logo

జగన్‌ పాలనలో.. శ్రామిక హక్కులకు సంకెళ్లు!

ఒక్క అవకాశం ఇస్తే మీ జీవితాలు మార్చేస్తానంటూ గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రామికులను నిలువునా ముంచేశారు. ఏళ్లు గడిచినా హామీలను అమలు చేయకపోగా హక్కులపై గళమెత్తిన కార్మిక నేతలపై జగన్‌ సర్కారు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది.

Updated : 01 May 2024 06:19 IST

అడుగడుగునా అణచివేత, నిర్బంధకాండ
హామీలపై ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు
నేడు కార్మిక దినోత్సవం
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే

ఒక్క అవకాశం ఇస్తే మీ జీవితాలు మార్చేస్తానంటూ గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రామికులను నిలువునా ముంచేశారు. ఏళ్లు గడిచినా హామీలను అమలు చేయకపోగా హక్కులపై గళమెత్తిన కార్మిక నేతలపై జగన్‌ సర్కారు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసింది. కార్మికుల జీవనం మెరుగవ్వక పోగా మరింత దుర్భరంగా మారడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమబాట పడితే ఉక్కుపాదంతో అణచివేసింది. అసలు ధర్నాలు, నిరసనకు వీలులేకుండా ఏడాది పొడవునా 30 పోలీసు చట్టం అమలు చేసి నిరంకుశ పాలన కొనసాగించింది.

జనవరి 8న ఏలూరు కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్‌ కార్మికులను నిలువరిస్తున్న పోలీసులు


అసంఘటిత రంగం కుదేలు..

గతంలో ఏలూరు, తణుకు, భీమడోలు, చాగల్లు, మార్టేరు, పాలకొల్లు తదితర ప్రాంతాల్లో రైస్‌, స్పిన్నింగ్‌, జూట్‌మిల్లులు, ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఎరువులు, పురుగుల మందుల తయారీ, ఆటోమొబైల్‌ పరికరాల తయారీ, అట్టలు తయారీ పరిశ్రమలు నెెలకొల్పారు. దీంతో పాటు ఆహార ఉత్పత్తుల పరిశ్రమలతో జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్లింది. గత అయిదేళ్లలో ప్రభుత్వ విధానాలతో రైసుమిల్లులు, ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు మూతపడే స్థితికి వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4.10 లక్షల మంది కార్మికులు 64 రకాల రంగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో అధికశాతం మందికి కనీస వేతనాలు లేవు.


రోడ్డెక్కించారు

భీమవరం: అరెస్టులను ఖండిస్తూ పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయింపు

గతంలో సాఫీగా జీవనం సాగించిన కేంద్ర ప్రాయోజిత పథకాల కార్మికులు వైకాపా పాలనలో రోడ్డునపడ్డారు. గౌరవం వేతనం పొందుతున్నారంటూ సంక్షేమ పథకాలకు అనర్హులను చేశారు.  హామీల అమలు కోరుతూ పలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన బాట పడితే    అరెస్టులు, గృహనిర్బంధాలతో భయబ్రాంతులకు గురిచేశారు.

  • మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు చలో విజయవాడకు పిలుపు ఇవ్వగా ముందస్తు గృహ నిర్బంధాలు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆటోలు, బస్సులు ఇలా ఒక్కటేమిటి అన్నింటా గాలించారు. దొరికినవాళ్లను సమీప పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లారు. మహిళలనే ఆలోచన కూడా లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్లలోని ఉంచి తర్వాత వెనక్కి పంపించారు.  
  • ఆశా కార్యకర్తలను 151 సీఆర్పీసీ, గృహనిర్బంధాలు, నోటీసులతో ఇబ్బందులకు గురిచేశారు. పోరుబాటలో భాగంగా 36 గంటల పాటు కలెక్టరేట్‌ ఆవరణలో నిరసన తెలిపారు. రాత్రంతా దోమలు, చలిలో గడిపారు. అక్కడే వంటావార్పుతో నిరసన తెలిపినా జగన్‌ సర్కారు కనీసం స్పందించలేదు.

సమ్మె చేసినా స్పందించక

సూర్యోదయానికి ముందే విధుల్లో నిమగ్నమై స్వచ్ఛత కోసం చెమటోడ్చే పారిశుద్ధ్య కార్మికులనూ జగన్‌ మోసగించారు. వేతనం పెంపు, ఆరోగ్య అలవెన్సుల హామీలను విస్మరించారు. నాలుగున్నరేళ్ల ఎదురు చూసి విసిగి వేశారిపోయిన కార్మికులు ఉద్యమబాట పట్టగా ఉక్కుపాదంతో అణగదొక్కారు.

2024 ఫిబ్రవరి 5న ఏలూరులో ఒప్పంద కార్మికులను అరెస్టు చేస్తున్న పోలీసులు


ఉపాధి దూరమై.. బతుకు భారమై

  • వైకాపా సర్కారు అమల్లోకి తెచ్చిన ఇసుక విధానం నిర్మాణ రంగంపై పెను ప్రభావం చూపింది. గతంలో ఇక్కడి నిర్మాణాలకు ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు రప్పించేవారు. ఇప్పుడు స్థానికంగా పనులు లేక ఇతర రాష్ట్రాల్లో నగరాలకు వలస వెళ్తున్నారు.
  • పెనుగొండ మండలం సిద్ధాంతం, నడిపూడి, ఆచంట మండలం కోడేరు, కరుగోరుమిల్లి, యలమంచిలి మండలం దొడ్డిపట్ల పరిసరాల్లో 60కి పైగా ఇసుక బంటాల్లో 5 వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందేవారు. తెదేపా హయాంలో ఉచిత ఇసుక రవాణా సమయంలో రోజుకు రూ.500 నుంచి రూ.1000 సంపాదించుకున్నారు. వైకాపా వచ్చాక ర్యాంపుల్లో యంత్రాలను వినియోగించడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు.
  • కొబ్బరి ఒలుపు కార్మికులు యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో దాదాపు 9 వేలు మంది ఉన్నారు. ఇక్కడ ఇచ్చే వేతనాలకంటే తమిళనాడులో రెట్టింపు ఉండటంతో ఉపాధి కోసం అక్కడికి వలస వెళ్తున్నారు.
  • భవన నిర్మాణరంగ కార్మికులు 2.90 లక్షలు మంది ఉండగా వారికి దక్కాల్సిన సంక్షేమ బోర్డు నిధులను ఇతర పథకాలకు కేటాయించారు. దీంతో వారి పిల్లల వివాహాలు, విద్యకు అందించాల్సిన సాయం దూరమైంది. కనీసం మట్టి ఖర్చులు అందడంలేదు.
  • భీమవరం, తాడేపల్లిగూడెం తదితర వాణిజ్య ప్రాంతాల్లో ముఠా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ హామీలను గుర్తుచేసేందుకు ఈ రంగంలో 11 వేల మంది ప్రయత్నిస్తే సర్కారు అణచివేత ధోరణితో వ్యవహరించింది. ఆటోకార్మికులు 15 వేలు నుంచి 20వేలు మందిపై ఇంధన భారం, సెస్‌ దోపిడీ కొనసాగుతుంది.

శ్రమ దోపిడీ..
- కె.రాజారామ్మోహనరాయ్‌, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

పలు రంగాల్లో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. అతితక్కువ వేతనాలతో కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆప్కోస్‌ పరిధిలో 800 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు.


అనాలోచిత విధానాలే కారణం
- జేఎన్‌వీ గోపాలన్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

వైకాపా అనాలోచిత విధానాలతో తణుకు, వేండ్ర, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెంలలో పలు పరిశ్రమలు మూతపడ్డాయి.. వాటిలో పనిచేస్తున్న వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి.


కంఠశోష మిగిలింది
- లక్ష్మి, ఆశా కార్యకర్త

గత ప్రభుత్వాలు మిమ్మల్ని పట్టించుకోలేదని, ఇచ్చిన హామీలన్నీ అమలుచేసి తీరుతానని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు నమ్మాం. ‘నేను విన్నాను.. ఉన్నాను అంటే అన్నలా ఆదుకుంటారనుకున్నాం. అధికారంలోకి వచ్చాక జగన్‌ నిజస్వరూపం బయటపడింది. సమస్యలు పరిష్కరించాలని అడిగితే గొంతు నొక్కారు.


అక్కచెల్లెమ్మలు అంటూనే మోసం
- ఎ.అజయ్‌కుమారి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి

వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఏం తప్పు చేశారని మహిళలను పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లారో జగన్‌ సర్కారు సమాధానం చెప్పాలి. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ï£మీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేయడం సిగ్గుచేటు. అక్క, చెల్లెమ్మలు అంటూనే నిలువునా ముంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని