logo

ఉచితం..ప్రశ్నార్థకం?

ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ద్వారా ఉచిత విద్య అందించాలనే పథకం అమలు ఆదిలోనే అవస్థలు ఎదుర్కొంటోంది.

Updated : 25 Jul 2023 07:01 IST

25 శాతం సీట్ల అమలుపై గందరగోళం

చింతలపూడి, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ద్వారా ఉచిత విద్య అందించాలనే పథకం అమలు ఆదిలోనే అవస్థలు ఎదుర్కొంటోంది.  పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇచ్చి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్య అందిస్తారనుకున్న తల్లిదండ్రుల ఆశలు లకిందులయ్యాయి.  ఫీజు మాత్రమే మినహాయింపు ఉంటుందని, విద్యాసామగ్రి కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అమ్మఒడికి అర్హులో కాదో తెలియకపోగా విద్యార్థి తల్లి ఖాతాలో జమచేసిన నగదు   తీసుకొచ్చి ఫీజుగా సంబంధిత పాఠశాలలో చెల్లించాలనే నిబంధనతో కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఉచిత సీట్లు పొందిన విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా ఉంది.

గతంలో..

ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్య  అందించేందుకు బెస్ట్‌ ఎవైలబుల్‌ పాఠశాలలను గత ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో సీటు వచ్చిన విద్యార్థులు పదో తరగతి పూర్తయ్యేవరకు రుసుములు లేకుండా చదివారు. పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఉచితంగా ఇవ్వడంతో వేలాది మంది సద్వినియోగం చేసుకున్నారు. ఈ  పాఠశాల విధానాన్ని ప్రస్తుతం నిలిపివేశారు. అయితే గతంలోని బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొన్ని ఆరోపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇలా..

ఎస్సీ విద్యార్థులకే కాకుండా ఎస్టీ, బీసీ, అనాథ, హెచ్‌ఐవీ బారిన పడిన చిన్నారులకు కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను వీరికి కేటాయించారు. ఇందుకు ప్రత్యేక జీవో విడుదల చేయడంతో గత ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. అయితే గత ఏడాది ప్రవేశాలు పూర్తయిన తర్వాత అమలులోకి రావడంతో విద్యార్థుల చేరికలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ ఏడాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేశారు. ఎక్కడ ఎన్నెన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో  ప్రకటించడంతో దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరు విద్యార్థులు చేరారు.

పుస్తకాలు, దుస్తులు ఇవ్వరు

ఏకరూప దుస్తులు, పుస్తకాలు ఉచితంగా ఇవ్వడంలేదు. తోటి విద్యార్థులంతా ఏకరూప దుస్తులు, బూట్లు, టై ధరించి, సంచిలో పుస్తకాలతో వస్తుంటే ఖాళీ చేతులతో తమ పిల్లలు వచ్చి వెళ్లడం సిగ్గుగా ఉంటోందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

* భీమవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదుగురు చేరారు. తోటి విద్యార్థుల మాదిరి అన్ని రకాల పుస్తకాలు తీసుకుని, ఏకరూప దుస్తులు ధరించవచ్చనుకుంటే వాటన్నింటినీ కొనుక్కోవాలన్నారు. చదివేది ఒకటో తరగతే అయినా వీటిని కొనాలంటే దాదాపు రూ.6 వేల నుంచి రూ.9 వేలు ఉండాలి. అమ్మఒడికి అర్హులో కాదో తెలియదు. బ్యాంకులో జమకాకపోతే ఫీజులన్నీ చెల్లించాలి. ఇలాంటి ఇబ్బందులు ఎందుకులే అనుకున్నారో ఏమో వారిలో ముగ్గురు బడికి రావడంలేదు.

* చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామానికి చెందిన ఒకటో తరగతి విద్యార్థినికి స్థానిక ప్రైవేటు పాఠశాలలో సీటు వచ్చింది. గత ఏడాది ఫీజు చెల్లించాలని రోజూ అడుగుతుండటంతో పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటంలేదు. ఈ విద్యార్థి తల్లికి గతేడాది అమ్మఒడి నగదు జమ కాకపోవడంతో అప్పు చేసి చెల్లించడం ఆ కుటుంబానికి ఆర్థిక భారమైంది.

స్పష్టత లేని రుసుములు

బెస్ట్‌ ఎవైలబుల్‌ పాఠశాలలో చదివిన వారి రుసుములను గత ప్రభుత్వాలు వెంటనే చెల్లించాయని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. 25 శాతం సీట్లతో ఉచిత విద్యను గత ఏడాది దాదాపు 1500 మందికి రాష్ట్రంలో అందిస్తే ఒక్కొక్కరికి రూ.15,552 చొప్పున చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదంటున్నారు. తల్లి ఖాతాలో జమ చేసిన అమ్మఒడి నగదును తీసుకోండని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు. దీంతో ఆయా యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2799 మంది ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1386 మంది ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందారు. ఆయా పాఠశాలల్లో బోధన విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పశ్చిమగోదావరి, ఏలూరు డీఈవోలు  ఆర్‌.వెంకటరమణ, పి.శ్యాంసుందర్‌ చెప్పారు.

అమ్మఒడికి మెలిక

అమ్మఒడి నగదును ఖాతాలో జమచేసిన 60 రోజుల్లోగా విద్యార్థి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు  ఫీజులుగా చెల్లించాలని చెబుతోంది. అలా కట్టని పక్షంలో వచ్చే ఏడాది వీరికి అమ్మఒడి నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.పట్టణాల్లో రూ.8వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 ఫీజుల రూపంలో చెల్లించాలని నిబంధనలు రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని