logo

150 స్థానాల్లో కూటమి విజయం ఖాయం

ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కూటమి 150 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయమని, ముస్లిం మైనార్టీలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వారి విజయానికి సహకరించాలని ఎమ్మెల్సీ, విశ్రాంత ఐజీ ఇక్బాల్‌ పేర్కొన్నారు.

Published : 07 May 2024 05:56 IST

ముస్లిం రిజర్వేషన్‌పై వైకాపా తప్పుడు ప్రచారం
ఎమ్మెల్సీ, విశ్రాంత ఐజీ ఇక్బాల్‌ అహ్మద్‌

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌, పక్క కూటమి మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కూటమి 150 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం ఖాయమని, ముస్లిం మైనార్టీలు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి వారి విజయానికి సహకరించాలని ఎమ్మెల్సీ, విశ్రాంత ఐజీ ఇక్బాల్‌ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీల 4 శాతం రిజర్వేషన్‌ రద్దవుతుందని వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మదనపల్లెలో సోమవారం ఆయన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ముస్లిం మైనార్టీలకు సీఎం జగన్‌  చేసింది శూన్యమని, ఆ పార్టీకి ముస్లిం మైనార్టీలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఆర్సీ, సీఏఏ బిల్లులపై తెర వెనుక నుంచి ఓట్లు వేసి అందరి కంటే ముందుగా ఆమోదం తెలిపిన వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి, రూ.2.50 లక్షలు కోట్లకు బటన్‌ నొక్కారని, మిగిలిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కేంద్రం మంజూరు చేసిన రూ.400 కోట్లు మింగేశారని ఆరోపించారు. వైకాపా పాలనతో విసుగు చెంది తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానన్నారు. కూటమి మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌బాషా మాట్లాడుతూ ప్రజలు సీఎం జగన్‌ మాటలు నమ్మే రోజులు పోయాయన్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అయిదేళ్లలో చేసిన అరాచకాలతో ప్రజలు విసిగిపోయి అధికార మార్పు కోరుకుంటున్నారన్నారు. ప్రజలు బాగా ఆలోచించి రాష్ట్రానికి ఉపయోగపడే నారా చంద్రబాబునాయుడి నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. వీరివెంట జనసేనపార్టీ నాయకుడు శ్రీరామ రామాంజినేయులు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు