logo

Kadapa: సాయం కోసం వెళ్తే కోరిక తీర్చమన్న ఖాకీ

కుమార్తె తప్పిపోయిందన్న బాధతో ఉన్న ఓ తల్లిని తన కోరిక తీర్చమని ఓ పోలీసు వేధించిన అమానవీయ సంఘటన శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి వచ్చింది.

Updated : 02 Dec 2023 07:33 IST

ఓబులవారిపల్లె మండల మహిళ ఆవేదన
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వెలుగులోకి...

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ఓబులవారిపల్లె: కుమార్తె తప్పిపోయిందన్న బాధతో ఉన్న ఓ తల్లిని తన కోరిక తీర్చమని ఓ పోలీసు వేధించిన అమానవీయ సంఘటన శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా వెలుగులోకి వచ్చింది. ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ దాసరి భాస్కర్‌ బాధిత మహిళ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఓబులవారిపల్లె మండలానికి చెందిన మహిళ తన కుమార్తె (16) ఇంటి నుంచి అదృశ్యమైన విషయమై పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు బాలికను వెతికేందుకు బాధితురాలికి తోడుగా హెడ్‌కానిస్టేబుల్‌ దాసరి భాస్కర్‌, మహిళా కానిస్టేబుల్‌ రేవతిని హైదరాబాద్‌కు పంపారు. అక్కడ హెడ్‌ కానిస్టేబుల్‌ భాస్కర్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధిత మహిళ ఆరోపించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

తోడుగా వచ్చిన మహిళా కానిస్టేబుల్‌ సైతం భాస్కర్‌కు సహకరించాలని చెప్పడం తనకు బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కర్‌ బలత్కారం చేయబోయారని ఆమె ఆరోపించారు. న్యాయం చేయాల్సిన పోలీసే ఇలా ప్రవర్తిస్తే తాను ఎవరికి చెప్పుకోవాలంటూ బాధితురాలు విలపించారు. ఈ విషయమై ఎస్‌.ఐ. శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ బాధిత మహిళ తన కుమార్తె రెండు నెలల కింద అదృశ్యమైనట్లు తమ దృష్టికి తెచ్చారన్నారు. బాలికను వెతికేందుకు సిబ్బందిని హైదరాబాద్‌కు పంపించి గుర్తించామన్నారు. ఆమె పట్ల హెడ్‌కానిస్టేబుల్‌ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. దాసరి భాస్కర్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఆదేశాలిచ్చినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని