logo

స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం

ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పందించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. గుంటూరు

Published : 28 Jan 2022 02:37 IST

డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తేనే చర్చలకు

కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్ష శిబిరంలో నినాదాలు చేస్తున్న పీఆర్సీ సాధన సమితి నేతలు  

వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సతీష్‌కుమార్‌, ఆస్కార్‌రావు, చాంద్‌బాషా, బసవలింగారావు తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం స్పందించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రిలే నిరాహార దీక్షల ప్రారంభ కార్యక్రమంలో సమితి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ‘చరిత్రలో ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఉద్యమాలు చేపట్టింది లేదు. ఉద్యోగుల్లో ఐక్యత తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. ప్రభుత్వాన్ని నమ్మి ఉద్యోగులు మోసపోయారు.. అన్యాయం జరిగిందని తెలుసుకుని రోడ్డెక్కారు. ఎక్కడైనా కొత్త పీఆర్సీతో జీతాలు పెరుగుతాయి.. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి వారు ముందుగా నిర్ణయించుకుని గీత గీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఉద్యోగులకు నష్టం ఏర్పడుతోంది. దీనిని ఇప్పుడు మనం ప్రశ్నించకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలతో స్పందించి ముందు డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలకు వెళ్తాం. అప్పటి వరకు చర్చలకు వెళ్లేది లేదు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి జనవరి నెలకు పాత జీతాలే కొనసాగించాలి. పీఆర్సీపై ఇచ్చిన మూడు జీవోలను వెనక్కి తీసుకున్న తర్వాతే చర్చలకు వెళ్తామని ప్రభుత్వానికి తెలిపాం. సమితి సభ్యులు కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. ఉద్యోగికి కడుపు మండి రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు అందరం ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు మద్దతుగా ఉంటామని తెలిపారు. సాధన సమితి జిల్లా నాయకులు కె.సంగీతరావు, చాంద్‌బాషా, ఎస్‌.సతీష్‌కుమార్‌, భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లకు దిగివచ్చి చర్చలు జరపాలన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఒప్పంద ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని, సీసీఏను కొనసాగించాలన్నారు. రిలే నిరాహార దీక్షలో వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పాండురంగప్రసాద్‌, ఎన్‌ఎంయూ సంఘం అధ్యక్షులు రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయ సంఘం నుంచి రామకృష్ణ, బసవలింగారావు, కిరణ్‌కుమార్‌, వివిధ శాఖల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని