logo

విజిలేస్తున్నారు

జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగుతోంది. రాజకీయ పార్టీల వారు అనుమతులు లేకుండా ప్రచారం చేసినా, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, బ్యానర్లు కట్టినా, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకున్నా, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నా, రాజకీయ విందులు ఏర్పాటు చేసినా..సామాజిక బాధ్యతగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు.

Published : 27 Mar 2024 04:10 IST

ఫిర్యాదులకు సత్వర స్పందన

ఏలూరు కలెక్టరేట్‌, కుక్కునూరు, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగుతోంది. రాజకీయ పార్టీల వారు అనుమతులు లేకుండా ప్రచారం చేసినా, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, బ్యానర్లు కట్టినా, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకున్నా, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నా, రాజకీయ విందులు ఏర్పాటు చేసినా..సామాజిక బాధ్యతగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు.

ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ‘సీ-విజిల్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. చైతన్యవంతులైన ప్రజలు తమ ప్రాంతాల్లో నియమావళి ఉల్లంఘనలపై యాప్‌ ద్వారా సమాచారం పంపిస్తున్నారు.

ఇప్పటివరకు 64.. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ప్రజలు పంపే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిశీలిస్తూ సత్వర చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోగా పరిష్కరిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నాటినుంచి ఇంతవరకు యాప్‌నకు 64 ఫిర్యాదులు అందగా అన్నింటిని పరిష్కరించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంతో పాటు పలువురు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, సంబంధిత శాఖల అధికారులు ఉత్తర్వులిచ్చారు.

ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు.. ఎవరైనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రజలు గుర్తిస్తే సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఒక విభాగం నెలకొల్పారు. ఫిర్యాదు చేసే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఇటీవల ఉంగుటూరులో నియమావళి ఉల్లంఘనలపై ఓ వ్యక్తి యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆ విషయాన్ని కొంత మంది ఉద్యోగులు వైకాపా వర్గీయులకు తెలిపారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో కలెక్టర్‌ వెంటనే విచారణ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేలడంతో ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.

నియోజవర్గాల వారీగా.. దెందులూరు 17, ఏలూరు 5, కైకలూరు 8, నూజివీడు 11,  పోలవరం 13, ఉంగుటూరు 10, చింతలపూడి 0.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని