logo

Andhra News: నాడు కానిస్టేబుల్‌.. నేడు గంజాయి స్మగ్లర్‌

పలు కారణాలతో ఉద్యోగం పోగొట్టుకుని.. గంజాయి స్మగ్లరుగా మారిన పోలీసు కానిస్టేబుల్‌. చివరికి జైలు పాలయ్యాడు. ఈస్ట్‌ జోన్‌ ఇన్‌ఛార్జి ఏఎస్పీ రవికుమార్‌  వివరాల ప్రకారం... రాజవొమ్మంగి మండలం

Updated : 10 Aug 2022 11:33 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు: పలు కారణాలతో ఉద్యోగం పోగొట్టుకుని.. గంజాయి స్మగ్లరుగా మారిన పోలీసు కానిస్టేబుల్‌. చివరికి జైలు పాలయ్యాడు. ఈస్ట్‌ జోన్‌ ఇన్‌ఛార్జి ఏఎస్పీ రవికుమార్‌  వివరాల ప్రకారం... రాజవొమ్మంగి మండలం గూడెంకొత్తవీధికి చెందిన పూజారి సత్యనారాయణ 2007లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌లో చేస్తున్న సమయంలో భార్యతో తగాదాల నేపథ్యంలో కేసు నమోదై సస్పెండయ్యాడు. 2020లో విధుల నుంచి తొలగించారు. విలాసాలకు అలవాటుపడిన సత్యనారాయణ నగదు కోసం ఏజెన్సీలో గంజాయిని ఖరీదుచేసి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయించడం ప్రారంభించాడు. ఆ క్రమంలో 4.3 కేజీల గంజాయిని స్నేహితుడు సురేంద్ర ద్వారా నామవరం శాటిలైట్‌ సిటీ ప్రాంతానికి చెందిన గెడ్డం కుమారికి విక్రయించేందుకు ఈ నెల 23న నగరానికి వచ్చాడు. విశ్వసనీయ సమాచారంతో సీఐ లక్ష్మణరెడ్డి, ఎస్సై శివాజీ బృందం మోరంపూడి  వద్ద వీరిని అరెస్టు చేసింది.
255 కిలోల పట్టివేత
జగ్గంపేట: అక్రమంగా తరలిస్తున్న 255 కేజీల గంజాయిని పట్టుకుని అయిదుగురు నిందితులు, ఓ కారు, అయిదు చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జగ్గంపేటలో వివరాలు వెల్లడించారు. గుర్రంపాలెం మార్గం నుంచి జగ్గంపేట వైపునకు కారులో గంజాయి తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయ సమాచారంతో తనిఖీ చేయగా 13 బస్తాల్లో 255.45 కేజీల గంజాయి కనిపించిందన్నారు. ఘటనలో విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం బలిగట్నంకు చెందిన కూండ్రపు నాయుడు, నెల్లూరు జిల్లా బాతువారిపాలెంకు చెందిన బోరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, వింజమూరుకు చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి, గుణ్ణం విశ్వనాథ్, చంద్రపడియకు చెందిన కేసం శ్రీనాథ్‌లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్, ప్రకాశం జిల్లాకు చెందిన సాన జైపాల్‌రెడ్డి పరారీలో ఉన్నారన్నారు. సీఐ సూర్యఅప్పారావు, ఎస్సై రఘునాథరావులను అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు