logo

అటకెక్కిన ఆధునికీకరణ

మంగపేట మండలం నర్సింహసాగర్‌ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్‌ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

Published : 29 Apr 2024 04:23 IST

మల్లూరు వాగు ప్రాజెక్ట్‌

న్యూస్‌టుడే, మంగపేట: మంగపేట మండలం నర్సింహసాగర్‌ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్‌ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులను అధికారులు చేపట్టకపోవడంతో పంటలకు సాగు నీరందక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. రెండు దశాబ్దాల పాటు సక్రమంగా నీరందించినా, తరువాత అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకుండా పోతోంది. ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ కాలువల తూములు లీకేజీ వల్ల ప్రాజెక్ట్‌లోకి చేరిన నీరు వృథాగా గోదావరిలో కలిసిపోతోంది. మరోవైపు కాలువల్లో పూడిక తీయకపోవడం, చెట్లు పెరగడం మూలాన ఆయకట్టుకు నీరందటం లేదు. ఏటా సంబంధిత అధికారులకు రైతులు మొర పెట్టుకుంటున్నా ఆలకించే వారు లేరు.  2009- 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో  అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్ట్‌ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. యంత్రాంగం నిర్లక్ష్యంతో ఐదేళ్లకే మళ్లీ కాలువలు పూడికపడ్డాయి. చెట్టుచేమ మొలిచి కాలువలు కనిపించడం లేదు. 2016 జూన్‌లో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందులాల్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించి నిధులకు హామీ ఇచ్చినా విడుదల కాలేదు. ఇటీవల నామినేటెడ్‌ పనుల కింద రూ. 5 లక్షలు మంజూరవగా,  ప్రాజెక్ట్‌ కట్టపై చెట్లు తొలగించి మొరం పోశారు. ఇప్పటికైనా ప్రాజెక్టు ఆధునికీకరణకు అవసరమైన రూ.30 కోట్లు మంజూరు చేయాలని, తక్షణం కాలువల్లో పూడికతీత, చెట్ల తొలగింపునకు కనీసం రూ.2 కోట్లు కేటాయించాలని రైతులు కోరుతున్నారు.

బోరునర్సాపురం వద్ద ఎడమ కాలువలో ఏపుగా పెరిగిన చెట్లు

లబ్ధి చేకూరే గ్రామాలు: కుడి కాలువ పరిధిలో నర్సింహసాగర్‌, గాంధీనగర్‌, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, చుంచుపల్లి, రమణక్కపేట, వాగొడ్డుగూడెం. ఎడమ కాలువ పరిధిలో నీలాద్రిపేట, బాలన్నగూడెం, బుచ్చంపేట, తిమ్మంపేట, చెరుపల్లి, జబ్బోనిగూడెం, బోరునర్సాపురం

చేపట్టాల్సిన పనులు

  • కుడి ఎడమ కాలువల తూముల వద్ద లీకేజీ అరికట్టాలి.
  • ప్రాజెక్ట్‌ కుడి ఎడమ కాలువల్లో పూడిక తీయాలి.
  • కాల్వల్లో చెట్లు పిచ్చి మొక్కలు తొలగించాలి
  • ప్రాజెక్టు మత్తడికి మరమ్మతులు చేయాలి.

 


ప్రాజెక్టు: మల్లూరు వాగు
నిర్మాణం ప్రారంభం: 1976
నిర్మాణం పూర్తి: 1980
కుడి కాలువ ఆయకట్టు: 4,300 ఎకరాలు
ఎడమ కాలువ ఆయకట్టు: 3,500 ఎకరాలు
2009-10లో ఆధునికీకరణకు కేటాయించిన నిధులు: రూ.14 కోట్లు
ప్రస్తుతం అవసరమైన నిధులు: రూ.30 కోట్లు


అధికారులు పట్టించుకోవాలి

గాదె శ్రావణ్‌కుమార్‌, ప్రాజెక్ట్‌ మాజీ ఛైర్మన్‌

ఏటా తూముల మరమ్మతులు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. శాశ్వత మరమ్మతులు చేపట్టడం లేదు. వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులు చేపడితే ఆయకట్టు రైతులకు మేలు కలుగుతుంది.

లీకేజీలు చేయించాం..

వలీ మహ్మద్‌, ఇరిగేషన్‌ ఏఈ

తూములకు మరమ్మతు చేయించి లీకేజీలు అరికట్టాం. కాలువల్లో ఉన్న పూడికమట్టిని తొలగించేందుకు సంబంధిత అధికారులకు అంచనాలు వేసి పంపించాం. నిధుల మంజూరైతే వెంటనే పనులు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు