మాదక మహా విపత్తు

దేశీయంగా మాదక మహమ్మారి స్వైరవిహారాన్ని కళ్లకుకడుతూ భారతావని పశ్చిమ తీరానికి మత్తుపదార్థాలు పోటెత్తుతున్నాయి. మొన్న ఫిబ్రవరిలో ఇరాన్‌ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు చేరిన చేపల పడవలో 3,300 కిలోల డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.

Published : 02 May 2024 01:03 IST

దేశీయంగా మాదక మహమ్మారి స్వైరవిహారాన్ని కళ్లకుకడుతూ భారతావని పశ్చిమ తీరానికి మత్తుపదార్థాలు పోటెత్తుతున్నాయి. మొన్న ఫిబ్రవరిలో ఇరాన్‌ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు చేరిన చేపల పడవలో 3,300 కిలోల డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. బహిరంగ విపణిలో వాటి విలువ రెండు వేల కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా. ఆపై రెండు వారాలకే ఆ రాష్ట్రంలోనే రూ.480 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ ఓడరేవు నుంచి గుజరాత్‌ మీదుగా దిల్లీ, పంజాబ్‌లకు ఆ మత్తుపదార్థాలను చేరవేస్తున్నట్లుగా యంత్రాంగం గుర్తించింది. నాలుగు రోజుల క్రితం గుజరాత్‌కు సమీపంలో అరేబియా సముద్రంలో తిరుగాడుతున్న పడవ నుంచి రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ తదితర మత్తుమందులను భద్రతా దళాలు పట్టుకున్నాయి. సముద్ర మార్గాలతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారానూ దేశంలోకి మాదకద్రవ్యాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. పట్టుబడుతున్న వాటితో పోలిస్తే- గుట్టుచప్పుడు కాకుండా గమ్యస్థానాలకు చేరుతున్న సరకు మరెన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందన్నది బహిరంగ రహస్యం. మాదక ముఠాల పీచమణచడంలో దేశీయంగా సరైన వ్యూహం కొరవడిందన్నది కాదనలేని వాస్తవం. సర్కారీ యంత్రాంగాల నడుమ సమన్వయ లేమి వంటి వ్యవస్థాగత లోపాలతో గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌, మెథాంఫేటమిన్‌ తదితరాలు వాడవాడలా లభ్యమవుతున్నాయి. ప్రజారోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తూ- యువభారతం భవిష్యత్తుతో అవి చెలగాటమాడుతున్నాయి. దేశానికి దన్నుకావాల్సిన నవతరం- మత్తుమందుల ఊబిలో చిక్కుకుని నేరాలబాట పడుతోంది. జగన్‌ ఏలుబడిలోని ఏపీలో సామాజిక అశాంతికి ఆజ్యంపోస్తూ మాదక మహోత్పాతం పతాకస్థాయికి చేరింది!

ఏపీలో డ్రగ్స్‌ దందాలు లేనేలేవని, అదంతా గిట్టనివాళ్ల ప్రచారమని జగన్‌ మొదట్లో అడ్డగోలుగా వాదించారు. మాదకద్రవ్యాల విజృంభణపై ప్రజాగ్రహం అధికమయ్యాక ఆయన నాలుక మడతేశారు. మూడు నాలుగు నెలల్లో ఏపీని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలంటూ 2022 డిసెంబరులో సర్కారీ సిబ్బందికి జగన్‌ ఏదో పేరుకు ఉపదేశాలు చేశారు. కానీ, ఆయన జమానాలోనే ‘గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా ఆంధ్రప్రదేశ్‌ పరువు మాసింది. మూడేళ్ల నాడు అఫ్గానిస్థాన్‌ నుంచి టాల్కమ్‌ స్టోన్స్‌ ముసుగులో విజయవాడ చిరునామాకు వెళ్తున్న దాదాపు మూడు వేల కిలోల హెరాయిన్‌ గుజరాత్‌లోని ముంద్రా రేవులో పట్టుబడింది. ఇటీవల బ్రెజిల్‌ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన 25 వేల కిలోల రొయ్యల మేతలో బయటపడిన మాదకద్రవ్యాల ఆనవాళ్లు- దేశవ్యాప్తంగా గగ్గోలు పుట్టించాయి. ఏపీ నుంచి గంజాయిని గోవాకు సరఫరా చేస్తున్న మాదకాసురులు- అక్కడి నుంచి ఎల్‌ఎస్‌డీ (లైసర్జిక్‌ యాసిడ్‌ డయథిలమైడ్‌), కొకైన్‌లను విశాఖకు తెచ్చి విక్రయిస్తున్నారు. బెంగళూరు, దిల్లీల నుంచి ఎండీఎంఏ (మెథలీన్‌ డయాక్సీ మెథామ్‌ఫెటమిన్‌) వంటి వాటిని తీసుకొచ్చి విజయవాడ లాంటి చోట్ల అమ్ముతున్నారు. ‘ఐసిస్‌ డ్రగ్‌’గా పేరుపడ్డ ట్రెమడాల్‌ను స్థానికంగా భారీగా ఉత్పత్తి చేసిన సంస్థ వైకాపా నేత సన్నిహితులదేనని తేలడం- జగన్‌ పాలనలోని చీకటి కోణాలకు మచ్చుతునక. వైకాపా ఏలుబడిలో అడ్డూఆపూ లేకుండా సాగిన గంజాయి దందాలు- రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో శోకాగ్నులను రగిల్చాయి. ఆ వినాశనాన్ని అడ్డుకోవడానికి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ-జనసేన ఉమ్మడిగా వాగ్దానం చేశాయి. మాదకాసురులకు అపరిమిత స్వేచ్ఛనిచ్చి, ఏపీని నిర్వీర్యం చేసిన జగన్‌ సర్కారును ఇక ఇంటికి పంపడం ప్రజల వంతు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు