logo

బాలీవుడ్‌లో మన గోల్కొండ సింహం

బాలీవుడ్‌కు హైదరాబాద్‌కు ఆది నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. వివేక్‌ ఒబెరాయ్‌, టబు, అదితీరావు హైదరీ, సుస్మితా సేన్‌, దియా మీర్జా వంటి ప్రముఖ నటులు హైదరాబాద్‌

Published : 27 Jan 2022 05:12 IST

నేడు అజిత్‌ఖాన్‌ శతజయంతి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బాలీవుడ్‌కు హైదరాబాద్‌కు ఆది నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. వివేక్‌ ఒబెరాయ్‌, టబు, అదితీరావు హైదరీ, సుస్మితా సేన్‌, దియా మీర్జా వంటి ప్రముఖ నటులు హైదరాబాద్‌ నుంచి బాలీవుడ్‌ బాట పట్టి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికంటే ముందే అక్కడ అడుగుపెట్టి విలన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్‌ఖాన్‌. ఆయన్ను అందరూ గోల్కొండ సింహంగా పిలుస్తారు. ‘సారా షెహర్‌ ముఝే లయన్‌ కే నామ్‌ సే జాన్‌తా హై’... మూడున్నర దశాబ్దాల కిందట బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన డైలాగ్‌ ఇది. ‘కాళీచరణ్‌’ సినిమాలో ఈ డైలాగ్‌ పలికిన విలన్‌ పాత్రధారి అజిత్‌ఖాన్‌. బాలీవుడ్‌లో ప్రాణ్‌ తర్వాత శైలి ఉన్న విలన్‌గా ప్రేక్షకాదరణ పొందిన ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. ఆయన శతజయంతి వేడుకలు దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

ఇంటి నుంచి పారిపోయి ముంబయికి

అజిత్‌ఖాన్‌ అసలు పేరు హమీద్‌ అలీఖాన్‌. నిజాం జమానాలో చరిత్రాత్మక గోల్కొండ ప్రాంతంలో 1922 జనవరి 27న పుట్టాడు. విద్యాభ్యాసమంతా వరంగల్‌లో సాగింది. అజిత్‌ తండ్రి బషీర్‌ అలీఖాన్‌ నిజాం సైన్యంలో పనిచేసే వారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో నటనపై ఇష్టంతో ఇంటి నుంచి పారిపోయి ముంబయి చేరుకున్నారు. ప్రయాణ ఖర్చుల కోసం పుస్తకాలను అమ్మేశారు. 1946లో ‘షాహే మిశ్రా’లో గీతాబోస్‌ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత సికందర్‌, హతిమ్‌తాయ్‌, ఆప్‌ బీతీ, సోనేకీ చిడియా, చందాకీ చాంద్‌నీ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా గుర్తింపు రాకపోవడంతో విలన్‌ వేషాలు వేయడం ప్రారంభించారు. తొలిసారి ‘సూరజ్‌’లో ప్రతి నాయకుడిగా కనిపించారు. బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘జంజీర్‌’లో పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ‘జంజీర్‌’తో అమితాబ్‌ బచ్చన్‌ హీరోగా నిలదొక్కుకుంటే, అజిత్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. అధునాతన వేషధారణ, డైలాగులు పలికే తీరు విలన్‌లకే విలన్‌గా నిలిపాయి. 200కు పైగా సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్‌ ‘లయన్‌’ 1998 అక్టోబర్‌ 22న హైదరాబాద్‌లోనే కన్నుమూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని