రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఒక కొలిక్కి రావడం లేదు. దాంతో నెతన్యాహు హెచ్చరించినట్లు రఫా(Rafah)పై దండయాత్ర జరిగితే ఎదురయ్యే విపత్కర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Published : 04 May 2024 17:26 IST

జెనీవా: ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫా(Rafah)పై ఇజ్రాయెల్‌ (Israel) దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనియన్‌ పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. గాజాలోని ఈ నగరంపై సైనిక దాడి రక్తపాతానికి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్‌ అధనామ్‌ హెచ్చరించారు. ఇప్పటికే దెబ్బతిన్న వైద్యవ్యవస్థ మరింత పతనమవుతుందని ఎక్స్ వేదికగా స్పందించారు. అలాగే కొన్ని ప్రత్యామ్నాయ ప్రణాళికలను డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. అయితే అవన్నీ బ్యాండెయిడ్స్‌ లాంటివని, వాటిద్వారా పూర్తి పరిష్కారం లభించదని వ్యాఖ్యానించింది.

ఇజ్రాయెల్‌ దాడుల వల్ల గాజాలోని 36 ఆసుపత్రుల్లో 12, 88 ప్రాథమిక వైద్య కేంద్రాల్లో 22 మాత్రమే పాక్షికంగా పనిచేస్తున్నాయని తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల్లో భాగంగా ఆ వైద్య కేంద్రాలను పునరుద్ధరించేందుకు డబ్ల్యూహెచ్‌ఓతో కలిసి పలు సంస్థలు పని చేస్తున్నాయి. రఫాపై దండయాత్ర మొదలైతే.. అక్కడి ప్రజలు మళ్లీ వలసబాట పట్టాల్సి ఉంటుంది. దాంతో కనీస అవసరాలు అందక వ్యాధులు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. అందుకే తక్షణమే కాల్పుల విరమణ చేయాలని పిలుపునిచ్చింది. అలాగే మానవతా సాయానికి ఉన్న అడ్డంకులు తొలగేలా చూడాలని తన ప్రకటనలో పేర్కొంది.

మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్‌ దాడులపై ఐరాస ఆందోళన

గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్‌, ఇజ్రాయెల్‌ మాత్రం ఒకదానిపై ఒకటి హెచ్చరికలు చేసుకుంటున్నాయి. శాశ్వత కాల్పుల విరమణను హమాస్‌ కోరుతుంటే ఇజ్రాయెల్‌ అందుకు ససేమిరా అంటోంది. 40 రోజుల కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదల ప్రతిపాదనే తమకు అంగీకారయోగ్యమని చెబుతోంది. వారం రోజుల్లో తాము చేసిన ప్రతిపాదనకు అంగీకరించాలని, లేకపోతే గాజాలోని రఫా నగరంపై దండయాత్ర ఖాయమని హమాస్‌కు ఇజ్రాయెల్ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని