Hyderabad: సచివాలయం ప్రారంభించాక అసెంబ్లీ నిర్మాణం!

భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని.. తాత్కాలిక మరమ్మతులతో వాటిని సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని రాష్ట్ర రహదారులు-భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయిలో

Updated : 02 Aug 2022 08:45 IST

వర్షాలతో దెబ్బతిన్న రహదారుల పూర్తిస్థాయి మరమ్మతులకు త్వరలో ప్రణాళిక

గవర్నర్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

‘ఈనాడు’ ముఖాముఖిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయని.. తాత్కాలిక మరమ్మతులతో వాటిని సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని రాష్ట్ర రహదారులు-భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయిలో రోడ్ల పునరుద్ధరణపై త్వరలో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నిధులు కేటాయిస్తారన్నారు. సచివాలయ ప్రారంభం తర్వాత అసెంబ్లీ నిర్మాణ పనులపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని వెల్లడించారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గవర్నర్‌ వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ధ్వజమెత్తారు. ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.

వర్షాలకు రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. పునరుద్ధరణ పనుల పరిస్థితేంటి?

ప్రాథమిక అంచనా ప్రకారం 1,733 కిలోమీటర్ల రహదారులు, 412 వంతెనలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు దాదాపు పూర్తి కావొచ్చాయి. కల్వర్టులు, వంతెనల వద్ద ఇంకా వరద నీరు ఉండటంతో పూర్తిస్థాయి మరమ్మతులకు త్వరలో ప్రణాళికలు రూపొందిస్తాం.

ప్రాంతీయ విమానాశ్రయాల ప్రతిపాదనలు ముందుకు కదలడం లేదేంటి?

తెలంగాణపై కేంద్రం వివక్షకు ఇదో ఉదాహరణ. రాష్ట్రంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది. కేంద్ర ప్రభుత్వ అలసత్వంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఇంకా ఎంతకాలం పడుతుంది?

ఇది చాలా పెద్ద టాస్క్‌. ప్రస్తుతం రెండు లక్షల ఇళ్లను పూర్తి చేయడమంటే.. కాంగ్రెస్‌ హయాంలో 14 లక్షల ఇళ్లతో సమానం. అనుకున్న రెండు లక్షల ఇళ్లలో 1.40 లక్షలు పూర్తయ్యాయి. ఇప్పటికే 20 వేల ఇళ్ల కేటాయింపులూ జరిగాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. కేటాయించిన రూ.18 వేల కోట్లలో రూ.11 వేల కోట్లు వెచ్చించాం. పేదల ఇళ్ల కోసం దేశంలో ఏ రాష్ట్రమూ ఇంత మొత్తంలో ఖర్చు చేసిన దాఖలాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో స్థలాలు లభించకపోవటంతో సొంత స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు ఇవ్వాలన్న కసరత్తు జరుగుతోంది.

రెండు పడక గదుల ఇళ్ల విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉందని ఇటీవల గవర్నర్‌ వ్యాఖ్యానించారు కదా..?

రాజ్యాంగ బాధ్యతల నిర్వహణ కన్నా రాజకీయాలపై గవర్నర్‌ ఎక్కువ దృష్టిపెట్టారు. ఇంకా తమిళనాడు భాజపా అధ్యక్షురాలు మాదిరిగానే మాట్లాడుతున్నారు. ఆమె తీరు గవర్నర్‌ వ్యవస్థకే కళంకం. కేసీఆర్‌పై గవర్నర్‌ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. ఆమె కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు తప్ప గవర్నర్‌లా కాదు.

సచివాలయం, అమరుల స్మారక స్థూపం ఎప్పటికి పూర్తవుతాయి?

సచివాలయాన్ని దసరాకు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. సివిల్‌ పనులు 90 శాతం, ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయి. వర్క్‌స్టేషన్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సాంకేతిక అంశాలు, కరోనా కారణంగా అమర వీరుల స్మారక స్తూపం నిర్మాణంలో జాప్యం జరిగింది. దీనికి అవసరమైన ఏకీకృత స్టీల్‌ షీట్‌ను జర్మనీ నుంచి తెప్పిస్తున్నాం. దుబాయి సంస్థ నిర్మాణ పనులు చేస్తోంది. రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. 

అసెంబ్లీ నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది కదా..?

సచివాలయ ప్రారంభం తర్వాత అసెంబ్లీ భవనంపై సీఎం దృష్టి పెడతారు. ఎర్రమంజిలే అనువైన ప్రాంతంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అక్కడ ట్రాఫిక్‌ పెద్ద సమస్య కాకపోవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని