logo

మైనార్టీల హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే

మైనార్టీల మతపరమైన సంరక్షణ, వారి హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే అని ముస్లిం సోదరులు అపోహలు వీడి నిశ్చింతగా ఉండాలని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అన్నారు.

Published : 08 May 2024 05:46 IST

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: మైనార్టీల మతపరమైన సంరక్షణ, వారి హక్కులు కాపాడేది చంద్రబాబునాయుడే అని ముస్లిం సోదరులు అపోహలు వీడి నిశ్చింతగా ఉండాలని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్‌ నివాసంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డితో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా అధికారంలోకి వస్తే మైనారిటీల 4 శాతం రిజర్వేషన్‌ తీసేస్తారని వైకాపా అపోహలు కల్పిస్తోందని వాటిని ఎవరూ నమ్మెద్దని చంద్రబాబు దానికోసం పోరాడుతారన్నారు. భాజపా మేనిఫెస్టోలో ఎన్నార్సీ ఊసేలేదని, ఈ విషయంలో ముస్లింలు ప్రశాంతంగా ఉండవచ్చన్నారు. వైకాపా ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. దుల్హన్‌ పథకంతో రూ.లక్ష ఇస్తానని చెప్పి ఇంతవరకూ ఒక్కరికి కూడా అమలు చేయలేదన్నారు. దానికోసం చాలామంది పెళ్లిళ్లు ఆపుకొన్నారని అన్నారు. విదేశీ విద్య పేరుతో ఆశ చూపి దాని ఊసేలేకుండా చేశారన్నారు. చంద్రబాబు నాయుడు 572 మందిని విదేశాలకు పంపారన్నారు. మైనార్టీ కార్పొరేషన్లతో ఒక్కరికి  ఒక్క ఆటో కూడా కొనివ్వలేదన్నారు. పీఎం జన్‌వికాస్‌ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ముస్లింల కోసం పాఠశాలలు, కళాశాలలు, కమ్యునిటీ హాల్‌లు కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే వాటిని కట్టకుండా నిధులు దుర్వినియోగం చేశారన్నారు. వీటన్నింటిని గమనించి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మునీర్‌, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు