logo

ఆక్వా విశ్వవిద్యాలయపనులకు సన్నాహాలు

పశ్చిమగోదావరి జిల్లాకు మంజూరైన జాతీయ స్థాయి ఆక్వా విశ్వవిద్యాలయం తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

Published : 03 Feb 2023 02:41 IST

మొదటి విడత నిధుల మంజూరు

లిఖితపూడిలో వర్సిటీ నిర్మాణ స్థలం చదును

నరసాపురం గ్రామీణ, నరసాపురం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లాకు మంజూరైన జాతీయ స్థాయి ఆక్వా విశ్వవిద్యాలయం తరగతులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. విశ్వవిద్యాలయం కోసం నరసాపురం మండలం లిఖితపూడి గ్రామంలో ప్రభుత్వం సేకరించిన 50 ఎకరాల్లో రహదారి నిర్మాణ పనులు చురుగ్గా చేపడుతున్నారు.

విశ్వవిద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ ఏడాది తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. 2023-24 విద్యా సంవత్సరం ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా బీఎఫ్‌ఎస్‌సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్సు) మొదటి ఏడాది ప్రవేశం కల్పించనున్నారు. తరగతికి 46 సీట్లు కేటాయించారు. జాతీయ స్థాయిలో ఆరు, ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా 40 సీట్లు భర్తీ చేస్తారు. బీఎఫ్‌ఎస్‌సీ కోర్సు నాలుగేళ్లు. భవిష్యత్తులో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. రెండంతస్తుల భవనంలో 24 తరగతి గదులు నిర్మిస్తారు. 200 మంది బాలురు, 200 మంది బాలికలు ఉండేందుకు వసతి, కార్యాలయ నిర్వహణకు భవనాలు నిర్మించనున్నారు.

రహదారుల నిర్మాణం

ఆక్వా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం రూ.338 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా రూ.100 కోట్లు మంజూరుచేసింది. సరిపల్లిలో ఇప్పటికే సేకరించిన భూముల్లో అంతర్గత రహదారుల నిర్మాణ పనులు చేపట్టారు. అవి చురుగ్గా సాగుతున్నాయి. తరగతి గదులు, కార్యాలయం, బాలురు, బాలికల వసతి గృహాలు నిర్మించనున్నారు. త్వరలో ఆయా పనులు చేపడతామని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ పర్యవేక్షక ఇంజినీర్‌ ఇ.రాంబాబు తెలిపారు.

అభివృద్ధి చేస్తున్న రహదారి

350 ఎకరాల సేకరణకు..

ఆక్వా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బియ్యపుతిప్పలో 350 ఎకరాలను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మత్స్య ఉత్పత్తుల పరిశోధన కేంద్రం, మత్స్యక్షేత్రం తదితర అవసరాలకు అనువుగా ఈ భూమిని అభివృద్ధి చేయనున్నారు.

రాష్ట్రానికి  గొప్పవరం

ఈ విశ్యవిద్యాలయం దేశంలో మూడోది. రాష్ట్రంలో మొదటిది. ఆక్వా రంగంలో నిపుణుల కొరత తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్ర అవసరాలే కాకుండా దేశ అవసరాలు తీర్చడానికి విశ్వవిద్యాలయం నుంచి నిపుణులను అందించనున్నాం. వివిధ పరిశోధనలు చేయనున్నాం. ఇది మన రాష్ట్రానికి గొప్పవరం.

 ఓగిరాల సుధాకర్‌, రిజిస్ట్రార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని