logo

ఎన్నికల వేళ భూసంతర్పణకు యత్నం!

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఆగిరిపల్లి మండల రెవెన్యూ అధికారులు అస్మదీయులకు భూ సంతర్పణకు తెరలేపడం వివాదాలకు తావిస్తోంది.

Published : 27 Mar 2024 04:03 IST

నిర్మాణాలకు ప్లాను సిద్ధం చేసిన భూమి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఆగిరిపల్లి మండల రెవెన్యూ అధికారులు అస్మదీయులకు భూ సంతర్పణకు తెరలేపడం వివాదాలకు తావిస్తోంది. ఆగిరిపల్లి మండలం నూగొండపల్లి గ్రామ పరిధిలోని నూజివీడు-విజయవాడ ప్రధాన రహదారి వెంబడి సింగన్నగూడెం సాయిబాబా గుడికి ఎదురుగా ఉన్న రూ.కోట్ల విలువైన రోడ్డు పోరంబోకు భూమిని  కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. దానికి రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నాయకులు పరోక్షంగా సహకరిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ రహదారికి సరిహద్దు గల భూ యజమానులు ఈ ఆక్రమణలపై ఇటీవల హైకోర్టును ఆశ్రయించడంతో అధికారులకు నోటీసులు పంపారు. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా తాజాగా భూమిని చదును చేసి, మెరక చేసి, ఆదివారం భూ సర్వే నిర్వహించి ప్లాట్లుగా విడగొట్టారు. మంగళవారం పక్కా నిర్మాణాలకు ప్లాన్లు సిద్ధం చేసినా.. అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు, రాజకీయ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఈ భూ పందేరానికి అధికారులు, అధికార పార్టీ నాయకులు పరోక్ష మద్దతు ఇవ్వడంపై రాజకీయ పార్టీల నాయకులు నిరసన తెలుపుతున్నారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం..

ఎవరికి తాము భూములు ఇవ్వలేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చర్యలు తీసుకుంటాం. భూమిలో వేసిన ప్లాన్లను తొలగిస్తాం’ అని తహసీల్దారు బి.మృత్యుంజయరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని