logo

కొలువుదీరావు... కొంప ముంచావు!

నగరపాలక, పుర, నగర పంచాయతీల్లో మీకు సొంత ఇల్లుందా? పోనీ ఇంటి నిర్మాణానికి సెంటు స్థలమైనా ఉందా? వైకాపా ప్రభుత్వం విధించే ఆస్తిపన్నులు చెల్లించడానికి మీ ఆస్తులు సరిపోక పోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్నామని సంబరపడే వారికి సంకటం తప్పదు.

Published : 08 May 2024 05:56 IST

అయిదేళ్ల జగన్‌ పాలనలో ఆస్తిపన్నుకు రెక్కలు
పట్టణ, నగర వాసులపై మోయలేని ఆర్థిక భారం
పేద, మధ్య తరగతి ప్రజలపై వైకాపా సర్కారు బాదుడు
న్యూస్‌టుడే, కడప నగరపాలక, ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు పట్టణం,  మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు

నగరపాలక, పుర, నగర పంచాయతీల్లో మీకు సొంత ఇల్లుందా? పోనీ ఇంటి నిర్మాణానికి సెంటు స్థలమైనా ఉందా? వైకాపా ప్రభుత్వం విధించే ఆస్తిపన్నులు చెల్లించడానికి మీ ఆస్తులు సరిపోక పోవచ్చు. అద్దె ఇంట్లో ఉంటున్నామని సంబరపడే వారికి సంకటం తప్పదు. ఆస్తి పన్ను పెంచుతూ పోతే ఇంటి యజమాని అద్దె పెంచకుండా ఉంటారా? పట్టణ వాసులు అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే... సొంత ఇల్లు ఉన్నా... అద్దె ఇంట్లో ఉన్నా మోయలేని పన్నుల భారంతో అందరి జీవితాలు నడివీధికి రాక తప్పదు.! వైకాపా పాలనలో ఏటా పన్నులు పెంచి అడ్డుగోలుగా వసూలు చేస్తున్న వైనంపై ప్రత్యేక కథనం.  

2019-20 ఆర్థిక సంవత్సరంలో కడప నగరపాలక సంస్థ పరిధిలోని ప్రైవేటు ఆస్తులపై విధించిన ఆస్తిపన్ను రూ.20,93,74,096 కాగా, 2023-24 నాటికి వసూలు చేయాల్సిన ఆస్తిపన్ను రూ.34,51,08,009లకు చేరింది. అయిదేళ్ల జగన్‌ పాలనలో కడప నగర వాసులపై సుమారు 65 శాతం పెరిగి రూ.13,57,33,913 పన్నుభారం పడింది.  ఖాళీ స్థలాలపైనా విపరీతంగా పన్ను విధించారు. 2019-20లో రూ1,03,63,673 పన్ను విధించగా, 2023-24 నాటికి రూ3,56,08,191 పెరిగింది. అయిదేళ్లలో 243 శాతం పెరిగి ప్రజలపై రూ.2,52,44,518 పన్ను భారం పడింది.

ప్రభుత్వం తెచ్చిన నూతన పన్ను విధానం ఇదే

పాత ఆస్తిపన్ను విధానానికి వైకాపా సర్కారు స్వస్తి పలికి మూలధన విలువ (ఆస్తి మార్కెÆట్‌ విలువ) ఆధారంగా పన్నులు విధిస్తోంది.  పాతపద్ధతిలో ఏటా రూ.2వేలు ఆస్తి పన్ను చెల్లిస్తుంటే, కొత్త పద్ధతిలో ఆస్తి మార్కెట్‌ విలువపై 0.5 శాతం పన్ను విధిస్తారు. ఆస్తి విలువ రూ.35 లక్షలు అనుకుంటే రూ.17,500 ఆస్తిపన్ను చెల్లించాలి. రూ.2 వేలకు బదులు ఒకేసారి రూ.17,500 చెల్లించాల్సి వస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వ పెద్దలు ఏటా ఆస్తిపన్నుపై 15 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ ఇంకో మెలికఉంది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఏటా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్‌ విలువలు పెంచుతూనే ఉంటుంది. మార్కెట్లో ఆస్తివిలువ పెరిగితే పన్ను పెంపు నిరవధికంగా కొనసాగుతూనే ఉంటుంది.

వాణిజ్య భవనాలపై...

రూ.35 లక్షల విలువైన వాణిజ్య భవనానికి 2 శాతం అంటే రూ.70 వేలు దాకా ఆస్తిపన్ను చెల్లించాలి. కొత్తగా నిర్మించిన భవనమైతే తొలి ఏడాది నుంచి రూ.70 వేలు చెల్లించాలి. పాత భవనమైతే పాత పద్ధతిలో చెల్లిస్తున్న పన్నుపై ఏటా 15 శాతం పెంపు ఉంటుంది.


ఇంటి నిర్మాణం కలేనా?: కొత్తగా ఇల్లు నిర్మించుకున్న వారికి పన్నుపోటు తప్పడం లేదు. మార్కెట్‌ విలువ రూ.35 లక్షలు ఉంటే 0.5 శాతం అంటే రూ.17,500 ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏటా ఈ బాదుడు పెరుగుతూనే ఉంటుంది.  


ముక్కుపిండి మరీ వసూలు

- బీఎన్‌ వెంకటసుబ్బయ్య, మైదుకూరు

గత తెదేపా ప్రభుత్వం హయాంలో రూ.1142 ఇంటిపన్ను వచ్చేది. వైకాపా పాలనలో ఏటా పన్నులు పెరగడంతో రూ.4202కు పెరిగింది. పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తున్నా మౌలిక సౌకర్యాలు కరవయ్యాయి. వేసవిలో మైదుకూరు పట్టణానికి తాగునీరు అందించలేని దుస్థితిలో నెలకొంది.వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.  


ఏటా 15 శాతం వడ్డన

- ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు

వైకాపా ప్రభుత్వం ఏటా 15 శాతం పన్నులు పెంచుతూ పట్టణవాసుల నడ్డివిరిచింది. గతంలో ఆస్తిపన్ను రూ.13,578 చెల్లించాను. ప్రస్తుతం పన్నులు విపరీతంగా పెంచడంతో రూ.15,614 చెల్లించాను. ఇలా పెంచుకుంటూ పోతే సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం పెరుగుతుంది.


రెండింతలు పెరిగింది

 - రాజశేఖర్‌ బద్వేలు

ఆస్తి పన్ను పెంచుతున్నారే కానీ పట్టణంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. 2020లో రూ.3,018 పన్ను ఉంటే ప్రస్తుతం రూ.5,011కు పెంచారు. రూ.1993 అదనంగా మాపై భారం పడింది. ఇలా పన్నులు పెంచుకుంటే పోతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతకాలి. పేదలపై పన్నుభారం మోపినా వైకాపా సర్కారుకి ఓటుతో బుద్ధి చెబుతాం.


ఓటుతో బుద్ధి చెబుతాం

- సిలాస్‌ రాజ్‌ అశోక్‌నగర్‌ కడప

గతంలో రూ.1000 ఉండే ఇంటిపన్ను రెండేళ్లలోనే రూ.1700 దాకా పెరిగింది. ఇకపై ప్రతి ఏటా 15శాతం పెంచుతారని తెలిసింది. ఇళ్లు ఉండేది పన్ను చెల్లించడానికా? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. వైకాపా పాలనలో ఇష్టానురాజ్యంగా పన్నులు పెంచేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుతాం. ఏ ప్రభుత్వం కూడా ఇంతలా ఆస్తి పన్ను పెంచలేదు. చివరికి చెత్తపై కూడా పన్ను వేసింది. పన్ను భారం తగ్గించాలి.


అడ్డుగోలుగా పెంపు

- గంగయ్య, రాయచోటి

రాయచోటిలో నాకు సొంతిల్లు ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆస్తి పన్ను సరాసరి రూ.1,500 చెల్లించాను. వైకాపా పాలనలో ఆస్తి పన్నును అడ్డుగోలుగా పెంచడంతో ప్రస్తుతం రూ.5,000 వరకు చెల్లిస్తున్నాను.  


సామాన్యులపై భారం

- అచ్యుతరాజు, బద్వేలు

సీఎం జగన్‌ రూ.పది ఇచ్చి ప్రజల నుంచి రూ.వంద లాగుతున్నారు. ఏటా 15శాతం ఆస్తి పన్ను పెంచుతూ పట్టణంలో ఉంటే పేదలు, మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచారు. వైకాపా పాలనలో పన్నులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు.


నిలువు దోపిడీ

- హరి, ప్రొద్దుటూరు

వైకాపా పాలనలో పురపాలకలో ఏటా ఆస్తి పన్ను పెంచుతూ వస్తున్నారు. గతంలో రూ.1000 ఉంటే ప్రస్తుతం రూ.1300ల దాకా ఇంటి పన్ను పెరిగింది. తనకు వచ్చే ఆదాయంతో పెరిగిన పన్నులను చెల్లించడం ఆర్థిక భారంగా మారింది. చెత్తపై కూడా పన్నులు వేసిన ప్రభుత్వంగా వైకాపా నిలిచింది.


ఇలాగైతే బతికేదెలా?

-వెంకోబరావు, విశ్రాంత ఉద్యోగి, ప్రొద్దుటూరు

నేను పెన్షన్‌ మీద ఆధారపడి బతుకుతున్నా. గతంలో రూ.824 ఇంటి పన్ను వచ్చేది. పన్ను పెంపుతో ప్రస్తుతం రూ.1442 చెల్లించాల్సి వస్తోంది. ప్రతి ఏటా ఇచ్చే రాయితీ 5శాతం నిలిపేశారు. వైకాపా ప్రభుత్వంలో ఆస్తిపన్నుతో పాటు చెత్త మీద వసూలు చేస్తున్నారు. ఇలా నిలువు దోపిడీ చేస్తుంటే బతికేదెలా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు