నాసికోపాఖ్యానం

ఆఘ్రాణించడం, మూర్కొనడం అనే పదాలకు- వాసన చూడటమని అర్థం. తుమ్మెద అన్నిరకాల పూలమీద వాలుతుంది. సువాసనలను ఆఘ్రాణిస్తుంది. మకరందాన్ని ఆస్వాదిస్తుంది. ఒక్క సంపెంగ జోలికి మాత్రం పోదు. ఆ తిరస్కారం సంపెంగకు అవమానంగా తోచింది.

Published : 26 May 2024 00:34 IST

ఆఘ్రాణించడం, మూర్కొనడం అనే పదాలకు- వాసన చూడటమని అర్థం. తుమ్మెద అన్నిరకాల పూలమీద వాలుతుంది. సువాసనలను ఆఘ్రాణిస్తుంది. మకరందాన్ని ఆస్వాదిస్తుంది. ఒక్క సంపెంగ జోలికి మాత్రం పోదు. ఆ తిరస్కారం సంపెంగకు అవమానంగా తోచింది. ‘నేనేం తక్కువ తిన్నాను?’ అంటూ పంతం పట్టి తపస్సు చేసింది. ఫలితంగా లోకంలో స్త్రీల నాసికల రూపం సాధించింది. తుమ్మెదలు తన చుట్టూ మూగేలా చేసింది. ‘పారిజాతాపహరణం’లో సుప్రసిద్ధ పద్యం ‘నానా సూన వితాన వాసనలను ఆనందించు సారంగము...’ తాత్పర్యం ఇది. స్త్రీల నాసికలు సంపెంగ రేకుల్లా ఉంటాయని, కంటి చూపులు ఆడ తుమ్మెదలై వాటికి ఇరువైపులా ముసిరాయని- ఈ పద్యంలోని చమత్కారం. విద్యానాథుడి శ్లోకం ‘భృంగానవాప్తి...’, పింగళి సూరన పద్యం ‘అంబుజగంధి నాసిక...’ నంది తిమ్మన పద్యానికి అనుబంధ సుగంధాలు. స్త్రీ నాసికను నువ్వుపూలతోనూ పోలుస్తారు. ‘తిలముం(నువ్వు), చంపకము(సంపెంగ) ఇంతినాస(ముక్కు) గని మైత్రింగోరె...’ అంది ‘ఇందుమతీ పరిణయం’. నాసికతో స్నేహానికి అవి పోటీపడతాయని చెప్పింది. మరి అంతటి సొగసును సువాసనను సొంతం చేసుకొన్న సంపెంగ జోలికి తుమ్మెద ఎందుకు పోదంటే- ఆ తీపి పరిమళం ఘాటుకు దాని తల దిమ్మెక్కుతుందట. స్వయంగా సంపెంగల్లా ఉండటమే కాదు, తక్కిన పూల సువాసనలను ఆస్వాదించడంలోను నాయికల నాసికలకు మిక్కిలి మక్కువ. వసుచరిత్రలో గిరిక చెలికత్తెలు తోటలోని మొత్తం పూల సువాసనలను కొల్లగొట్టి, ‘కుసుమ వాసనలెల్ల కొల్లలాడితిమి’ అంటూ మురిసిపోవడాన్ని రామరాజ భూషణుడు వర్ణించాడు. అందుకే కాబోలు ‘స్త్రీల ఊపిరులు ఎంతో సుగంధభరితం’ అన్నారు కవులు.

తపోదీక్షతో పరమశివుణ్ని మెప్పించి, తనవాణ్ని చేసుకోవాలనుకొంది పార్వతి. అదే ప్రయత్నంలో ‘వావిలిపూవుల మాలలు కైసేసి...’ వావిలిపూలను దండగా చేసి శివుడికి సమర్పించిందని ‘గిరిజాకల్యాణం’ యక్షగానంలో మల్లాది రామకృష్ణశాస్త్రి రాశారు. వావిలిపూలనే ఆమె ఎంచుకోవడంలో ఒక విశేషం ఉంది. సురపొన్నలు విరివిగా పుష్పించాలంటే- పద్మినీజాతి స్త్రీలు ఆ మొక్కలను ఆలింగనం చేసుకోవాలంది శాస్త్రం. దాన్ని ‘దోహదక్రియ’ అంటారు. ‘వనిత ఉపగూహనంబునన్‌ (కౌగిలింతతో) పూచు సురపొన్న...’ అంది కావ్యాలంకార చూడామణి. అలాగే స్త్రీలు పదేపదే వాసన చూడటం- వావిలి మొక్కలకు దోహదక్రియ! స్త్రీల ఘ్రాణశక్తి ప్రత్యేకత అది. యయాతి చరిత్రంలో నాయిక ‘కొసరి వావిలి మూర్కొనె...’ అదే పనిగా వాసన చూసిందన్నాడు పొన్నెగంటి తెలగన్న. గోదాదేవి తొలుత ధరించిన ఆముక్తమాల్యద శ్రీరంగనాథుడికి ఇష్టమైనట్లుగా- పార్వతి స్వయంగా దోహదం చేసి పూయించిన వావిలిపూల మాల శివుడికి ప్రీతి కలిగిస్తుందన్నది- మల్లాదివారి పదప్రయోగంలోని ఔచిత్య సౌరభం. ‘స్త్రీల ఘ్రాణశక్తి విలక్షణమే కాదు, ఎంతో సునిశితం’ అంటున్నారు నిపుణులు. వాసనలను పసిగట్టడంలో పురుషుల కన్నా నైశిత్యం వారికి ఇరవైరెట్లు ఎక్కువని పరిశోధనల్లో తేలింది. ‘మద్య ధూమపానాదుల దరిమిలా మాయమాటలతో మగువలను మభ్యపెట్టడం చెల్లదు’ అంటున్నారు పరిశోధకులు. స్నానం చేశామని అబద్ధం ఆడినా అంతేనట. ‘వారి ఘ్రాణేంద్రియం దూరం నుంచే వాసనలను పసిగడుతుంది’ అని తేల్చి చెబుతున్నారు. జామ, తులసి ఆకులను కసాబిసా నమలడం, బబుల్‌గమ్‌లను అదేపనిగా చప్పరించడం వల్ల ప్రయోజనం లేదని దాని అర్థం. ‘ఆ విషయం మాకు కొత్తేమీ కాదు’ అంటున్నారు ఇప్పటికే తత్వం బోధపడిన పురుషపుంగవులు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.