ఎగుమతులకు రాచబాట

ఏ దేశ ఆర్థికాభివృద్ధిలోనైనా ఎగుమతులది కీలక పాత్ర. సంపన్న దేశాల భాగ్యరేఖల్ని సైతం తేజోమయం చేయడంలో నాణ్యమైన మౌలిక వసతులు, మేలిమి రవాణా సదుపాయాల విస్తరణలదే ప్రధాన భూమిక. ఆ యథార్థాన్ని ప్రతిధ్వనింపజేస్తూ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తాజా సదస్సులో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ప్రసంగం అక్షరసత్యం.

Published : 27 May 2023 02:18 IST

ఏ దేశ ఆర్థికాభివృద్ధిలోనైనా ఎగుమతులది కీలక పాత్ర. సంపన్న దేశాల భాగ్యరేఖల్ని సైతం తేజోమయం చేయడంలో నాణ్యమైన మౌలిక వసతులు, మేలిమి రవాణా సదుపాయాల విస్తరణలదే ప్రధాన భూమిక. ఆ యథార్థాన్ని ప్రతిధ్వనింపజేస్తూ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తాజా సదస్సులో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన ప్రసంగం అక్షరసత్యం. ఆయన చెప్పినట్లు, రవాణా వ్యయాలు దిగివస్తేనే ఎగుమతులు జోరెత్తుతాయి. పోటీ ప్రపంచంలో అది అత్యంత సహజం. అమెరికా, ఐరోపాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రవాణా వ్యయాలు సుమారు ఎనిమిది శాతంగా, చైనాలో పదిశాతంగా లెక్కతేలుతున్నాయి. దేశీయంగా జీడీపీలో 14-16 శాతానికి చేరిన రవాణా వ్యయాలు ఎగుమతుల రంగాన మన పోటీ సామర్థ్యానికి, అవకాశాలకు ప్రతిబంధకాలవుతున్నాయి. వచ్చే మూడేళ్లలో ఆ ఖాతాను జీడీపీలో తొమ్మిది శాతానికి తగ్గించడమే తక్షణ లక్ష్యమంటున్న గడ్కరీ ప్రకటన, కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని చాటుతోంది. వాస్తవానికి, తదుపరి లక్ష్యమేమిటో రెండునెలలక్రితం భారత వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య (అసోచామ్‌) వార్షిక సమావేశంలో కేంద్ర హోంశాఖామాత్యులు అమిత్‌ షా బహిరంగపరచారు. వచ్చే అయిదేళ్లలో రవాణా వ్యయాల పద్దును జీడీపీలో 7.5 శాతానికి పరిమితం చేయాలన్నది ఆయన ప్రకటన సారాంశం. రవాణా బట్వాడా వ్యయాన్ని తగ్గించాలంటే పలు వరసల ఎక్స్‌ప్రెస్‌ వేస్‌, విస్తృతంగా గిడ్డంగులు, విరివిగా శీతలీకరణ సదుపాయాలు అందుబాటులోకి రావాలి. ఆసేతు హిమాచలం భిన్న ప్రాంతాల్ని అనుసంధానిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అవినీతికి తావులేకుండా రహదారుల నిర్మాణం మరింతగా చురుకందుకోవాలి. మారుమూల ప్రాంతాలకూ రాదారుల విస్తరణ సేద్య ఉత్పత్తులు, కుటీర పరిశ్రమలకు అపార అవకాశాల్ని చేరువ చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతుల పరికల్పన, ఎగుమతుల రంగానికి నూతన జవసత్వాలు ప్రసాదిస్తుంది.

దేశంలో 2014 మార్చ్‌ నాటికి మొత్తం జాతీయ రహదారుల నిడివి 91,287 కిలోమీటర్లు. తరవాత తొమ్మిదేళ్లలో ఇంచుమించు 50వేల కిలోమీటర్ల మేర విస్తరణ సాధ్యపడింది. దేశమంతటా ప్రజల రాకపోకలకు, సరకుల చేరవేతకంటూ రూ.11 లక్షలకోట్ల భారీ వ్యయంతో గతంలోనే ‘భారత్‌ మాల పరియోజన’ను కేంద్రం పట్టాలకు ఎక్కించింది. నగరాల మధ్య ఎక్స్‌ప్రెస్‌ వేస్‌ నిర్మాణం ప్రారంభమయ్యాక ప్రయాణకాలం కుదించుకుపోతోంది. ఒకప్పుడు దేశ రాజధాని దిల్లీ నుంచి మేరఠ్‌ వెళ్ళడానికి నాలుగున్నర గంటల సమయం పట్టేది. ఇప్పుడది 40 నిమిషాలకు తగ్గిపోయింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ వచ్చే మూడేళ్లలో 26 హరిత ఎక్స్‌ప్రెస్‌ వేస్‌ నిర్మాణం సాకారం కానుందని నిరుడు ఆగస్టులోనే గడ్కరీ రాజ్యసభాముఖంగా వెల్లడించారు. కేవలం భిన్న రహదారులపైనే దృష్టి ప్రసరిస్తే సరిపోదు. నాణ్యమైన త్రివిధ (రహదారి, జల, వాయు) రవాణా సేవల్ని పరిపుష్టీకరించాలి. జల రవాణా, రైల్వేలు, రహదారులు, వాయుమార్గాలు... ఈ ప్రాధాన్యక్రమం అనుసరిస్తామంటున్న కేంద్రం- రోడ్డుప్రాజెక్టుల్లో రిటైల్‌ పెట్టుబడులకూ స్వాగతం పలుకుతోంది! ఏటా దాదాపు రూ.16 లక్షలకోట్ల విలువైన పెట్రో ఉత్పత్తుల్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్న దేశం మనది. ఆ వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు ఇథనాల్‌, మిథనాల్‌, బయో సీఎన్‌జీ తదితరాల వినియోగానికి, విద్యుత్‌ వాహనాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం- సరైన ముందడుగు. విద్యుత్‌ వాహనాల ఉత్పత్తిలో ప్రస్తుతం చైనా, అమెరికా అగ్రగాములు. జపాన్‌ను వెనక్కినెట్టి మూడోస్థానాన నిలిచిన ఇండియా ఇంకో అయిదేళ్లలో అగ్రపీఠి చేరుతుందంటున్నారు. రవాణా వ్యయ నియంత్రణలో అది స్వాగతించదగ్గ పరిణామమేగాని- వివిధ వస్తూత్పాదనల ఉత్పత్తి వ్యయాన్నీ కనిష్ఠస్థాయికి పరిమితం చేసేలా ప్రభుత్వాల ప్రణాళికలు పదును తేలాలి. ఎగుమతుల్లో విశేష వృద్ధికి అది దోహదపడుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.