logo

సారొస్తున్నారని విద్యార్థులను ఉంచేశారు!

పాఠశాల వేళల్లో తనిఖీలు జరగాలి. అప్పుడే ఆ తనిఖీలకు సార్థకత చేకూరుతుంది. అలా కాకుండా అధికారి వస్తున్నారంటూ అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్థులను చీకటి పడినా పాఠశాలకు పరిమితం చేశారు.

Published : 01 Jul 2023 06:17 IST

మీడియా రాకతో ఇంటికి పంపిన ఉపాధ్యాయులు

మైదుకూరు బాలికల పాఠశాల ఆవరణలో విద్యార్థినులు

మైదుకూరు, చెన్నూరు, న్యూస్‌టుడే : పాఠశాల వేళల్లో తనిఖీలు జరగాలి. అప్పుడే ఆ తనిఖీలకు సార్థకత చేకూరుతుంది. అలా కాకుండా అధికారి వస్తున్నారంటూ అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్థులను చీకటి పడినా పాఠశాలకు పరిమితం చేశారు. మీడియా రాకతో మైదుకూరులో పాఠశాల ముగింపు సమయం మరో రెండు గంటల తరువాత విద్యార్థులను ఇంటికి పంపగా, అనంతరం గంటకు ఉపాధ్యాయులు నిష్క్రమించారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జిల్లా పర్యటనకు వస్తున్నట్లు శుక్రవారం సమాచారం అందింది. పర్యటన ఆలస్యం కావడంతో చెన్నూరు నుంచి మైదుకూరు వరకు రహదారికి పక్కనున్న ఉన్నత పాఠశాలలను అప్రమత్తం చేశారు. నిర్ణీత సమయం 4 గంటలకు ముగిసినా ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులను పాఠశాలలోనే ఉంచాలని ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను ఇళ్లకు పంపలేదు. మరో రెండు గంటలు గడిచినా అధికారి రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలలోనే ఉండిపోయారు. పిల్లలు ఇంటికి చేరకపోవడంతో కొందరు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడికి పాత్రికేయులు చేరుకోవడంతో ఉపాధ్యాయులు వెంటనే సర్దుకుని విద్యార్థులను ఇళ్లకు పంపించడం మొదలుపెట్టారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను తమవెంట తీసుకెళ్లగా, మరికొందరు ఆటోల్లో వెళ్లిపోయారు. ఆ తర్వాత గంటకు ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ విషయమై పాఠశాల బాలుర, బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయురాళ్లు రమాదేవి, గంగాభవానిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశంతో పాఠశాల సమయం ముగిసినా కొద్దిసేపు ఉంచాల్సి వచ్చిందన్నారు. ఎంఈవో పద్మలతను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించాల్సి వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రైవేట్ పాఠశాలల బస్సులను సమకూర్చామని తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత లేదన్నారు.


నాసిరకంగా జేవీకే కిట్లు

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అమలు చేస్తున్న జగనన్న విద్యాకానుక డొల్లతనం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ సమక్షంలో బట్టబయలైంది. శుక్రవారం సాయంత్రం చెన్నూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. అనంతరం 11వ వార్డులో నివాసం ఉంటున్న నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వద్దకు వెళ్లి జగనన్న విద్యా కానుక ద్వారా అందజేసిన సామగ్రిని పరిశీలించారు. జేవీవీ కిట్‌ ద్వారా విద్యార్థినికి అందించిన క్లాత్‌ను కుట్టించగా కేవలం రెండు జతలకే సరిపోయిందని.. మూడో జతకు సరపడలేదని వివరించారు. షూస్‌ చూపించాలని కోరగా అవి తెగిపోయి ఉండటాన్ని గుర్తించారు. పాఠశాల ప్రారంభమై పక్షం రోజులు గడవక ముందే పాడైపోవడాన్ని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు అవి గతేడాదివని చెప్పే ప్రయత్నం చేయగా.. విద్యార్థిని తల్లిదండ్రులు ఇటీవల ఇచ్చినవేనని చెప్పడంతో ఖంగు తిన్నారు. అక్కడే ఉన్న మరో విద్యార్థిని వద్దకు వెళ్లి మాట్లాడగా పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపాన్ని గుర్తించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటగా మార్చేందుకు వసతులు, సదుపాయాలు కల్పిస్తోందని.. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పని చేయకపోతే ఎలా అని ప్రధానోపాధ్యాయిని రత్నకుమారికి హితభోద చేశారు. విద్యార్థులకు అందజేసిన జేవీవీ కిట్లను పరిశీలించి సమగ్ర సమాచారాన్ని నివేదించాలని మండల విద్యా శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట బద్వేలు ఆర్డీవో ఆకుల వెంకటరమణ, ఆర్జేడీ కృష్ణారెడ్డి, డీఈవో రాఘవరెడ్డి, ఎస్‌ఎస్‌ఏ పీవో ప్రభాకర్‌రెడ్డి, ఎంఈవో స్టెర్మిల్లారాణి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని