Sanjay Singh: జై షాకు బ్యాట్‌ పట్టుకోవడం తెలుసా..?: ఆప్‌ విమర్శలు

వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి భాజపా చేసే విమర్శలను ఆప్‌(AAP) తిప్పికొట్టింది. తనవారి కోసమే ఆ పార్టీ పని చేస్తుందని దుయ్యబట్టింది.   

Published : 04 May 2024 18:15 IST

దిల్లీ: క్రికెట్‌ ఎలా ఆడాలో తెలియకుండానే భాజపా అగ్రనేత అమిత్‌ షా కుమారుడు జై షా .. బీసీసీఐలో ఉన్నతస్థానంలో ఉన్నారంటూ ఆమ్‌ఆద్మీపార్టీ (AAP) నేత సంజయ్‌ సింగ్(Sanjay Singh) విమర్శించారు. వారసత్వ రాజకీయాల గురించి కాషాయ పార్టీ చేస్తున్న విమర్శలను ఉద్దేశించి ఈవిధంగా స్పందించారు.

‘‘అమిత్‌ షా కుమారుడికి బ్యాట్‌ ఎలా పట్టుకోవాలో తెలుసా..? కానీ ఆయన ఇప్పుడు బీసీసీఐలో చక్రం తిప్పుతున్నారు. ప్రధాని మోదీ 73 ఏళ్ల వయసులో మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నారు. కానీ జవాన్లకు మాత్రం వయసు పరిమితిని 21 ఏళ్లకు కుదించారు. ఈ వ్యక్తులు ఘోరమైన పరివారవాదీలు. మోదీ, అమిత్‌ షా, భాజపా నేతలకు తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవడం మినహా మరో పని లేదు. కానీ మేం మాత్రం దేశం కోసం పని చేస్తున్నాం’’ అని సింగ్ విమర్శలు చేశారు.

జైషా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. అలాగే సైన్యంలో అగ్నివీర్‌లుగా పని చేయాలంటే వయసు పరిమితి కనిష్ఠంగా 17 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 21 ఏళ్ల లోపు ఉండాలన్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. దేశంలోని ప్రతిపక్ష పార్టీలను కుటుంబ పార్టీలంటూ భాజపా పదేపదే విమర్శలు చేస్తుంటుంది. ఆతరహా రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేస్తుంటుంది. ఈ క్రమంలోనే సింగ్ స్పందన వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని