logo

పోస్టల్‌ బ్యాలట్‌లో గందరగోళం!

జిల్లాలో రెండో రోజైన సోమవారం కూడా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రాలకు అధికారులు పంపిన ఓటర్ల జాబితాలో చాలా మంది ఉద్యోగుల పేర్లు లేకపోవడం,

Published : 07 May 2024 05:55 IST

డ్యూటీ ఆర్డర్‌ కాపీతో వచ్చిన వారికి బ్యాలట్‌ ఇవ్వని అధికారులు
ఎన్నికల అధికారులతో వెలుగు, ఆర్టీసీ సిబ్బంది తీవ్ర వాగ్వాదం

ఓటర్ల జాబితాలో పేరున్నా ఎందుకు ఓటుకు అనుమతించరని  అధికారులను ప్రశ్నిస్తున్న వెలుగు సిబ్బంది

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో రెండో రోజైన సోమవారం కూడా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్‌ కేంద్రాలకు అధికారులు పంపిన ఓటర్ల జాబితాలో చాలా మంది ఉద్యోగుల పేర్లు లేకపోవడం, మరికొందరి పేర్లపై రౌండ్‌ గుర్తు పెట్టి ఉండడంతో అలాంటివారు ఓటుహక్కును వినియోగించుకోలేకపోయారు. వెలుగు సిబ్బందికి తొలుత ఎన్నికల విధులకు తీసుకుంటున్నట్లు తొలి జాబితాలో పేర్లతో కూడిన ఆర్డర్‌ కాపీలు ఇచ్చారు. అనంతరం వారిని విధులకు దూరంగా ఉంచారు. తాము ఎన్నికల విధుల ఆర్డర్‌తోనే వచ్చామని, జాబితాలో పేరు ఉన్నా ఎందుకు ఓటు వేయనివ్వరని వెలుగు సిబ్బంది ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరి పేర్లు రౌండ్‌ చేసినప్పటికీ ఓటు వేసేందుకు అనుమతించారని, అందరికీ ఒకే పద్ధతి పాటించాలంటూ ఆగ్రహించారు. రాజంపేట పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పరిశీలించారు. తొలిరోజు చోటు చేసుకున్న పరిణామాలపై విచారించారు.

రాయచోటి : పేరు లేకపోవడంతో వెళ్లిపోతున్న ఆర్టీసీ డ్రైవర్‌ ప్రసాద్‌రెడ్డి

  • పోలింగ్‌ ఏజెంట్ల ముసుగులో కొందరు విచ్చలవిడిగా కేంద్రాల్లో వెళ్లడం, బయటకు రావడం కనిపించింది. బయట నుంచి ఓటు వేసేందుకు లోపలకు వెళ్లేవారి గురించి ఏజెంట్లకు బయట ఉన్న వారి అనుచరులు సమాచారం అందించడంతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లే వారి వద్దకు ఏజెంట్లు వెళ్లడం, తమ అభ్యర్థికే ఓటేయాలని సైగలు చేస్తుండడం కనిపించిందని కొందరు ఉద్యోగులు చర్చించుకోవడం కనిపించింది.
  • పోస్టల్‌బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రాల సమీపంలోనే వైకాపా నేతలు మకాం వేసి ఉద్యోగులకు డబ్బులు పంపిణీ చేశారు. కొందరు దిగువ శ్రేణి ఉద్యోగులకు ముందుగా సమాచారం అందించి పంపిణీ చేసే ప్రదేశాలకు అక్కడే ఉన్న కార్యకర్తలు తీసుకెళ్లి డబ్బులు ముట్టజెప్పుతూ వచ్చారు. ఓటుకు రెండు ప్రధాన పార్టీల్లో ఒకరు రూ.2 వేలు ఇవ్వగా, మరొకరు రూ.1,500 చొప్పున పంపిణీ చేశారని ఓటుకు వెళ్లి వచ్చిన ఉద్యోగులు చర్చించుకోవడం కనిపించింది.

83.79 శాతం పోలైన ఓట్లు : రెండో రోజు కొనసాగిన పోస్టల్‌ బ్యాలెట్లకు సంబంధించి జిల్లాలో 83.79 శాతం ఓట్లు పోలయ్యాయి. పీలేరులో అత్యధికంగా 91.90 శాతం ఓట్లు పోలయ్యాయి. తంబళ్లపల్లెలో 91.28, రాయచోటిలో 90.38, మదనపల్లెలో 85.05, రాజంపేటలో 80.78, పెసిలిటేషన్‌ సెంటర్‌లో 75.88, రైల్వేకోడూరులో 69.52 శాతం ఓట్లు పోలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 17,061 ఓటర్లు ఉండగా, రెండు రోజుల్లో 14,296 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని