ఇదీ... జగన్‌ పనితనం!

యువజన(వై) శ్రామిక(ఎస్‌) రైతుల(ఆర్‌) పేరిట పార్టీ పెట్టి ఆయా వర్గాల నోట్లో మట్టికొట్టిన మహాద్రోహం జగన్‌మోహన్‌రెడ్డిది. ‘మేము వేసే ప్రతి అడుగూ పారిశ్రామికీకరణకు అనుకూలం... రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం... మన పిల్లలకే ఉద్యోగాలు ఇస్తాం’ అని 2019 జులైలో సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ‘చేతకాని అయ్యకే చేష్టలెక్కువ’ అని రుజువు చేస్తూ అయిదేళ్లలో రెండు పారిశ్రామిక...

Published : 06 May 2024 01:27 IST

యువజన(వై) శ్రామిక(ఎస్‌) రైతుల(ఆర్‌) పేరిట పార్టీ పెట్టి ఆయా వర్గాల నోట్లో మట్టికొట్టిన మహాద్రోహం జగన్‌మోహన్‌రెడ్డిది. ‘మేము వేసే ప్రతి అడుగూ పారిశ్రామికీకరణకు అనుకూలం... రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం... మన పిల్లలకే ఉద్యోగాలు ఇస్తాం’ అని 2019 జులైలో సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ‘చేతకాని అయ్యకే చేష్టలెక్కువ’ అని రుజువు చేస్తూ అయిదేళ్లలో రెండు పారిశ్రామిక విధానాల్నీ తీసుకొచ్చారు. ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకొంటే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, ఇన్‌వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు చేదోడువాదోడుగా ఉంటుందనీ బులిపించారు. ఇలా ఆదర్శాలు వల్లించిన జగన్‌ నకిలీ అని, అసలీ జగన్‌లో కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు బుసలుకొడుతూనే ఉన్నాడని విద్యుత్‌ పీపీఏలు, పరిశ్రమలకు కేటాయించిన భూముల సమీక్షలతోనే పారిశ్రామిక జగతికి అర్థం అయింది. దేశంలో అయిదో అతిపెద్ద రాష్ట్రమైన ఏపీ- వేధింపులకు చిరునామాగా మారి, పారిశ్రామికంగా దిగజారిపోవడానికి ఏకైక కారణం జగన్‌ ఏలుబడి! అబ్బ అధికారమే పెట్టుబడిగా చీకటి ఒప్పందాలతో మిడిమేలపు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న జగన్‌కు, చట్టబద్ధంగా వ్యాపార వాణిజ్య విస్తరణలంటే కంటగింపు. కాబట్టే ఈ అయిదేళ్లలో ఏకంగా దాదాపు రూ.1.22లక్షలకోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనల్ని కాలదన్నారు. రెండులక్షల ఏడువేలకుపైగా యువత ఉద్యోగావకాశాలకు గండికొట్టారు. చదువుల్లో మెరికలు ఉపాధి వేటకు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుంటే, స్థానికంగా బతుకుతెరువు కరవై లక్షలమంది నిరుద్యోగులు నలిగిపోతున్నారు. అదానీ డేటా సెంటర్‌ (రూ.70వేలకోట్లు), ఆసియా పేపర్‌ అండ్‌ పల్ప్‌ (రూ.24వేలకోట్లు), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ.15వేలకోట్లు), అమరరాజా బ్యాటరీస్‌(రూ.9,500కోట్లు), జాకీ, లులూ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ వంటివన్నీ రాష్ట్రం దాటిపోవడానికి సీఎం జగనే కారణం. ఒక్కముక్కలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి పట్టిన గ్రహణం!

ఒక్క భారీ పరిశ్రమ వచ్చిందంటే, దానికి అనుబంధంగా అనేకానేక చిన్న పరిశ్రమలు వెలుస్తాయి. వాటికి బాసటగా ఎన్నెన్నో ఉపాధి అవకాశాలు మొలకెత్తి వేలాది జీవితాలు చిగురిస్తాయి. పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల పేరిట అస్మదీయ సంస్థలకు భూసంతర్పణలు చేసిన జగన్‌ ప్రభుత్వం కొత్త పరిశ్రమలకు బాటలు పరవలేదు సరికదా- ఉన్నవాటినీ నిలువునా ముంచింది. రాయితీపై భూములు ఇస్తామని వాగ్దానం చేసిన పారిశ్రామికవాడల్లో స్థలాల ధరల్ని పదకొండు రెట్లదాకా పెంచిన జగన్‌ సర్కారు- కొత్త ధరల్ని పాత కేటాయింపులకూ వర్తింపజేసింది. పారిశ్రామిక వాణిజ్య విద్యుత్‌ వినియోగదారులపై అది మోపిన భారం రూ.2600కోట్లు! పరిశ్రమలపై ఆస్తిపన్ను, నీటిపన్ను, వార్షిక లైసెన్సు ఫీజుల రూపంలో పెనుభారాన్ని మోపిన దగాకోరు పాలన ఇది. ప్రత్యక్షంగా 60వేల మందికి ఉపాధి కల్పించిన 20వేల ఎంఎస్‌ఎంఈలు చితికిపోయాయి. ఐటీ సంస్థలన్నీ రాష్ట్రం నుంచి ఎప్పుడో జెండా ఎత్తేశాయి. రాష్ట్రంలో ఏటా రెండున్నర లక్షల మంది ఉద్యోగార్థులుగా వస్తుంటే, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే పారిశ్రామిక వాతావరణాన్నే జగన్‌ ప్రభుత్వం ధ్వంసం చేసింది. మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం రూపకల్పన చేసి, వైజాగ్‌-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను పూర్తిచేసింది. కేవలం రూ.36కోట్లు ఇవ్వడానికి చేతులు రాక విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవా పనుల్ని జగన్‌ ఆపేశారు. తమ ప్రాధాన్యాలు వేరే అని వాటికి డబ్బులు ఇవ్వడం వృథా అని తెగేసి చెప్పింది జగన్‌ సర్కారు! సహకార చక్కెర కర్మాగారాలు, ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలు జగన్‌ దెబ్బకు కుదేలైపోయాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రూ.2400కోట్ల రాయితీల్ని విడుదల చెయ్యని ప్రభుత్వం- ఇచ్చినప్పుడే తీసుకోవాలిగాని, అడిగే అధికారం మీకు లేదని పెడసరపు జీఓనే జారీ చేసింది. రూ.40లక్షల బకాయి ఉన్నందుకు గ్రానైట్‌ పరిశ్రమకు కరెంటు తీసేసిన సర్కారు దుర్మార్గంపై నిరుడు జనవరిలో హైకోర్టు ధర్మాగ్రహం వ్యక్తం చేసింది. ‘లక్షల కోట్ల బకాయిలున్న మీ ప్రభుత్వ పవర్‌ను ప్రజలు ఎప్పుడు తీయాలి?’ అని సూటిగా ప్రశ్నించింది. ఎలెక్షన్‌ కమిషన్‌ నిర్ణయించిన మే 13వ తేదీ ముహూర్తంలో జగన్‌ ముఠా పవర్‌ కత్తిరించేందుకు రాష్ట్ర ప్రజావాహిని సిద్ధంగా ఉంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.