Lata Mangeshkar: ఎదలోతులో.. అయ్‌ మేరే వతన్‌!

ఆ పాట.. యావత్‌ భారతావని ఎద లోతులను తడుముతుంది. భాష తెలియని వారికి సైతం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఆరు దశాబ్దాలుగా ఆబాలగోపాలంలో ఉత్తేజం నింపుతోంది. లతా మంగేష్కర్‌ తీపి గొంతులో స్వరరాగ గంగా ప్రవాహంలా సాగిపోతూ

Updated : 07 Feb 2022 05:05 IST

ఆరు దశాబ్దాలుగా ఉత్తేజం నింపుతున్న పాట
లత గొంతులో పల్లవించిన అమృత గేయం

పాట.. యావత్‌ భారతావని ఎద లోతులను తడుముతుంది. భాష తెలియని వారికి సైతం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ఆరు దశాబ్దాలుగా ఆబాలగోపాలంలో ఉత్తేజం నింపుతోంది. లతా మంగేష్కర్‌ తీపి గొంతులో స్వరరాగ గంగా ప్రవాహంలా సాగిపోతూ దేశభక్తిని ఉప్పొంగించేలా చేసిన ఆ చిరస్మరణీయ గీతమే.. ‘అయ్‌ మేరే వతన్‌ కే లోగోఁ.. జర ఆంఖ్‌మే భర్‌లో పానీ.. జో షహీద్‌ హుయే హై ఉన్‌కీ.. జర యాద్‌ కరో ఖుర్బానీ.. తుమ్‌ భూల్‌ నా జావో ఉన్‌కో.. ఇస్‌లియే సునో యే కహానీ.. (నా దేశ ప్రజలరా.. కొంత కళ్లలో నీళ్లు నింపుకోండి.. అమరులైన వారి త్యాగాలను కొంత గుర్తుచేసుకోండి.. మీరు వారిని మరువొద్దు.. అందుకే ఈ కథ వినండి)’

హిందీ గీతమే అయినా దీన్ని ఎవరు విన్నా.. ఎప్పుడు విన్నా.. మనసును మెలిపెట్టే భావన, కళ్లలో నీళ్లు, యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల త్యాగాలను తలచుకొని శరీరం రోమాంఛితం కావడం తథ్యం. ఇంతటి గొప్ప పాటను దేశానికి వినిపించడానికి లతమ్మ చేసిన కృషి మరింత గొప్పగా అనిపిస్తుంది. చైనా యుద్ధం తర్వాత.. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి అవసరమైన విరాళాల సేకరణ కోసం సినీపరిశ్రమ నిర్వహించిన కార్యక్రమానికి గాను కవి ప్రదీప్‌ రాసిన ఈ పాటకు సి.రామచంద్ర స్వరాలు సమకూర్చారు. ఈ ఆరున్నర నిమిషాల పాటను లతా మంగేష్కర్‌ 1963 జనవరి 27న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో దిల్లీ నేషనల్‌ స్టేడియంలో నాటి ప్రధాని జహర్‌లాల్‌ నెహ్రూ సమక్షంలో ఆలపించి అందరి కళ్లలో నీళ్లు నింపారు. కవి ప్రదీప్‌ ముంబయి మాహిం బీచ్‌లో కూర్చున్నప్పుడు ఆయన మదిలో ఈ పాట పదాలాడింది. వెంటనే దారినపోయే ఓ వ్యక్తిని పెన్ను అడిగి తీసుకొని, సిగరెట్ల పెట్టలో ఉండే అల్యూమినియం ఫాయిల్‌ పేపర్‌పై తన మదిలో మెదిలిన పంక్తులను రాసుకున్నారు. ఆ పాట పాడి అర్ధశతాబ్దం పూర్తయిన సందర్భంగా ప్రస్తుత ప్రధాని, నాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2014 జనవరి 27న లతా మంగేష్కర్‌కు సన్మానం జరిగింది. ముంబయి మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో నిర్వహించిన నాటి కార్యక్రమంలో ఆ పాట ప్రస్థానాన్ని లతమ్మ వివరించారు.

యుద్ధానంతర పరిణామాలతో దిల్లీ గంభీరంగా మారిపోయిన వాతావరణంలో నేను ఈ పాట పాడాను. దానిని విన్న నెహ్రూ కళ్లలో నీళ్లు..

‘‘నాకు ప్రదీప్‌ ఫోన్‌ చేసి.. ఆ పాటను నేను దిల్లీలో పాడాలని కోరారు. అప్పటికి తక్కువ సమయం ఉండటంతో అంత పాటను గుర్తుపెట్టుకొని ఎలా పాడను? అని అడిగాను. అయినా ఆ పాటను నేనే పాడాలని ఆయన కచ్చితంగా చెప్పేశారు. పాటకు రిహార్సల్‌ కోసం వస్తానని నేను సంగీత దర్శకుడు సి.రామచంద్రకు చెబితే ఆయన తాను ముందే దిల్లీకి వెళ్తున్నానని.. వీలు పడదని చెప్పారు. దాంతో పాటను కనీసం టేప్‌ అయినా చేసి ఇవ్వమని అడిగితే ఇచ్చారు. జనవరి 26న అంతా విమానం ఎక్కాం. నేను ఆ టేప్‌ను వింటూ కూర్చున్నాను. హోటల్‌కు వెళ్లిన తర్వాత రాత్రంతా వింటూనే ఉన్నాను. మరుసటి రోజు ఆ పాట పాడాను. తర్వాత పండిత్‌జీ (జవహర్‌లాల్‌ నెహ్రూ) నుంచి పిలుపొచ్చింది. ‘నేనేమైనా తప్పు పాడానా? తప్పు చేశానా?’ అనుకుంటూ వెళ్లాను. నేను వెళ్లేసరికి నెహ్రూ కళ్లలో నీళ్లు.. అక్కడ ఇందిరాగాంధీ కూడా ఉన్నారు. ‘ఈ రోజు మా బంగ్లాలో అందరి కోసం మర్యాదపూర్వకంగా ఛాయ్‌ ఏర్పాటు చేశాం.. మీరు రావాలి’ అన్నారు. నేను అక్కడికెళ్లి చీకటిగా ఉన్న ఓ చోట నిలబడ్డాను. నన్ను వెతుక్కుంటూ ఇందిరాగాంధీ వచ్చారు. ‘మీరు ఇక్కడే నిల్చోండి.. మీ అభిమానులను మీ ముందుకు తీసుకొస్తాను’ అంటూ వెళ్లి తన ఇద్దరు పిల్లలను (రాజీవ్‌, సంజయ్‌) తీసుకొచ్చారు. పండిత్‌జీ నన్ను పిలిచి ‘ఫొటో తీసుకోండి’ అన్నారు. యుద్ధానంతర పరిణామాలతో దిల్లీ గంభీరంగా మారిపోయిన వాతావరణంలో నేను ఆ పాట పాడాను. ప్రజలకు విపరీతంగా నచ్చింది. ఇప్పటివరకు ఎన్ని షోలు ఇచ్చినా ఆ పాట పాడకుండా ప్రేక్షకులు వదిలి పెట్టేవారు కాదు. విదేశాలకు వెళ్లినా ఆ పాట పాడాల్సి వచ్చేది’’ అని ఆమె వివరించారు. కాగా లతమ్మ పరమపదించిన రోజు.. ఈ పాట రాసిన కవి పుట్టిన రోజు ఫిబ్రవరి 6 కావడం ఓ యాదృచ్ఛికం.

‘ఆజారే పర్‌దేశీ!’ అంటూ ‘మధుమతి’ చిత్రంలో ఆమె పాడితే సంగీతప్రియులు ఉర్రూతలూగారు. 1960 నాటి చారిత్రక చిత్రం ‘మొగల్‌ ఏ ఆజం’లో అక్బర్‌ జహాపనా ఎదుట అనార్కలి పాడిన ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’ దేశంలో ప్రేమికులకు ఓ నినాదమే ఇచ్చింది. ఇంకా.. ‘అజీబ్‌ దాస్తాన్‌ హై యే’ (దిల్‌ అప్నా ప్రీత్‌ పరాయా), ‘కహీ దీప్‌ జలే కహీ దిల్‌’ (బీస్‌ సాల్‌ బాద్‌) వంటి పాటలు మరచిపోగలమా! ‘ఆజ్‌ ఫిర్‌ జీనేకీ తమన్నా హై’ (గైడ్‌), ‘లగ్‌జా గలే’, ‘నైనా బర్సే రిమ్‌ ఝిమ్‌’ (వో కౌన్‌ థీ?), ‘తూ జహా జహా చలేగా’ (మేరా సాయా) పాటలు ఈ దేశంలో నిత్యం ఏదో ఒక లోగిలిలో వినిపిస్తూనే ఉంటాయి. మీనాకుమారి చివరిరోజుల్లో వచ్చి గొప్ప క్లాసికల్‌ చిత్రంగా నిలిచిన ‘పాకీజా’ కోసం లత పాడిన ‘చల్తే చల్తే యుహీ కోయీ మిల్‌గయా’ పాట రస హృదయాలను వెంటాడుతుంది.

 

 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని