logo

నిధులు దూరం.. నిర్వహణ భారం

జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి.

Published : 29 Apr 2024 04:29 IST

పాలకుర్తి, న్యూస్‌టుడే: జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వం జిల్లాలో రూ.20 లక్షల చొప్పున ఖర్చుచేసి 62 రైతు వేదికలు నిర్మించింది. రైతులు, అధికారుల మధ్య మరింత సమన్వయం కోసం మూడ్నాలుగు గ్రామాలకు కలిపి ఒక వేదికను నిర్మించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులు, సాగు, అధిక దిగుబడుల గురించి ఇందులో వివరిస్తారు. టెలికాన్ఫరెన్సుల ద్వారా శాస్త్రవేత్తలు.. రైతులకు, అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఒక్కో రైతు వేదిక నిర్వహణ కోసం ప్రభుత్వం నెలకు రూ.9 వేలు అందించింది. అయితే గతేడాది మార్చి నుంచి నిధులు నిలిచిపోయాయి.

ఖర్చు ఇలా...

నిర్వహణ కోసం ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.9 వేలల్లో... తాగునీటికి రూ.500, విద్యుత్తుకు రూ.1000, పారిశుద్ధ్యం కోసం రూ.3 వేలు, స్టేషనరీ జిరాక్స్‌ ఛార్జీలకు రూ.1000, రైతుల శిక్షణ కోసం రూ.2500, భవన మరమ్మతులకు రూ.1000 ఖర్చు చేయాల్సి ఉంది. అయితే నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రతి మంగళవారం నియోజకవర్గంలోని ఒక వేదికను ఎంపిక చేసి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది.

ఏడాదిగా ఎదురుచూపులే...

గతేడాదిగా నిధులు విడుదల కాకపోవడంతో రైతు వేదికల నిర్వహణ అధికారులకు కష్టంగా మారింది. జిల్లాలో ఒక్కో వేదికకు రూ.1.08 లక్షలు రావాల్సి ఉంది. కొన్ని చోట్ల ఏఈవోలు సొంతంగా ఖర్చు చేస్తున్నారని సమాచారం.

విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటాం..    

వినోద్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి

రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడంతో ఏఈవోలు సొంతంగా ఖర్చు చేస్తున విషయం తెలిసింది. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు