MS Dhoni - Pathirana: మహీభాయ్‌ ఇంకా ఆడాలి... క్రికెట్‌లో నాకు తండ్రిలాంటివారు: పతిరన

‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ మద్దతుతో ఐపీఎల్‌లో శ్రీలంక పేసర్ పతిరన అదరగొట్టేస్తున్నాడు. యువ ‘మలింగ’గా పేరొందిన అతడు చెన్నై తరఫున ఆడుతూ రాటుదేలాడు.

Published : 04 May 2024 17:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: యువ క్రికెటర్లలో సత్తాను వెలికితీసి ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ముందుంటాడు. టీమ్‌ఇండియా తరఫున కుర్రాళ్లకు అవకాశాలు కల్పించిన అతడు.. ఐపీఎల్‌లోనూ సాధారణ జట్టుతో అద్భుతాలు సృష్టించాడు. కెప్టెన్సీలో ఐదుసార్లు చెన్నైను ఛాంపియన్‌గా నిలిపాడు. ధోనీ నాయకత్వంలో రాటుదేలిన క్రికెటర్లలో మతీశా పతిరన కూడా ఉన్నాడు. లసిత్ మలింగ బౌలింగ్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్న అతడికి ధోనీ ప్రతిసారీ మద్దతుగా నిలిచాడు. ఈ క్రమంలో ధోనీ అందించిన ప్రోత్సాహంపై పతిరన కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘నా తండ్రి తర్వాత.. నా క్రికెట్‌ జీవితంలో ఆ పాత్రను పోషిస్తున్న వ్యక్తి ఎంఎస్ ధోనీ. ఎల్లవేళలా నా గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. నేను ఇంటి వద్ద ఉన్నప్పుడు మా నాన్న ఎలా అయితే ఉంటారో.. ఇక్కడ ధోనీ అలా ఉంటారు. మైదానంలోనే కాకుండా బయట కూడా ‘అది చెయ్‌.. ఇది చెయ్‌’ అని మరీ ఎక్కువగా చెప్పరు. అవసరమైన విషయాలను మాత్రమే సూటిగా చెబుతారు. ఆ మాటలే నాలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు తోడ్పడతాయి. వినేందుకు చాలా చిన్నవిగా అనిపించినప్పటికీ.. ప్రతీ మ్యాచ్‌లోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడు ఏ అనుమానం ఉన్నా ధోనీని స్వేచ్ఛగా అడుగుతా. అతడి నుంచి కచ్చితంగా మంచి సమాధానం వస్తుంది.

గత రెండు సీజన్ల నుంచి ధోనీ క్రికెట్‌ ఆడడని చెబుతూ వచ్చారు. కానీ, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఈ ఎడిషన్‌లో అతడి ఫినిషింగ్‌ను చూస్తున్నాం. వ్యక్తిగతంగా ఆ దూకుడైన ఆటను చూస్తే చాలా సంతోషపడతా. అందుకే, ధోనీభాయ్‌ వచ్చే సీజన్‌లోనూ ఆడాలి. మాతో కలిసి మైదానంలో తిరగాలి. ప్రతీ ఆటగాడిలోనూ నమ్మకం ఎలా కలిగించాలనేది ధోనీకి తెలిసినట్లు మరెవరికీ తెలియదు’’ అని పతిరన తెలిపాడు. ప్రస్తుత సీజన్‌లో మతీశా పతిరన కేవలం 6 మ్యాచుల్లోనే 13 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకకు చెందిన ఈ యువ పేసర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 20 మ్యాచుల్లోనే 34 వికెట్లు పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని