logo

Crime News: మిత్రుడు నేర్పాడు.. ఖతిక్‌ చెలరేగాడు!

ఉమేష్‌ ఖతిక్‌.. జనవరి 19న మూడు కమిషనరేట్ల పోలీసులను పరుగులుపెట్టించిన ఘరానాదొంగ. ఒకేరోజు 6 ప్రాంతాల్లో గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. పేట్‌బషీర్‌బాద్‌ ఠాణా పరిధిలో మొదటి చోరీతో ప్రారంభించి

Published : 27 Apr 2022 08:32 IST

పోలీసు కస్టడీలో వెలుగుచూసిన గొలుసుదొంగ గుట్టు

ఉమేష్‌ ఖతిక్‌

ఈనాడు, హైదరాబాద్‌ న్యూస్‌టుడే, పేట్‌బషీరాబాద్‌: ఉమేష్‌ ఖతిక్‌.. జనవరి 19న మూడు కమిషనరేట్ల పోలీసులను పరుగులుపెట్టించిన ఘరానాదొంగ. ఒకేరోజు 6 ప్రాంతాల్లో గొలుసు చోరీలకు పాల్పడ్డాడు. పేట్‌బషీర్‌బాద్‌ ఠాణా పరిధిలో మొదటి చోరీతో ప్రారంభించి మేడిపల్లి వద్ద ముగించాడు. ఇతడిని అహ్మదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి సబర్మతి జైలుకు తరలించారు. అక్కడి నుంచి పీటీ వారెంట్‌పై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తీసుకొచ్చి చర్లపల్లి జైలుకు తరలించారు. 7 రోజుల పోలీసు కస్టడీ మంగళవారం ముగిసింది. ఉమేష్‌ ఖతిక్‌ చివరిరోజు పలు కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. కొట్టేసిన బంగారు నగల వివరాలు కూడా వివరించినట్టు సమాచారం. అతడు దొంగగా మారటానికి కారణాలు, కొట్టేసిన బంగారంతో ఏం చేస్తాడు తదితర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

అహ్మదాబాద్‌.. బెంగళూరుల్లో హల్‌చల్‌.. ఉమేష్‌ ఖతిక్‌ అలియాస్‌ లాలో గులాబ్జీ ఖతిక్‌ స్వస్థలం అహ్మదాబాద్‌. తండ్రి నడిపే చిన్న టీ కొట్టు కుటుంబానికి ఆధారం. ఇతడు ఇంటర్‌ వరకూ చదివాడు.. ద్విచక్రవాహనం నడపటంలో నేర్పరి. ఒంటరిగా వాహనం నడుపుతూ మహిళల మెడల్లో గొలుసు తెంపుకొని క్షణాల్లో మాయమవుతాడు. 2015లో టీ తాగేందుకు వచ్చే ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లు నేర్చుకున్నాడు. కొంతకాలం ఇద్దరూ కలిసి చేసినా నమ్మకం కుదరక ఉమేష్‌ ఒక్కడే రంగంలోకి దిగాడు. అహ్మదాబాద్‌, బెంగళూరు, సూరత్‌ నగరాల్లో గొలుసు దొంగతనాలు చేశాడు. దొంగతనం చేసేందుకు ఆయా నగరాలకు విమానాల్లో వెళ్తాడు. సాధారణ లాడ్జీల్లో మకాం వేస్తాడు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా సమాచారం సేకరిస్తాడు. తాళం వేయడం మరిచిన స్కూటీ కోసం వెతికి దొరగ్గానే చోరీ చేస్తాడు. దానిపై తిరుగుతూ గొలుసులు లాక్కెళ్తాడు. పలుమార్లు అరెస్టయి జైలుకెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోలేదు. ఇతడి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు పోలీసులు ఆచితూచి స్పందించేవారు. పోలీసులను తనను కొట్టారని, బెదిరించారంటూ న్యాయమూర్తులకు ఫిర్యాదు చేస్తాడనే భయం కూడా ఒక కారణం కావొచ్చని సమాచారం. ఏడేళ్ల వ్యవధిలో 100కు పైగా గొలుసు దొంగతనాలకు పాల్పడి ఉంటాడని అంచనా.

బైపాస్‌ సర్జరీ.. ఫిట్స్‌ సమస్య.. గొలుసు దొంగకు గతేడాదే వివాహమైంది. భార్యను అమితంగా ప్రేమిస్తాడు. ఆమెను సంతోషంగా ఉంచేందుకు, కోరిన వస్తువులు వెంటనే కొనేందుకు పెద్దఎత్తున దొంగతనాలు చేయాలనుకున్నాడు. గతంలో ఇతడికి బైపాస్‌ సర్జరీ జరిగినట్టు సమాచారం. తరువాత ఫిట్స్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. నిందితుడి ఆరోగ్య సమస్యలు గుర్తించిన పోలీసులు సున్నితంగా వ్యవహరించి వాస్తవాలు రాబట్టారు. కొట్టేసిన నగలు ఇక్కడే పోయాయని, మరోసారి అహ్మదాబాద్‌లో ఇచ్చానని వివరించాడు. సొమ్ము రికవరీకి సైబరాబాద్‌ పోలీసుల బృందం అహ్మదాబాద్‌ చేరినట్టు సమాచారం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని