logo

కమలదళం.. గెలుపు వ్యూహం

వరంగల్‌ లక్ష్మీపురలో బుధవారం భాజపా నిర్వహిస్తున్న భారీగా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను కాషాయ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Updated : 08 May 2024 06:37 IST

నేడు ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ


ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, సుబేదారి, రంగశాయిపేట: వరంగల్‌ లక్ష్మీపురలో బుధవారం భాజపా నిర్వహిస్తున్న భారీగా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను కాషాయ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వరంగల్‌ అభ్యర్థి అరూరి రమేశ్‌ గెలుపే లక్ష్యంగా ఈ భారీ సభను నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో జాతీయ, రాష్ట్రస్థాయి అంశాలపై కాంగ్రెస్‌, భారాసల వైఖరిని ఎండగట్టడంతోపాటు, వరంగల్‌కు చెందిన స్థానిక అంశాలు ప్రస్తావించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల వివరాలతోపాటు మోదీ హయాంలో నిర్మించిన జాతీయ రహదారుల గురించి ప్రస్తావించనున్నారు.  విభజన హామీల్లో కీలకమైన గిరిజన వర్సిటీతో పాటు గతేడాది మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కాజీపేటలో పీవోహెచ్‌, హైదరాబాద్‌ వరంగల్‌ కారిడార్‌ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం ఏర్పాటును మోదీ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

 ఏడాదిలో ఇది మూడోసారి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్‌ నగరానికి రావడం ఏడాదిలో ఇది రెండోసారి కాగా ఉమ్మడి జిల్లాకు రావడం మూడోసారి. గతేడాది జులై 8న వరంగల్‌ నగరానికి  వచ్చారు. హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచి కాజీపేట పీవోహెచ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశాక ప్రజలను ఉద్దేశించి బహిరంగసభలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది నవంబరు 27న మానుకోటకు వచ్చారు. మళ్లీ బుధవారం లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఓరుగల్లుకు రానున్నారు.  

ముందస్తు కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌

మామునూరు విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ ప్రధాని మోదీ సభా వేదికకు ఎలా వెళ్లాలో ముందస్తు వాహనాల కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ మంగళవారం నిర్వహించారు. రన్‌వేపై దిగిన తర్వాత మోదీ వాహనంతో పాటు భద్రతా సిబ్బంది, ప్రజాప్రతినిధులకు సంబంధించి 20 వాహనాలు కాన్వాయ్‌లో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. విమానాశ్రయం ప్రధాన గేట్‌ నుంచి వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారి మీదుగా ఎదురుగా ఉన్న మామునూరు టీఎస్‌ఎస్పీ 4వ బెటాలియన్‌ ప్రధాన గేట్‌ లోపలి నుంచి కిలో మీటరు దూరంలో ఉన్న రెండో గేట్‌ మీదుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మామునూరు విమానాశ్రయంలో సైతం ముందస్తుగా మంగళవారం ఓ హెలికాప్టర్‌ చక్కర్లు కొట్టి రూట్‌మ్యాప్‌ను, సిగ్నల్‌ వ్యవస్థను పరిశీలించింది. గత రెండు రోజులుగా ఎస్పీజీ బలగాలు సభావేదిక ప్రాంగణం, విమానాశ్రయం తమ ఆధీనంలోకి తీసుకొని భద్రత చర్యలపై నిఘా పెట్టారు.

నాలుగు చోట్ల పార్కింగ్‌ స్థలాలు

సభకు వాహనాల్లో వచ్చే జనాల కోసం నాలుగు చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణానికి కిలో మీటరు దూరంలో నలువైపులా ఉన్న 80 ఎకరాల బెస్తం చెరువు, తిమ్మాపురం ప్రాంతంలోని 20 ఎకరాల్లో తిప్పరోని కుంట, మామునూరు వైపు 20 ఎకరాల్లో రాంనగర్‌ వద్ద, సభా వేదిక పక్కన 5 ఎకరాల్లో వీఐపీ పార్కింగ్‌ కోసం చదును చేసి సిద్ధంగా ఉంచారు.

పర్యటన ఇలా..

  • ప్రత్యేక హెలికాప్టర్‌లో వేములవాడ నుంచి ఉదయం 11.05 గంటలకు బయలుదేరుతారు. 11.45 గంటలకు మామునూర్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
  •  11.55: బహిరంగ సభ వేదికపైకి వస్తారు.
  •  12 నుంచి 12.50 వరకు:  ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
  •  12.55:  ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.

‘కాజీపేట’ విన్నపం

గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారికి

అనేక మంది ప్రయాణికులను, సరకులను దేశం నలుమూలలకు చేరవేస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నేను మీ కాజీపేట రైల్వే జంక్షన్‌ను. ప్రత్యక్షంగా 10 వేలు, పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న నేను ప్రతి ఎన్నికల్లో ప్రచార అస్త్రంగానే మిగిలిపోతున్నా. 1904లో ప్రారంభమైన నేను అనేక ఒడుదుడుకులతో ముందుకు సాగుతున్నా. నా అభివృద్ధిలో చెప్పుకోవడానికి విద్యుత్తు లోకోషెడ్‌, డీజిల్‌ లోకో షెడ్లు మాత్రమే ఉన్నాయి. మీ సహకారం వల్ల ఇప్పుడిప్పుడే వ్యాగన్‌ షెడ్‌, పిరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ షెడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. అమృత భారత్‌ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా నా భవనానికి రూ.30 కోట్లతో కొత్త హంగులు అద్దుతున్నారు. ఇవన్నీ నాకు సంతోషం కలిగించే అంశాలే అయినా.. చిరకాలంగా నా ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుకునే కోచ్‌ ఫ్యాక్టరీ రాకపాయేననే బాధ వెంటాడుతోంది. ప్రతి లోక్‌సభ ఎన్నికల సమయంలో పోటీ చేసే ప్రతి ఒక్కరూ ఇదే అంశం మీద ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కల మీ వల్లనే సాకారం అవుతుందని నా ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. మరోవైపు నన్ను డివిజన్‌ కేంద్రంగా ప్రకటించాలని దశాబ్ద కాలంగా  డిమాండ్‌ ఉంది. ఇక్కడ ఉన్న కార్యాలయాలను నిర్వీర్యం చేసే పనులు జరుగుతుండడం బాధగా ఉంది. నా పరిధిలో పనిచేసే రైలు డ్రైవర్లను విజయవాడ, సికింద్రాబాదుకు తరలించుకుపోతుంటే గుండె తరుక్కుపోతోంది. డివిజన్‌ కేంద్రంగా ప్రకటిస్తే ఇక్కడి నుంచే అనేక రైళ్లు ప్రారంభమవుతాయి. పలు కార్యాలయాలు సికింద్రాబాద్‌ నుంచి నా పరిధిలోకి వస్తాయి. నా ప్రజలకు కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది. వాటిని సాకారం చేస్తారని ఆశిస్తున్నా.. 

 -న్యూస్‌టుడే, కాజీపేట

  • వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపురం గ్రామం లక్ష్మీపురంలోని 37 ఎకరాల ప్రైవేటు స్థలంలో సభాప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. భారీ వేదికతో పాటు సుమారు లక్ష జనం నీడలో ఉండేలా పరదాలు నిర్మాణం చేశారు. 50 వేల మంది కూర్చునేలా కుర్చీలు ఏర్పాటు చేశారు.
  • సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను కేంద్ర మాజీ మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌, ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు పరిశీలించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు