logo

జలఘోష పట్టదా.. జగన్‌

గోదారి ప్రవహించే జిల్లాలో జలఘోష వినిపిస్తోంది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా  వేధిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు అర్ధరాత్రి... అపరాత్రి తేడా లేకుండా కుళాయిల్లో బిందెడు నీటికి అర్రులుచాస్తున్నారు.

Published : 08 May 2024 05:44 IST

పురపాలక సంఘాల్లో వేధిస్తున్న తాగునీటి సమస్య

ట్యాంకర్లపై ఆధారపడుతున్న శివారు ప్రాంత ప్రజలు

గోదారి ప్రవహించే జిల్లాలో జలఘోష వినిపిస్తోంది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా  వేధిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు అర్ధరాత్రి... అపరాత్రి తేడా లేకుండా కుళాయిల్లో బిందెడు నీటికి అర్రులుచాస్తున్నారు. వైకాపా జమానాలో నీటి పంపిణీని కొందరు నాయకులు వ్యాపారంగా మలుచుకున్నారు. ట్యాంకర్‌ నీటిని రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ట్యాంకర్ల ద్వారా నామమాత్రంగా  నీటి సరఫరా చేస్తున్నారు. కనీసం నాలుగైదు బిందెల నీటిని సైతం నింపకపోవడంతో... దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మరికొన్నిచోట్ల పైపులైన్ల లీకేజీ కారణంగా జలాలు రోడ్డుపాలవుతున్నాయి. గూడెం
గొంతెండుతోంది

వేసవిలో తాడేపల్లిగూడెం పుర ప్రజలు తాగునీటికి అల్లాడాల్సిన దుస్థితి. శివారు ప్రాంతాల్లో కుళాయి నుంచి నీళ్లు రాకపోవడంతో యాతన అనుభవిస్తున్నారు. శివారులోని సుమారు 24 ప్రాంతాల ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడి నీటిని పట్టుకుంటున్నారు. ప్రస్తుతం రోజూ 18 మిలియన్‌ లీటర్ల మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా... కేవలం 12 మిలియన్‌ లీటర్లతోనే సరిపెడుతున్నారు. రెండో జలాశయం నిర్మాణానికి మంత్రి కొట్టు సత్యనారాయణ మూడుసార్లు శంకుస్థాపనలు చేసినా... రెండుసార్లు శిలాఫలకాలు ఆవిష్కరించినా... పనులు ముందుకుసాగలేదు.
- న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం అర్బన్‌


తణుకు..నీరివ్వరెందుకు ?

తణుకులోనూ తాగునీటి సమస్యలు వేధిస్తున్నాయి. పట్టణవాసులకు గోదావరి జలాలు సరఫరా చేయాలన్న సంకల్పం నెరవేరడం లేదు. పురపాలక సంఘంలో 34 వార్డులుండగా- 94 వేల మంది జనాభా నివసిస్తున్నారు. పట్టణంలో 45 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఉండగా... 5,600 కుళాయిల కనెక్షన్లతో ప్రజలకు నీరందిస్తున్నారు. రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మనిషికి రోజుకు సగటున 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా- కేవలం 120 లీటర్లతోనే సరిపెడుతున్నారు.  
- న్యూస్‌టుడే, తణుకు


నరసాపురం.. ట్యాంకర్లతో సరి

జీవనది గోదావరి తీరంలోని నరసాపురం పట్టణంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. ఓవైపు నిర్వహణలోపం, మరోవైపు కాలం చెల్లిన పైపులైన్లతో ప్రజలకు పూర్తిస్థాయిలో నీరందడం లేదు. పట్టణ జనాభా 60 వేల మంది కాగా... ప్రైవేటు, పబ్లిక్‌ కలిపి 9,950 కుళాయిలున్నాయి. పీచుపాలెం, ఆదర్శనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీ, కొత్తకాలనీ, గ్రేస్‌నగర్‌, స్టేషన్‌పేట, కొల్లాబత్తులవారిమెరక, కొండాలమ్మ ఆలయ సమీప ఏటిగట్టు తదితర ప్రాంతాలకు కుళాయి ద్వారా జలాలు చేరడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల ప్రజలు పురపాలక ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
- న్యూస్‌టుడే, నరసాపురం


భీమవరం...నీటి ఎద్దడే శాపం

జిల్లా కేంద్రం భీమవరంలోనూ తాగునీటి ఇబ్బందులు వెన్నాడుతున్నాయి. పట్టణ శివారులోనే కాకుండా నడిబొడ్డున సైతం దాహం కేకలు వినిపిస్తున్నాయి. హౌసింగ్‌బోర్డు, చినరంగనిపాలెం తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ సైతం మహిళలు తాగునీటికి పడిగాపులు కాస్తున్నారు. ఉండిరోడ్డు, ఆరేటి నగర్‌, గొల్లవానితిప్పరోడ్డు, ప్రకాష్‌నగర్‌, మున్సిపల్‌ ఎంప్లాయీస్‌కాలనీ, బలుసుమూడి, దుర్గాపురం, నర్సయ్యఅగ్రహారం, లంకపేట, బైపాస్‌రోడ్డు తదితర ప్రాంతాల ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడి జీవిస్తున్నారు. పట్టణంలో పైపులైన్ల లీకేజీ కారణంగా అరకొరగా సరఫరా అవుతోన్న జలాలు రోడ్డుపాలవుతున్నాయి.


పాలకొల్లు...తప్పని కొనుగోలు

పాలకొల్లు పట్టణంలో తాగునీటి సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తోంది. పురపాలక సంఘంలో 31 వార్డులుండగా... 80 వేల జనాభా నివసిస్తోంది. పట్టణంలోని పెదసాయిబాబా ఆలయ సమీపం, రామయ్యహాలు, గూడ్స్‌షెడ్డురోడ్డు, చంద్రాజీనగర్‌, టిడ్కో గృహాలు, మేడిదవారితోట, చిత్తరాయిచెరువుగట్టు తదితర ప్రాంతాలకు రెండు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రతి ఇంటికి కేవలం నాలుగు బిందెలు చొప్పున మాత్రమే రోజుమార్చి రోజు నీటిని అందజేస్తున్నారు. ఫలితంగా పుర ప్రజలు తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది.  

   - న్యూస్‌టుడే, పాలకొల్లు పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు