logo

ప్రారంభం సరే.. గుక్కెడు నీరేది!

హడావుడి పనులు.. ఆర్భాటపు ప్రచారాలు వల్ల రూ.లక్షలు నిధులు ఖర్చు చేస్తున్నా ప్రజలకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు.

Published : 27 Mar 2024 04:06 IST

ముదినేపల్లి, న్యూస్‌టుడే: హడావుడి పనులు.. ఆర్భాటపు ప్రచారాలు వల్ల రూ.లక్షలు నిధులు ఖర్చు చేస్తున్నా ప్రజలకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. ఊటుకూరు శివారు నారాయణపురం, ప్రొద్దుటూరు గ్రామాలకు తాగునీరు అందించడానికి జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.36 లక్షలతో మైక్రో మంచినీటి సరఫరా పథకాన్ని నిర్మించారు. జనవరి 28న ఎంపీ, ఎమ్మెల్యే చేతులు మీదగా దీనిని ప్రారంభించారు. అయితే ఇప్పటికీ దాని ద్వారా గుక్కెడు నీరు కూడా సరఫరా చేయలేదు. గుత్తేదారు ఇష్టానుసారం చేసిన అసంపూర్తి నిర్మాణంతో నీటి సరఫరా చేయలేకపోతున్నామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. గతంలోనే వంకరటింకరగా పైపులైను ఏర్పాటు చేస్తుండటంతో గ్రామస్థులు పనులను అడ్డుకున్నారు. అయినా అధికారులు మొక్కుబడిగా పరిశీలించి స్థానికులను బుజ్జగించి వెళ్లిపోయారు. తీరా పథకాన్ని ప్రారంభించాక చూస్తే.. అవగాహన లేక చేసిన పనుల డొల్లతనం బయటపడుతోంది. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కృష్ణారావును సంప్రదించగా.. నీరు సరఫరా చేయడం లేదని తమ దృష్టికి ఎవరూ తీసుకురాలేదన్నారు. పథకాన్ని పంచాయతీకి అప్పగించి పత్రం తీసుకున్నామని, అయితే వారు వినియోగించడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శి ప్రభుకుమార్‌ను సంప్రదించగా.. పైపులైను పూర్తిస్థాయిలో వేయలేదని, ఆ పథకం ద్వారా నీరు సరఫరా చేస్తే అనేక గృహాలకు సరఫరా అవ్వడం లేదని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించి పథకాన్ని వినియోగంలోకి తీసుకోస్తామన్నారు.

వినియోగించని మైక్రో ఫిల్టర్‌ పథకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని