logo

ఇంకెంత కాలం ఇలా?

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అనేక గ్రామాల్లో భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

Published : 28 Nov 2022 06:27 IST

అసంపూర్తిగా అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణాలు
ఏలూరు వన్‌టౌన్‌, కొయ్యలగూడెం గ్రామీణ, దెందులూరు, న్యూస్‌టుడే

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అనేక గ్రామాల్లో భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. బిల్లులు సక్రమంగా మంజూరు చేయకపోవడంతో సంబంధిత గుత్తేదారులు పనులను మధ్యలో నిలిపివేశారు. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. చాలీచాలని ఇరుకు అద్దె గదుల్లో, అసౌకర్యాల నడుమ చిన్నారులు విద్యా బోధన సాగించాల్సి వస్తోంది.

జిల్లాలోని 104 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి రూ.12 లక్షల చొప్పున మంజూరు చేశారు. స్థలాలు అందుబాటులో ఉన్నచోట గుత్తేదారులు భవనాల నిర్మాణాలు చేపట్టారు. కానీ, బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని గ్రామాల్లో పునాది దశలో ఉండగా.. మరికొన్ని చోట్ల కిటికీలు, ప్లాస్టింగ్‌, శ్లాబ్‌ స్థాయి వరకు పనులు పూర్తయ్యాయి. నిర్మాణాలు పూర్తి చేయించాలని స్థానికులు అధికారులకు విన్నవించినా ఫలితం కనిపించడం లేదు. ఫలితంగా అద్దె ఇళ్లల్లో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అరకొర నిధులు విడుదల కావడం, ప్రస్తుతం బిల్లులు సరిగ్గా రాకపోవడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.


* కొయ్యలగూడెం మండలం పొంగుటూరులోని అంగన్‌వాడీ భవన నిర్మాణాన్ని 2017-18లో ప్రారంభించగా అసంపూర్తిగా నిలిచిపోయింది. నిధుల విడుదలలో జాప్యం కారణంగా గుత్తేదారు చేతులెత్తేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షపునీరు దానిచుట్టూ నిలిచి కొత్త భవనం కాస్తా శిథిల స్థితికి చేరుతోంది. ఇంకా ప్లాస్టింగ్‌, ఫ్లోరింగ్‌, విద్యుత్తు తదితర పనులు పనులు పూర్తి చేయడానికి మరో రూ.4 లక్షలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు.


* దెందులూరులో 115వ కోడ్‌ నంబరు అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించి గతంలో బాలుర వసతిగృహం ఉన్నచోట భవన నిర్మాణ పనులు చేపట్టారు. ప్లాస్టింగ్‌, కిటికీలు, తలుపులు పెట్టడంతో పాటు ఫ్లోరింగ్‌ పనులు చేస్తే భవనం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం కేంద్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు.


* కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో కోడ్‌ నంబర్‌ 11కు సంబంధించిన అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణాన్ని ఏపీఐపీ నిధులు రూ.7.50 లక్షల అంచనాతో 2013లో ప్రారంభించారు. తొమ్మిదేళ్లు గడుస్తున్నా టైల్‌్్స, రంగులు వేసే పనులు పూర్తి చేయకుండా నిధులు చాలవంటూ అర్ధంతరంగా వదిలేశారు. అదనంగా మరో  రూ.2.50 లక్షల మంజూరు కోరుతూ అధికారులు ప్రతిపాదనలు పంపారు. మరోపక్క తరగతుల నిర్వహణకు సరైన వసతి దొరక్క సిబ్బంది అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే మూడు చోట్లకు కేంద్రాన్ని మార్చారు. చివరకు సామాజిక భవనంలో కాలం వెళ్లదీస్తున్నారు.


త్వరలోనే పూర్తి చేస్తాం

- పద్మావతి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి

జిల్లాలోని పలు గ్రామాల్లో  అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. పనులను వేగవంతం చేయిస్తున్నాం. త్వరలోనే  పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని