logo

Locked house monitoring system: ఇంటికి.. ఈ తాళం వేయండి

విజయనగరంలోని ఓ కుటుంబం పోలీసులకు చెప్పి సొంతూరుకు వెళ్లింది. దీంతో రక్షణ కల్పించారు. ఒక రోజు ఉన్నట్టుండి ఆ ఇంట్లో నుంచి శబ్ధం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే పిల్లి కనిపించింది. వెంటనే వెనుదిరిగారు. ఇలా జంతువులైనా.

Published : 13 Jan 2022 06:56 IST

ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో దొంగతనాలకు చెక్‌
 నగర, పురపాలక ప్రజలకు అవకాశం


ఎల్‌హెచ్‌ఎంఎస్‌ పరికరాలు

నేరవార్తావిభాగం, పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే విజయనగరంలోని ఓ కుటుంబం పోలీసులకు చెప్పి సొంతూరుకు వెళ్లింది. దీంతో రక్షణ కల్పించారు. ఒక రోజు ఉన్నట్టుండి ఆ ఇంట్లో నుంచి శబ్ధం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తీరా చూస్తే పిల్లి కనిపించింది. వెంటనే వెనుదిరిగారు. ఇలా జంతువులైనా.. దొంగలైనా.. ఇట్టే కదలికలను పసిగట్టేయొచ్చని చెబుతోంది జిల్లా పోలీసుశాఖ. దీనికిగానూ లాక్డ్‌ హౌస్‌ మానటరింగ్‌ సిస్టమ్‌(ఎల్‌హెచ్‌ఎంఎస్‌) సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతోంది.


యాప్‌ 

పండగ వేళల్లో చాలామంది సొంతూర్లు, ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. ఇదే అదునుగా దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. వీటిని అరికట్టేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఇళ్లకు రక్షణ కల్పించుకోవచ్చు. ప్రస్తుతం సంక్రాంతి నేపథ్యంలో విజయనగరం నగరపాలక సంస్థతో పాటు పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి పురపాలికలు, నెల్లిమర్ల నగర పంచాయతీల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో వెలుతురు ఉండేటట్లు ఏదో ఒక చోట బల్బు వేసి ఉంచాలి. యూపీఎస్‌ విద్యుత్తు లేకుండా ఆరు గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎక్కువ రోజులు ఉండేవారు ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. చరవాణికి సంక్షిప్తం రూపంలో హెచ్చరిక వస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి.

పనిచేసేదెలా అంటే..
ఈ సౌకర్యాన్ని పొందాలంటే ప్లేస్టోర్‌ ద్వారా ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం తప్పనిసరి. అందులో పేరు, చిరునామా, చరవాణి నెంబరు నమోదు చేయాలి. పోలీసులు ఓ ఐడీ కేటాయిస్తారు. సంబంధిత వివరాలతో ఇతర ప్రాంతానికి వెళుతున్నట్లు పోలీసులకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వాలి. ఏఏ రోజుల్లో రక్షణ కావాలో తెలియజేయాలి. తద్వారా వారు స్పందించి వైర్‌లైస్‌ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఓ యూపీఎస్‌తో పాటు డేటాకార్డును దానికి అనుసంధానిస్తారు. ఈక్రమంలో ఇంట్లోకి ఎవరైనా వస్తే ఆ కదలికల ఆధారంగా వెంటనే యజమానితో పాటు స్టేషన్‌కు సమాచారం వెళుతుంది.

జిల్లాలో పరిస్థితి ఇదీ..
ఎల్‌హెచ్‌ఎంఎస్‌ పరికరాలు- 58
రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు- 14,718
సద్వినియోగం- 350

సమాచారం అందిస్తే చాలు..: 
ఇల్లు విడిచి బయటకు వెళ్తున్నట్లుగా సంబంధిత పోలీసుస్టేషన్‌కు సమాచారాన్ని అందిస్తే చాలు. ఎల్‌హెచ్‌ఎంఎస్‌ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారు. ప్రజల్లో అవగాహన ఇంకా పెరగాలి. పండగ వేళల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తాం.   - దీపిక ఎం.పాటిల్, ఎస్పీ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని