logo

జగన్‌.. ఇవా మెరున వైద్య సేవలు?

ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యం రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ సీఎం జగన్‌ బోధనాసుపత్రి ఏర్పాటు చేశారు కానీ సేవల గురించి పట్టించుకోకుండా వదిలేశారు.

Published : 30 Apr 2024 06:58 IST

పెద్దాసుపత్రిలోనూ తీసికట్టే

కేసులన్నీ రిఫర్‌లతోనే సరి

 రోగులకు తప్పని కష్టాలు

 

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యం రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ సీఎం జగన్‌ బోధనాసుపత్రి ఏర్పాటు చేశారు కానీ సేవల గురించి పట్టించుకోకుండా వదిలేశారు. ఉమ్మడి జిల్లాకు తలమానికంగా, మెరుగైన సేవలందించిన జిల్లా ఆసుపత్రిని వైద్య కళాశాలగా మార్చాక పరిస్థితి మారిపోయింది. సేవలు అధ్వానంగా మారడంతో పేరంతాపోయింది.

ఏలూరు సర్వజన ఆసుపత్రిలో 350 పడకల సామర్థ్యంతో ఇన్‌పేషెంట్లకు, వంద పడకల మాతాశిశు విభాగంలో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు వైద్య సేవలు అందించాల్సి ఉంది.  బోధనాసుపత్రి ఏర్పాటయ్యాక వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఎక్కువ కేసులను గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. కడుపు నొప్పి, గ్యాస్‌ ట్రబుల్‌ కేసులనూ రిఫర్‌ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక గర్భిణుల విషయానికొస్తే బిడ్డ ఉమ్మనీరు తాగిందని, రక్తం తక్కువగా ఉందని, ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని తదితర సాకులతో రిఫర్‌ చేసేస్తున్నారు. ఇటీవల ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణిని పరీక్షించిన వైద్యులు బిడ్డ ఉమ్మనీరు తాగిందని విజయవాడ పంపించారు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండగా ఇక్కడ చికిత్స అనంతరం విజయవాడ రిఫర్‌ చేశారు.


గర్భిణులకు తప్పని ఇబ్బందులు  

ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ సెంటర్‌ వద్ద నిరీక్షిస్తున్న గర్భిణులు

ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో మూడు ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరికరాలున్నా వాటిని వినియోగించే వైద్యులు లేకపోవడంతో ప్రస్తుతం ఒకటే వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఎక్కువ స్కానింగులు చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో గర్భిణులు స్కానింగ్‌ నిమిత్తం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వైద్యులు స్కానింగ్‌ చేయించుకోమని రాస్తే.. అక్కడ  ఖాళీ లేక రెండు రోజులు ఆగి రమ్మంటున్నారు. ఈ క్రమంలో దూరప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణులు మళ్లీ రావాలంటే వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఇటీవల చింతలపూడి నుంచి వచ్చిన ఓ గర్భిణీకి ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయాల్సి రావడంతో ఆమెను రెండు రోజులు ఆగి రమ్మన్నారు. మళ్లీ రాలేక ఆమె రూ.1200 వెచ్చించి నగరంలోని ప్రైవేటు ల్యాబ్‌లో స్కానింగ్‌ చేయించుకున్నారు. ఇలా ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరికరం ఒకటే వినియోగించడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే సుమారు 300 వెంటిలేటర్లు ఉండగా.. టెక్నీషియన్లు లేక వాటిని వినియోగించడం లేదు.


అత్యవసర విభాగంలోనూ అలసత్వమే

ఇక్కడి రిసెప్షన్‌లో సిబ్బంది సరిగా ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారం కిందట 3 గంటల పాటు ఒక్కరూ కనిపించలేదు. పలువురు రోగులు వైద్య సేవలకు వచ్చి వెనుదిరిగారు. అలాగే వైద్యులు కూడా సకాలంలో రావడం లేదని తెలిసింది. వచ్చినా డ్యూటీ దిగి వెళ్లే సమయానికి కచ్చితంగా వెళ్లిపోతున్నారని.. ఆ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లు వచ్చినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇటీవల హనుమాన్‌ జంక్షన్‌ నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ ఒకరు మధ్యాహ్న వేళ వచ్చారు. అత్యవసర విభాగం వైద్యుడు ఉన్నా తన సమయం అయిపోయిందని.. వేరే వైద్యుడు వస్తారని చెప్పి వైద్యం చేయకుండా  కాలయాపన చేశారు. వేరే డాక్టర్‌ ఆలస్యంగా వచ్చారు. ఈలోగా వైద్య సేవలందక అతను ఇబ్బంది పడ్డారు.


జ్వరం వచ్చినా విజయవాడకే..

తాడేపల్లిగూడేనికి చెందిన అమృత జ్వరంతో బాధ పడుతుండటంతో కుటుంబ సభ్యులు శనివారం సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అవసరాన్ని బట్టి ఐసీయూలో వైద్య సేవలందించకుండా విజయవాడ వెళ్లమన్నారు. కుటుంబసభ్యులు ఆమెను అక్కడికి తీసుకెళ్లేందుకు చాలా ఇబ్బందిపడ్డారు. పెద్ద ఆసుపత్రి అని తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడిక్కి తీసుకొస్తే విజయవాడ వెళ్లమంటున్నారంటూ వారు ఆవేదన చెందారు.


ప్రాథమిక వైద్యం అందించకుండానే..

ఏలూరుకు చెందిన శాంతికి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు శనివారం సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో ఈసీజీ తీసిన వైద్యులు.. ఇక్కడ గుండె వైద్య నిపుణులు లేరని చెప్పి విజయవాడ వెళ్లమన్నారు. కనీసం ఇతర పరీక్షలు చేయలేదు. సీనియర్‌ వైద్యులు చూడలేదు.  


రెండు రోజులు పడుతోంది..

‘రెండు రోజుల కిందట ఆసుపత్రికి వచ్చా. వైద్యులు పరీక్షించి స్కానింగ్‌ రాశారు. చేయించుకోవాలంటే రెండు రోజులు పడుతోంది. మాది ఏలూరుకు 20 కిలోమీటర్లు. ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బందిగా ఉంది’ అని అంజలి వాపోయారు.

రావాలంటే భయమేస్తోంది

‘గతంలో ఇక్కడ మంచి వైద్యసేవలందించే వారు. బోధనాసుపత్రిగా మారాక కేసులన్నీ రిఫర్‌ చేస్తున్నారు. ఇక్కడికి తీసుకురావాలంటేనే భయం వేస్తోంది. వైద్యం చేస్తారో లేదో పంపించేస్తారో అని భయం భయంగా రావాల్సి వస్తోంది’ అని రోగి సహాయకురాలు వెంకటలక్ష్మి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని