logo

జగనాసుర.. ఎప్పుడైనా ఇటుకేసీ చూశావా?

జగన్‌ అరాచక పాలనలో పుడమి పుత్రులకు కన్నీళ్లే మిగిలాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటైన కేసీ కాలువ వైపు సీఎం జగన్‌ తన అయిదేళ్ల పాలనలో కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతు ప్రయోజనాలను కాపాడేవిధంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

Updated : 30 Apr 2024 07:09 IST

వైకాపా అరాచక పాలనలో ఆయకట్టు రైతులకు కన్నీళ్లు
న్యూస్‌టుడే, మైదుకూరు

జగన్‌ అరాచక పాలనలో పుడమి పుత్రులకు కన్నీళ్లే మిగిలాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో ఒకటైన కేసీ కాలువ వైపు సీఎం జగన్‌ తన అయిదేళ్ల పాలనలో కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. రైతు ప్రయోజనాలను కాపాడేవిధంగా నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కరవుకు నిలయమైన వైయస్‌ఆర్‌ జిల్లాలోని మైదుకూరు డివిజన్‌ పరిధిలోని 10 మండలాల్లోని రైతులు పెట్టుకున్న ఆశలను నిర్వీర్యం చేసింది.  జగన్‌ పాలనలో అన్నదాతలు ఆరుతడి పంటలకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకొంది. కేసీ కాలువ మైదుకూరు డివిజన్‌ పరిధిలో 82 వేలు ఎకరాలు ఆయకట్టు ఉండగా, 2021లో 57,898 ఎకరాలు, 2022లో 67,606 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. గతేడాది వర్షాభావంతో వరి సాగుకు నీరివ్వకపోవడంతో ఆరుతడి పంటలతో కర్షకులు సరిపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితి దాపురించింది.


ఉపాధి కూలీలే దిక్కు

రాజోలి వద్ద పూడికతీస్తున్న ఉపాధి కూలీలు

ఆయకట్టు చివరి వరకు సక్రమంగా సాగునీరందాలంటే ఏటా నిర్వహణ అవసరం. ఏళ్లుగా నిధులు కేటాయించకపోవడంతో రాజోలి ఆనకట్ట నుంచి కాలువ ప్రారంభమయ్యే ఆరేడు కిలోమీటర్ల వద్ద 3 నుంచి 4 అడుగుల మేర పూడిక చేరింది. సమస్య జఠిలమవుతుందని భావించిన ఆయకట్టు అధికారులు ఉపాధిహామీ పథకం కింద రాజుపాలెం మండలం, నంద్యాలజిల్లా చాగలమర్రి మండల పరిధిలోని దాదాపు వెయ్యి మంది కూలీలతో పూడికతీత పనులు చేపట్టారు.


ఘనమైన చరిత్ర

కేసీ ప్రధాన కాలువ

బ్రిటిష్‌ హయాంలో సరకు రవాణా నిమిత్తం ఏర్పాటు చేసిన కేసీ కాలువ కర్నూలు జిల్లా సుంకేశుల నుంచి ప్రారంభమై కడప నగర శివారులో 305.60 కిలోమీటరు వద్ద ముగుస్తుంది. తరచూ కాలువకు గండ్లు పడుతుండడంతో ఇంజినీర్‌ మెకంజ్‌ సూచనతో సాగునీటికి ప్రాధాన్యం కల్పించారు. 1906 నుంచి అంచెలంచెలుగా ఆయకట్టును అభివృద్ధి చేశారు. బచావత్‌ ప్రకారం 39.90 టీఎంసీలు తుంగభద్ర నుంచి కేసీ కాలువకు కేటాయించినా నీరు సక్రమంగా అందని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హయాంలో శ్రీశైలం జలాశయానికి పోతిరెడ్డిపాడు వద్ద హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయించి కేసీ కాలువకు నీరు మళ్లించేవిధంగా చేశారు.


రాజోలి జలాశయం నిర్మించి ఉంటే...

రాజోలి జలాశయం శిలాఫలకం ఆవిష్కరణలో సీఎం జగన్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు (పాతచిత్రం)

రాజోలి జలాశయం నిర్మించి ఉంటే కేసీ కాలువ ఆయకట్టు సస్యశామలమయ్యేది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ జలాశయానికి సీఎం జగన్‌ 2019, డిసెంబరు 23న తిరిగి శంకుస్థాపన చేసినా నేటికీ పనులు ప్రారంభించకపోవడం వైకాపా అసమర్థ పాలనకు తార్కాణంగా నిలుస్తోంది. జలాశయం నిర్మించి ఉంటే ఆయకట్టు కింద సాగు, తాగునీటి ఇబ్బందులు తొలిగేవి. మాట తప్పను...మడమ తిప్పను అంటూ చెప్పుకొనే సీఎం జగన్‌ రాజోలి జలాశయం విషయంలో మాట తప్పారు.


మురుగు కూపాన్ని తలపిస్తోంది

మైదుకూరులోని వనిపెంటరోడ్డులో కొండపేట కాలువలో వ్యర్థాలు

పట్టణం, గ్రామాల పరిధిలోని పంట కాలువలు మురుగు కాలువలను తలపిస్తున్నాయి. మైదుకూరు పట్టణ పరిధిలో దాదాపు 3 కిలోమీటర్ల మేర మురుగును తలపిస్తోంది. కాలువకిరువైపులా ఉన్న వారితో పాటు పట్టణ వాసులు చెత్తాచెదారం కాలువల్లో పడేస్తుండడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. మైదుకూరు, కడప, చెన్నూరు తదితర ప్రాంతాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. కాలువలోని చెత్త పూడికగా మారి తూముల్లోకి చేరి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతోంది. కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.


దెబ్బతిన్న లైనింగ్‌కు మరమ్మతులేవీ?

రాజోలి-ఇడమడక మధ్య దెబ్బతిన్న రాతి కట్టడం

రాజోలి ఆనకట్ట నుంచి ఇడమడక వరకు తరచూ కాలువకు గండ్లు పడుతుండడంతో సాగునీటి సరఫరాకు ఆటంకాలు తలెత్తడంతో 10 కిలోమీటర్ల పరిధిలో కాలువకిరువైపులా రాతి కట్టడం నిర్మించి సిమెంట్‌ పూత వేయించారు. జపాన్‌ ప్రభుత్వం అందజేసిన నిధులతో ప్రధాన కాలువలతోపాటు ఉప కాలువలను ఆధునికీకరించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత జగన్‌ పాలనలో కనీస నిర్వహణ లేకపోవడంతో రాతికట్టడం పలుచోట్ల దెబ్బతిరి రాళ్లు బయటకొచ్చాయి. మరికొన్నిచోట్ల ఉబ్బి కనిపిస్తోంది. లైనింగ్‌ సైతం చీలికలు వచ్చాయి. వర్షాలతో చీలికల్లో నీరు చేరి మరింత ఛిద్రం కాకముందే లైనింగ్‌ పనులతోపాటు దెబ్బతిన్న రాళ్ల కట్టడాన్ని పునరుద్ధరించాల్సి ఉన్నా నేటికీ నిర్వహణ కరవైంది.  


వెనకడుగు వేస్తున్న గుత్తేదారులు

ఇడమడక సమీపంలో దెబ్బతిన్న అడుగుభాగం

గతేడాది ఆయకట్టు పరిధిలో 90 పనులకు రూ.10 కోట్లు కేటాయించారు. 87 పనులకు టెండర్లను పిలవగా 80 పనులకు గుత్తేదారులతో ఒప్పందాలు జరిగాయి. రూ.7 కోట్లు విలువ చేసే 65 పనులు పూర్తి చేశారు. ఇప్పటివరకు రూ.కోటిలోపే బిల్లులు చెల్లించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో మిగిలిన పనులు పూర్తిచేసేందుకు గుత్తేదారులు వెనకడుగు వేస్తున్నారు.ః రాజోలి ఆనకట్ట నుంచి మైదుకూరు వరకు ప్రధాన కాలువలో దెబ్బతిన్న పనులకు రూ.70 లక్షలతో గుత్తేదారుతో గతేడాది ఒప్పందం జరిగింది. దువ్వూరు-మైదుకూరు మధ్య రూ.20 లక్షల విలువ చేసే పనులను చేపట్టినా బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు ముందుకు రాలేదు.  

 


ఆయకట్టు రోడ్లదీ అదే పరిస్థితి

దువ్వూరు మండలం జిల్లెలో అధ్వానంగా  పంటకాలువ

కాలువ నిర్వహణకు ఆయకట్టు పరిధిలో రైతుల రాకపోకలకు వీలుగా ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేసింది. మూడు ప్యాకేజీల్లోని రెండింటిలో పనులు జరుగుతుండగా, రూ..11 కోట్లు విలువ చేసే మూడో ప్యాకేజీలో చాపాడు, ఖాజీపేట, ప్రొద్దుటూరు సెక్షన్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రాలేదు.


భయం... భయం

రాజోలి ఆనకట్ట నుంచి ఇడమడక వరకు రూ.50లక్షలతో మరమ్మతులకు నిధులు కేటాయించింది. కానీ పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతండడంతో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నేటికీ మరమ్మతులు నోచుకోక ఇడమడక సమీపంలో వక్కిలేరు వంకపై ఉన్న టన్నెల్‌గోడ శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో అన్న భయాందోళనలోప్రజలు ఉన్నారు.


నిర్వహణకు సిబ్బంది ఏరీ?

కేసీ కాలువ ఆయకట్టు కింద 71.3 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 81.7 కిలోమీటర్ల మేర ఉప కాలువలు, 13 ఆయకట్టు చెరువులున్నాయి. కాలువ పర్యవేక్షణకు ఆరు సెక్షన్లకు ఆరుగురు ఏఈలు ఉండాల్సి ఉండగా మైదుకూరు సెక్షన్‌ అధికారి ఇటీవలే బదిలీ అయ్యారు. మూడేళ్లుగా కడప సెక్షన్‌కు అధికారి లేక ఖాళీగా ఉంది. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 25 మందికి ఆరుగురు మాత్రమే ఉన్నారు. జూన్‌ ఆఖరికి ఒక వర్క్‌ ఇన్‌స్పెక్టరు ఉద్యోగ విరమణ చేయనున్నారు. నిరంతరం కాలువలను పర్యవేక్షిస్తూ సక్రమంగా సాగునీరందేలా చేయడానికి 94 మంది లష్కర్లుండాలి. కేవలం 33 మంది మాత్రమే ఉన్నారు. కాలువల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని