logo

మద్యమే ఉండదన్నావ్‌.. మధ్యలోనే చంపేస్తున్నావ్‌..!

దశల వారీగా మద్యనిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్‌ అధికార పీఠం ఎక్కాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బార్లు తెరిచి లెక్కకు మించిన విక్రయాలతో పేదలను పిండేస్తూ జేబులు నింపుకొంటున్నారు.

Published : 08 May 2024 06:18 IST

నిషేధిస్తామన్న హామీకి జగన్‌ తిలోదకాలు
నకిలీ, కల్తీ మందుతో బలైపోతున్న ప్రజలు
రోడ్డున పడుతున్న వేలాది పేద కుటుంబాలు
ఆదాయార్జనకు బలిపీఠ మెక్కించిన ప్రభుత్వం
ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప నేరవార్తలు, రిమ్స్‌, ఒంటిమిట్ట, దువ్వూరు, కొండాపురం, కమలాపురం, ప్రొద్దుటూరు పురపాలక

దశల వారీగా మద్యనిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్‌ అధికార పీఠం ఎక్కాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు.. బార్లు తెరిచి లెక్కకు మించిన విక్రయాలతో పేదలను పిండేస్తూ జేబులు నింపుకొంటున్నారు. మద్యం ప్రియుల ఆరోగ్యాలు గుల్ల ,చేసేస్తున్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో కాలేయం, క్లోమగ్రంధి దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీరిలో పలువురి ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు.

కుటుంబాలు చిన్నాభిన్నం

తరచూ మద్యం తాగే అలవాటున్నా సరే.. కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. రాష్ట్రంలో సరఫరా అయ్యే మద్యం ఓ మాదిరిగా తాగే అలవాటున్న వారికే స్వల్ప కాలంలోనే కాలేయం పాడైపోతోంది. నాసిరకం మద్యంతో త్వరగా కాలేయం పాడైపోతోందని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో అత్యధిక మంది బడుగు, బలహీనవర్గాల పేదలే ఉంటున్నారు. రోజు కూలీలుగా పని చేస్తూ తమకొచ్చే ఆదాయంలో సగానికిపైగా మద్యానికే వెచ్చిస్తున్నారు. నెలల వ్యవధిలోనే ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్ద దిక్కు కోల్పోయి భార్యాపిల్లలు, తల్లిదండ్రులు రోడ్డునపడుతున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి

ఎగువ మధ్యతరగతి, ఉన్నత స్థాయి వర్గాల వారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో లభించే మద్యం జోలికే వెళ్లట్లేదు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి ప్రీమియం బ్రాండ్లు తెప్పించుకుని తాగుతున్నారు. మద్యం అలవాటు మానుకోక.. వారు కోరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించక తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నవాటిని తాగుతున్న పేద, మధ్య తరగతి వారే బలైపోతున్నారు. మద్యం తాగే అలవాటు కొన్నేళ్లుగా ఉన్నా.. ఇంతటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ముందెన్నడూ లేవని బాధితులు, వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితుల దయనీయ పరిస్థితులు నిత్యం కనిపిస్తున్నాయి.


ధరలు ఆమాంతం పెంచేసి

వైకాపా ప్రభుత్వం మద్యం ప్రియుల బలహీనతను సొమ్ము చేసుకుంటోంది. రూ.80 ఉండే మద్యం సీసాను రూ.180 నుంచి రూ200కు పెంచేసింది. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, కమలాపురం, పులివెందుల తదితర ప్రాంతాల్లో 124 మద్యం దుకాణాలున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు రూ.4 కోట్లకుపైగా విక్రయాలు సాగుతుండగా, పండగలు, జాతర్లు, ప్రత్యేక రోజుల్లో రూ.4.50 కోట్లకు వ్యాపారం జరుగుతోంది. ఏడాదికి రూ.1,400 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది.


యువతే ఎక్కువ మద్యం బాధితుల్లో

యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో మద్యం దుకాణాల్లో దొరికే బ్రాండ్లు ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వ హయాంలో లభించడంలేదు. అధికార వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాటు చేసిన డిస్టలరీ కంపెనీ నుంచే ప్రభుత్వం మద్యం కొనుగోలు చేస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాసిరకం సరకు విక్రయిస్తూ ప్రాణాలు తోడేస్తోంది. ‘జె’ బ్రాండ్‌ తాగి ఎంతో మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. నాసిరకం మద్యం తాగడం ద్వారా ఆకలి చచ్చిపోతుందని, విపరీతంగా చెమటలు పట్టి నిమిషాల్లోనే డీహైడ్రేషన్‌కు గురవుతున్నామని యువకులు వాపోతున్నారు. నరాల బలహీనత, కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న యువకులు పెరుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ్య వీరబల్లిలో 34 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. వీధి వ్యాపారం చేస్తూ జీవిస్తూ మద్యానికి బానిసై ఏడాదిన్నర లోపే ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు విడిచాడు. ్య సంబేపల్లెలో 50 ఏళ్లు పైబడిన వ్యక్తి నాసిరకం మద్యం తాగుతూ ఊపిరి తిత్తులలో ఇన్‌స్పెక్షన్‌తో మృత్యువాత పడ్డారు.


కల్తీ మద్యం తాగి చనిపోయాడు

- రామలక్షుమ్మ, గంగవరం

నా భర్త రామపుల్లయ్య నకిలీ జే బ్రాండ్‌ మద్యం తాగి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. లివర్‌, కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. చికిత్స పొందుతూ ఏడు నెలల కిందట మృతి చెందాడు. అప్పటి నుంచే ఇళ్లు గడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను.  


లివర్‌ పాడైపోవడంతో మృతి

- ఉమ, గంగవరం

నా భర్త ప్రసాద్‌ మద్యానికి బానిసయ్యాడు. కల్తీ మద్యం తాగి లివర్‌ పాడైందని వైద్యులు చెప్పారు. ఇద్దరు పిల్లలున్నారని ఎంత చెప్పినా వినలేదు. చివరకు లివర్‌ చెడిపోవడంతో కిడ్నీలు పాడైపోయి ఏడాదిన్నర కిందట చనిపోయాడు. అప్పటి నుంచి కూలి చేసుకుంటూ వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబం, పిల్లలను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాను.


భర్తకు చికిత్స చేయిస్తున్నా

- మాధవీలత, బాధితుని భార్య

మా ఆయన గత 20 ఏళ్లుగా మద్యం తాగుతున్నాడు, ఏనాడు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు. గతేడాదిగా అనారోగ్యం బారిన పడ్డాడు. ఆసుపత్రికి వెళితే లివర్‌ సమస్య ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే అప్పులు చేసి లక్షల రూపాయలు ఆసుపత్రుల్లో ఖర్చు చేసినా నయం కాలేదు. చివరికి రిమ్స్‌లో వైద్యం తీసుకుంటున్నాం. మద్యాన్ని నిషేధించి పేదల జీవితాలు కాపాడాలి.  


ప్రాణాలు పోతున్నాయి

- సుబ్బరాయుడు, రాయచోటి

నేను గత పదేళ్లుగా మద్యం తాగుతున్నాను. ప్రస్తుతం మద్యం తాగితే ఒళ్లు నొప్పులు, తిమ్మిర్లు, కడుపులో మంట వస్తోంది. ఏ రోజు ఆసుపత్రికి వెళ్లని నేను వారానికొకసారి ఆసుపత్రికి వెళుతున్నాను. మద్యం తాగడంతో కొన్ని ఆవయవాలు దెబ్బ తిన్నాయని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.


మందు కాదది విషం

- బాలరాజు, గుత్తి

నా వయసు 26 ఏళ్లు, నేను గత నాలుగేళ్లుగా మద్యం తాగుతున్నాను. నాకు ఏడాదిగా లివర్‌ సమస్య వచ్చింది. ఏలూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వైద్యం చేయించుకున్నాను. అతిగా మద్యం తాగడంతో  లివర్‌, కిడ్నీలలో సమస్య మొదలైందని వైద్యులు అంటున్నారు. కూలి పనులు చేసుకునే నాకు జే బ్రాండ్‌, కల్తీ మద్యంతో ఆరోగ్యం దెబ్బతింది. వైద్యం కోసం లక్షల్లో అప్పులు చేశాను.


రోగాలు కొనితెచ్చుకున్నట్లే

- వెంకటరమణ, కొండాపురం

జగన్‌ తెచ్చిన కొత్త కొత్త మందు బ్రాండ్లను తాగడంతో రోగాలు కొనితెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వీటికి తోడు ఆరోగ్య సమస్యలూ తలెత్తుతున్నాయి. దీంతో వైద్య సేవలకు సుమారు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నాం. గతంలో లభించే బ్రాండ్లు ఇప్పుడు లేవు. నాణ్యత లేక నిస్సత్తువ, నీరసం కాళ్లు, చేతులు వణకడం తదితర లక్షణాలు వెంటాడుతున్నాయి.


అవయవాలు దెబ్బతింటాయి

- డాక్టర్‌ వెంకటరాముడు, వైద్యనిపుణులు, కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

మద్యం తాగుతుండడంతో లివర్‌, కిడ్నీలు దెబ్బతింటాయి. మద్యం ప్రభావం మెదడుపై చూపి మానసిక స్థితి చెడిపోతుంది. తద్వారా నేరాలు చేయడం, దౌర్జన్యాలు, దాడులకు దిగడం వంటి వాటికి పాల్పడతారు. మద్యం బారిన పడినవారికి వ్యసన విముక్తి కేంద్రంలో వైద్యసేవలందిస్తున్నాం. వీరికి మంచి మాత్రలు, మందులు ఇస్తూ చికిత్స అందిస్తున్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు