logo

మేడిగడ్డలో.. మూడు గంటలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో మూడు గంటల పాటు పరిశీలన చేపట్టారు.

Updated : 08 May 2024 06:40 IST

బ్యారేజీని పరిశీలించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌

కాళేశ్వర ఆలయంలో పూజలు

 ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహదేవపూర్‌, కాళేశ్వరం న్యూస్‌టుడే : కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో మూడు గంటల పాటు పరిశీలన చేపట్టారు. ముందుగా ఆయన హైదరాబాద్‌ నుంచి వాహన శ్రేణి ద్వారా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. జిల్లా కల్టెకర్‌ భవేశ్‌ మిశ్రా, ఎస్పీ కిరణ్‌ ఖరే స్వాగతం పలికారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కుంగిన పిల్లర్లను పరిశీలన చేశారు. అధికారులు పియర్‌ కుంగుబాటు, పగుళ్లు, దెబ్బతిన్న పరిస్థితులపై సమగ్రంగా ఆయనకు వివరించారు. అనంతరం ఎల్‌అండ్‌టీ అతిథి గృహానికి చేరుకొని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. వీరి వెంట ఇంజనీరింగ్‌ శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అనిల్‌కుమార్‌, నాగేంద్ర, రామగుండం సీఈ సుధాకర్‌, ఈఈ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు : కాళేశ్వరాలయంలో జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌, దెబ్జానీ ఘోష్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడిగడ్డ సందర్శన అనంతరం ఆయన నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో కలిసి మంగళవారం సాయంత్రం కాళేశ్వరాలయానికి చేరుకున్నారు. రాజగోపురం వద్ద వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ద్విలింగాలకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. పార్వతీ ఆలయంలో అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించి స్వామివారి చిత్రపటాలను, శేష వస్త్రాలు, ప్రసాదం అందించారు.

పర్యటన సాగిందిలా ఇలా...

08.30 : హైదరాబాద్‌ నుంచి మేడిగడ్డకు బయల్దేరారు, 11.46 : వరంగల్‌లో టీ విరామం, 12.16 : వరంగల్‌ నుంచి మేడిగడ్డ బ్యారేజీకి పయనం, 01.43 : మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు, 01.45 నుంచి 2.15 వరకు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతంలో పరిశీలన, 02.16 : ఎల్‌అండ్‌టీ అతిథి గృహం(భోజన విరామం), 03.45 : విలేకరుల సమావేశం, 04.00 : కాళేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు, 04.30 : కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు, 05.00 : వేద పండితుల ఆశీర్వచనం, ప్రసాదం, శేషవస్త్రాలు అందజేత, 05.20 : పెద్దపల్లి జిల్లా రామగుండానికి తిరుగుపయనం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు