logo

అప్పుడే పల్లెలపై పడ్డారు..!

వర్షకాలం సీజన్‌ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు.

Published : 18 May 2024 02:11 IST

 నకిలీ విత్తన ముఠాలతో జాగ్రత్త
ఈనాడు, మహబూబాబాద్, న్యూస్‌టుడే, వరంగల్‌ వ్యవసాయం, నర్సంపేట

వర్షకాలం సీజన్‌ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. విక్రయ ముఠాలు పల్లెల్లో తిరుగుతూ పేరున్న కంపెనీల విత్తనాలంటూ అంటగడుతున్నారు. ఈసారి వాట్సాప్‌ గ్రూప్‌లు సృష్టించి ముందస్తుగా బుకింగ్‌లు చేస్తున్నారు. వీటి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాల వల్ల రైతులు ఏటా కోట్ల రూపాయలు నష్టపోతున్న నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం.   

వరి రకాల్లో గింజలకు, విత్తన గింజల ధరల్లో పెద్దగా తేడా ఉండదు.  వాటిని విక్రయించేందుకు మోసగాళ్లు అంతగా ఇష్టపడరు. పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటల్లో గ్రాముల బరువు విత్తనాలకే రూ.వేలల్లో ధర ఉండటంతో వాటిలో నకిలీలు సృష్టిస్తున్నారు. పల్లెల్లోకి వచ్చి పేరున్న కంపెనీలని చెబుతూ అమాయక రైతులకు అంటగడుతున్నారు.  ఇంటింటికి తిరుగుతూ చిరునామా లేని బిల్లులు ఇస్తూ మోసం చేస్తున్నారు.  

మిర్చిలోనే అధికం

ఉమ్మడి వరంగల్‌లో ఈసారి 1.25 లక్షల ఎకరాల్లో మిరప సాగవుతుందని అంచనా. ఎకరానికి 100 గ్రాముల చొప్పున 125 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. నాణ్యమైన విత్తనం కిలో దాదాపు రూ.65 వేలకు లభిస్తే రూ.81.25 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇందులో 30 శాతం నకిలీ విత్తనాల వాటా ఉంటుందని అనుమానిస్తున్నారు. సీజన్‌ ప్రారంభంలో ఇతర ప్రాంతాల్లోంచి నకిలీ విత్తనాల నారు తెచ్చి విక్రయిస్తుంటారు. ఇందులో సింహభాగం గుంటూరు ప్రాంతం నుంచి వస్తోంది.

పత్తిలో

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 5.55 లక్షల ఎకరాల్లో పత్తిసాగువుతుంది. ఎకరాకు 0.90 కిలోగ్రాముల విత్తనాలు అవసరం. ఈ లెక్కన 5002.69 క్వింటాళ్లు అవసరం. దాదాపు రూ.83 కోట్ల వ్యాపారం జరుగుతుంది. వీటిలోనూ నాసిరకమైన విత్తనాలు ఉంటాయి. జిన్నింగ్‌ మిల్లుల నుంచి తెచ్చిన పత్తి గింజలను విత్తనశుద్ధి మందును పట్టించి అందమైన కవర్లు, డబ్బాల్లో నింపి పేరున్న సంస్థల పేరిట రైతులకు అంటగడతారు.

కానరాని అవగాహన

గతంలో సీజన్‌ ప్రారంభంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతు సదస్సులు నిర్వహించి విత్తనాల కొనుగోలు, భూసార పరీక్షలపై అవగాహన కల్పించేవారు. ఇప్పుడు అది కానరావడం లేదు. ఇప్పటికైనా సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

ఇక్కడి నుంచే వచ్చేది

ఉమ్మడి జిల్లాకు నకిలీ పత్తి విత్తనాలు ఎక్కువగా కర్ణాటక నుంచి మహబూబ్‌నగర్, సూర్యాపేట మీదుగా, మహారాష్ట్ర నుంచి మంచిర్యాల మీదుగా చేరుకుంటాయి. మిర్చి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి వస్తాయి. జిల్లా సరిహద్దుల్లో నిఘా పెట్టి వీటికి ముందే అడ్డుకట్ట వేయాలి.

రైతులు చూడాల్సినవి

పరిశోధనస్థానాలు, ప్రభుత్వ అనుమతిగల అధీకృత దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. దానిపై లాట్‌ నెంబరు, కంపెనీ పేరు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. విత్తనాల సంచిపై గల తయారీ స్థలం కంపెనీ ఫోన్‌ నెంబర్, లాట్‌ బ్యాచ్‌ నెంబరు గడువు, జన్యుస్వచ్ఛత, మొలకశాతం, ధర తదితర పూర్తి వివరాలను పరిశీలించాలి. సంచిపైగల క్యూఆర్‌కోడ్‌ను స్కాన్‌చేస్తే వివరాలు చరవాణిలో వెల్లడికావాలి.  

బస్తా లేదా ప్యాకెట్లపై విత్తన వివరాలు లేబుల్‌ రూపంలో లేకపోతే నకిలీవని గుర్తించాలి. నకిలీ విత్తనాల ప్యాకెట్లపై లాట్‌ నెంబరు ఉండదు. నకిలీ విత్తనాలని అనుమానం వస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి.

వ్యాపారులేం చేయాలంటే..

వ్యవసాయశాఖ ఇచ్చిన లైసెన్స్‌ పరిధిలోనే అమ్మకాలు చేపట్టాలి. ఏ కంపెనీకి చెందిన విత్తనాలు అమ్ముతున్నారో దానికి సంబంధించిన ప్రిన్సిపుల్‌ సర్టిఫికెట్‌ (పీసీ) అందుబాటులో ఉండాలి. ప్రతి రోజు స్టాక్‌ వివరాలను నమోదు చేస్తూ ఆ వివరాల బోర్డును అందరికీ కనిపించేలా దుకాణాల్లో  ఏర్పాటు చేయాలి. లేబుల్‌ ఉన్న విత్తనాలను మాత్రమే విక్రయించాలి. విక్రయించిన ప్రతి దానికి బిల్లు ఇవ్వాలి. అందులో లాట్‌ నంబరు రాసి ఇవ్వాలి.

ప్రభుత్వం ఇలా చేస్తే మేలు

నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి. ఇందుకు నకిలీ, నాసికరం విత్తనాల కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను అందుబాటులోకి తీసుకురావాలి. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించేలా చట్టాన్ని రూపొందించాలి.  

టాస్క్‌ఫోర్స్‌ బృందాలు: నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి ఉమ్మడి జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రతి మండలానికి, సబ్‌డివిజన్‌ పరిధిలోనూ విత్తన దుకాణాలను తనిఖీ చేసేందుకు బృందాలున్నాయి. మండల పరిధిలో ఎస్సై, మండల వ్యవసాయాధికారి, సబ్‌డివిజన్‌ పరిధిలో డీఎస్పీ, ఏడీఏ స్థాయి అధికారి, జిల్లా స్థాయిలో ఎస్పీ, జిల్లా వ్యవసాయాధికారి ఉంటారు.


ఆరేళ్లుగా పోరాటం..

నర్సంపేట మండలం చంద్రాయపల్లికి చెందిన రైతు ఎ.రమేష్‌ 2017లో మూడెకరాల్లో మిర్చి సాగు చేయడానికి సంకరజాతి కంపెనీలకు చెందిన విత్తనాలను వరంగల్‌లో కొనుగోలు చేశారు. వాటిని నాటితే 30 గుంటలకే సరిపడా నారు మొలిచింది. నకిలీ విత్తనాలతో మోసపోయినట్లు గుర్తించిన ఆయన కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల కిందట పరిహారం చెల్లించాలంటూ తీర్పు వచ్చింది. ఇప్పటి వరకూ ఆయనకు పరిహారం అందలేదు. తన పోరాటం కొనసాగిస్తానని రమేష్‌ చెప్పారు.


ఈ రైతు ఆదర్శం..

మిర్చి విత్తనాలను చూపిస్తున్న ఈ రైతు నల్లబెల్లి మండలం రేలకుంటకు చెందిన ఎన్‌. కిరణ్‌కుమార్‌. ఏటా మూడెకరాల్లో చపాటా మిర్చి సాగు చేస్తారు. విత్తనాలను స్వయంగా తయారు చేసుకుంటారు. తొలికాతలో మేలురకం కాయలను ఏరి ఎండలో ఆరబెడుతారు. ఆ తర్వాత కాయల్లోంచి గింజలను వేరు చేసి యాంటీ ఫంగస్‌ ద్రావణం కలిపి మూడు రోజుల పాటు ఎండలో ఎండబెట్టి తేమ, గాలి, వెలుతురు లేని ప్రదేశంలో భద్రపరుచుకుంటారు. దాంతో మొలక శాతం బాగా వస్తుందని చెప్పారు.


నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టాస్క్‌ఫోర్స్‌ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తాం. గతంలో నకిలీ విత్తనాలు విక్రయంలో ప్రమేయం ఉన్న వారిపై నిఘా పెట్టాం.  

సుధీర్‌ రాంనాథ్‌ కేకన్, జిల్లా ఎస్పీ, మహబూబాబాద్‌


వ్యాపారులు నిబంధనల ప్రకారం విత్తనాలు విక్రయించాలి. రైతులు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఉండేలా చూసుకోవాలి. పంట సీజన్‌ ముగిసేంత వరకు ఆ బిల్లులను భద్రపరుచుకోవాలి.

అభిమన్యుడు, జిల్లా వ్యవసాయాధికారి మహబూబాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు