాలు..

జిల్లాలో ముఖ్యంగా మూడు నియోజకవర్గాలు కలిసి ఉన్నాయి. ఇందులో ప్రధానంగా జనగామ నియోజకవర్గ పరిధిలో గానుగుపహాడు, వడ్లకొండ, చీటకోడూరు, పోచన్నపేట, పాలకుర్తి నియోజకవర్గంలో యశ్వాంతాపూర్‌వాగు, ఆకేరు వాగు, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కూనూరు, ఉప్పుగళ్లు, నష్కల్‌, తాటికొండ, కొత్తపల్లి, నెల్లుట్ల, చీటూరు, కిష్టగూడెంతో పాటు మరికొన్ని గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలించేవారు. కానీ ప్రస్తుతం ఇక్కడ పోలీసులు ఆంక్షలు విదించారు. అంతేకాకుండా వాహనాలను అదుపులోకి తీసుకుని, బైండింగ్‌ కేసులు నమోదు చేస్తున్నారు.


నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

- పీ. సీతారాం, డీసీపీ, జనగామ

ఇసుక, మట్టి తరలింపుపై ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలి. ప్రభుత్వ, ప్రైవేటు పనుల కోసం ఉపయోగించే ఇసుకకు తప్పకుండా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు పొందాలి. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక తరలించకుండా వాగు పరిసర ప్రాంతాల్లోని ట్రాక్టర్ల యజమానులకు, స్థానికులకు అవగాహన కల్పిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని