logo

ఓటేద్దామని మాటిద్దాం..!

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన మహºన్నత అవకాశాన్ని నగరంలో చాలా మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదు. పోలింగ్‌ రోజు నాయకులను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు

Updated : 08 May 2024 06:29 IST

అవగాహన సదస్సులో పాల్గొన్న యువత
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన మహºన్నత అవకాశాన్ని నగరంలో చాలా మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదు. పోలింగ్‌ రోజు నాయకులను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. గ్రామీణ ప్రాంతాల కంటే నగరంలోనే తక్కువ పోలింగ్‌ నమోదు అవుతోంది.  ఈ నేపథ్యంలో పోలింగ్‌శాతం పెంచేందుకు ‘ఈనాడు’ సంకల్పించింది. మంగళవారం వరంగల్‌ నగరంతో పాటు జిల్లాలోని మండలాల్లో అవగాహన సదస్సులు, ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని వక్తలు విలువైన సూచనలు చేశారు.

కార్పొరేషన్‌, వర్ధన్నపేట న్యూస్‌టుడే: మన భవిష్యత్తు నిర్దేశిస్తుంది..ఓటుహక్కు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శశిజాదేవి అన్నారు. హనుమకొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు చైతన్య సదస్సులో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశిజాదేవి ప్రసంగిస్తూ.. విలువైన ఓటును యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథపాలకురాలు కరుణకుమారి మాట్లాడుతూ.. రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలంటే యువత నడుం బిగించాలన్నారు. మాదారపు పురుషోత్తం ప్రసంగిస్తూ ఓటుద్వారా సమర్థులను ఎన్నుకోవాలన్నారు. సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ రోజు స్వచ్ఛందంగా ఓటు వేయాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ  చేశారు. ఎస్‌.కృష్ణవేణి, ఎ.శ్రీవిద్య, ఎల్‌.దివ్య, పి.పూజిత, ఈ.రాజు, టి.కుమారస్వామి, వి.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, ఎన్జీవోస్‌కాలనీ


ప్రలోభాలకు లొంగకూడదు..
డి.భవిష్య, డిగ్రీ విద్యార్థిని

ఓటుతో వ్యవస్థలో మార్పు సాధ్యం. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో సమర్థులైన నేతలను ఎన్నుకోవాలి. అవినీతిపరులకు ఓటేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి.


విద్యావంతులకు పట్టం కట్టాలి..
- దాసరి శివాని, ఎంబీఏ

దేశం, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ప్రజల సమస్యలు పరిష్కరించే విద్యావంతులకు పట్టం కట్టాలి. ఓటు హక్కు వినియోగంలో నిర్లక్ష్యం తగదు. మన భవిత మన చేతుల్లోనే ఉంది. భారత రాజ్యాగం కల్పించిన హక్కును అర్హత గల అందరూ సద్వినియోగం చేసుకోవాలి.


బంధువులకు కూడా చెబుతాం..

వర్ధన్నపేట: ఎన్నికల్లో సమర్థులైన నేతలను ఎన్నుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు శ్రీనివాస్‌ సూచించారు. కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ఉపాధిహామీ కూలీలకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటుహక్కుపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలు తప్పకుండా ఓటు వేస్తామని, కుటుంబ సభ్యులు, బంధువులతో కూడా వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


పోలింగ్‌శాతం పెంచేందుకు కృషి చేయాలి

నర్సంపేట గ్రామీణం: లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా మహిళలు కృషి చేయాలని నర్సంపేట ఐకేపీ ఏపీఎం మహేందర్‌ అన్నారు. ‘ఈనాడు- ఈటీవీ’ ఆధ్వర్యంలో మంగళవారం నర్సంపేటలోని ఆదర్శ మండల సమాఖ్యలో సీఏలు, మహిళా సంఘాల బాధ్యులకు ఓటుహక్కు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏపీఎం మాట్లాడుతూ.. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలన్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారు స్వస్థలాలకు వచ్చి ఓటు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. సీసీలు యాకూబ్‌, మహేందర్‌, శోభ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు