భవితకు దారిదీపాల్లా పాఠ్యాంశాలు!

చిరకాలం నీరు ఒకేచోట నిలిచిపోతే, పాచి పడుతుంది. ఏళ్లతరబడి ఎలాంటి మార్పులూ చేర్పులకు నోచని పాఠ్యపుస్తకాలకైనా అటువంటి దుస్థితే దాపురిస్తుంది. కనీసం అయిదేళ్లకు ఒకసారైనా పాఠ్యాంశాల సమీక్ష, ప్రక్షాళన చేపట్టాలని లోగడ కేంద్రమంత్రిగా మురళీ మనోహర్‌ జోషీ నిర్దేశించారు.

Published : 01 May 2024 01:09 IST

చిరకాలం నీరు ఒకేచోట నిలిచిపోతే, పాచి పడుతుంది. ఏళ్లతరబడి ఎలాంటి మార్పులూ చేర్పులకు నోచని పాఠ్యపుస్తకాలకైనా అటువంటి దుస్థితే దాపురిస్తుంది. కనీసం అయిదేళ్లకు ఒకసారైనా పాఠ్యాంశాల సమీక్ష, ప్రక్షాళన చేపట్టాలని లోగడ కేంద్రమంత్రిగా మురళీ మనోహర్‌ జోషీ నిర్దేశించారు. విశ్వవిద్యాలయాలన్నీ మూడు సంవత్సరాలకు ఒక్క పర్యాయమైనా సిలబస్‌ను సాంతం సంస్కరించాలని జాతీయ విజ్ఞాన సంఘం సిఫార్సు చేసింది. నవకల్పనల శకంలో ఎప్పటికప్పుడు విప్పారుతున్న ఆవిష్కరణల్ని విద్యారంగం పొదువుకుంటూ ఉండాలని ఎనిమిదేళ్లక్రితం ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అటువంటి విశేష పరివర్తనను సాకారం చేసేలా కేంద్రప్రభుత్వం తాజాగా చొరవ చూపింది. ఇకమీదట ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి నవీకరణ చేపట్టాల్సిందిగా ఎన్‌సీఈఆర్‌టీ (జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి)కి కేంద్రం ఆదేశాలు జారీచేసింది. 2026 విద్యాసంవత్సరంనాటికి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రాన్ని అనుసరించి అన్ని తరగతులకూ పుస్తకాలు అందిన దరిమిలా వార్షిక కసరత్తును మండలి కొనసాగించనుందంటున్నారు. విద్యార్థిని మంచి పౌరుడిగా తీర్చిదిద్దడం, నిజజీవితంలో పనికొచ్చే పాఠాలు చెప్పడం స్వీయ ప్రాథమ్యాంశాలుగా ఎన్‌సీఈఆర్‌టీ లోగడే చాటుకుంది. నిరుడీ రోజుల్లో అది డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతాన్ని పదోతరగతి సిలబస్‌నుంచి తొలగించడంపై దేశంలో తీవ్ర దుమారం రేగింది. ఆ తొలగింపును తప్పుపడుతూ 18వందల మందికిపైగా శాస్త్రవేత్తలు, అధ్యాపకులు బహిరంగ లేఖ రాశారు. ఏ పాఠ్యాంశాలను తీసేయడానికైనా చేర్చడానికైనా ఒక శాస్త్రీయ ప్రాతిపదిక ఉండాలి. విధ్యుక్తధర్మ నిర్వహణలో భాగంగా ఇకమీదట నిపుణులతో విస్తృత చర్చల తరవాతే చర్యలు చేపట్టేలా ఎన్‌సీఈఆర్‌టీ అన్నిందాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగైతేనే స్వయంగా వల్లెవేసిన ప్రాథమ్యాంశాల అమలు సాధ్యపడుతుంది!

ప్రాథమిక విద్య వ్యక్తి వికాసానికి పునాది వేయాలి. ఆపై శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థుల్ని విజ్ఞానఖనులుగా తీర్చిదిద్దేలా ఉన్నత విద్య రూపొందాలి. ఆ లక్ష్యాలు యథాతథంగా నెరవేరాలంటే- విద్యార్థుల్లోని సహజ ప్రతిభను వెలికి తీసేలా ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల కూర్పు మెరుగుపడుతుండాలి. సొంతంగా ఆలోచించేలా పిల్లల ప్రజ్ఞకు పదును పెడుతుండాలి. వాటికి తావివ్వని యాంత్రిక చదువుల పర్యవసానంగా- ప్రశ్నించే మేధావుల స్థానే బట్టీపట్టే మెదళ్లు దేశంలో పేరుకుపోతున్నాయి. పాలకపక్షాల భావజాలానికి అనువైన పాఠ్యప్రణాళికల తయారీ, పేరాలకు పేరాలు ఉపాధ్యాయులు కంఠతా పట్టించడం, ర్యాంకులతో పిల్లల తెలివితేటల్ని తూకం వేయడం... ఇలా దేశంలో దశాబ్దాలుగా చదువులు బూజుపట్టిపోయాయి. ప్రాథమిక విద్యారంగాన ఇండియా యాభై ఏళ్లు వెనకబడిపోయిందని ఆమధ్య యునెస్కో అధ్యయన పత్రం సూటిగా తప్పు పట్టడానికి కారణమదే! ఏ అంశాన్నయినా పిల్లలు తమంతట తామే తెలుసుకునేందుకు ప్రాధాన్యమిచ్చే ఆచరణాత్మక విద్యకు ఫిన్లాండ్‌ పెట్టింది పేరు. చిన్నారుల సృజనాత్మకతకు నగిషీలద్దే కార్యక్షేత్రాలుగా పాఠశాలల్ని మలచడంలో దక్షిణ కొరియాది ప్రత్యేక ఒరవడి. స్పష్టమైన సహేతుక లక్ష్యాలతో పాఠ్యపుస్తకాల్ని కొత్తగా ఆవిష్కరించడంలో డెన్మార్క్‌, పోలాండ్‌, స్విట్జర్లాండ్‌ తదితరాలు పోటీపడుతున్నాయి. చక్కటి చదువులకు నెలవులై వెలుగొందుతున్నాయి. అందుకు భిన్నంగా ఇక్కడ ఏపీలో జగన్‌ సర్కారు- బోధన సిబ్బందికి తగిన శిక్షణ ఊసెత్తకుండానే అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ అంటూ ఊదరగొట్టి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంది. అటువంటి అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చి- పాఠ్యాంశాల కూర్పు, అందుకు అనుగుణంగా గురువులకు శాస్త్రీయ శిక్షణ జోడెద్దుల్లా సాగేట్లు కేంద్రం ప్రత్యేక కార్యాచరణను పట్టాలకు ఎక్కించాలి. పాఠ్యపుస్తకాల సంస్కరణ జాతి నిర్మాణానికి ఉపయుక్తమయ్యేదప్పుడే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.