icon icon icon
icon icon icon

Arvind Kejriwal: 21 రోజుల అవకాశం.. ఆమ్‌ఆద్మీ పార్టీకి కలిసొచ్చేనా..?

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ లభించింది. దీంతో ఎన్నికల్లో ఆయన ప్రచారానికి అవకాశం దొరికింది.

Published : 10 May 2024 17:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. లోకసభ ఎన్నికల వేళ ఈ పరిణామం ఆ పార్టీలో జోష్‌ నింపింది.

21 రోజుల అవకాశం..

బెయిల్‌ ఉత్తర్వులు వచ్చిన తర్వాత.. కేజ్రీవాల్‌ శుక్రవారం రాత్రి తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్‌ 2న ఆయన లొంగిపోయి తిరిగి జైలుకు వెళ్లాలని కోర్టు స్పష్టంచేసింది. ఎన్నికల ప్రచారంపై కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే.. ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తించవద్దని కోర్టు పేర్కొంది. దీంతో ఆయనకు ఈ 21 రోజలు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు అవకాశం లభించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది.

దిల్లీ, పంజాబ్‌లపైనే దృష్టి..

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఈడీ కేజ్రీవాల్‌ను మార్చి 21న అదుపులోకి తీసుకుంది. దీంతో ఆయన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేకపోయారు. ఆయనను ప్రచారంలో పాల్గోనీయకుండా చేసేందుకే దర్యాప్తు సంస్థలతో భాజపా అరెస్టు చేయించిందని ఆప్‌ నేతలు ఆరోపించారు. ఇప్పుడు బెయిల్‌ లభించడంతో.. తమ పార్టీ అధికారంలో ఉన్న దిల్లీ, పంజాబ్‌లపై కేజ్రీవాల్‌ ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. దిల్లీలో ఆరో విడతలో మే 25న, పంజాబ్‌లో చివరిదశలో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. 

పార్టీ శ్రేణుల్లో జోష్‌..

ఆమ్‌ఆద్మీ పార్టీకి పెద్ద దిక్కు కేజ్రీవాలే. ఆయన జైలులో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ.. కేజ్రీవాల్‌కు ఉన్నంత ఆదరణ వారికి లేదనే చెప్పాలి. పలువురు పార్టీ నేతలు ఆయన్ను జైలులో కలిసి ప్రచార వ్యూహాలపై సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు కేజ్రీవాలే స్వయంగా ప్రచారంలో పాల్గొననుండటం.. ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. మరోవైపు తన అరెస్టు విషయంలో ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు కూడా కేజ్రీవాల్‌ ప్రయత్నించవచ్చు. ఇప్పటికే.. తమ నేతలను జైలులో పెట్టినందుకు జవాబుగా ప్రజలు తరలివచ్చి ఆమ్‌ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

పార్టీ నేతల హర్షం..

‘‘ఇది కేజ్రీవాల్‌కు దక్కిన ఊరట మాత్రమే కాదు. సత్యానికి దక్కిన విజయమని’’ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు హర్షం వ్యక్తంచేశారు. మరోవైపు ఇండియా కూటమి నేతలు కూడా కేజ్రీవాల్‌ బెయిల్‌ను స్వాగతించారు. ‘‘కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేడా మాట్లాడుతూ..‘‘ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు కూడా తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. ఇది ఇండియా కూటమికి కలిసొచ్చే అంశమని పలువురు అంటున్నారు. మిత్రపక్షాలు పోటీ చేస్తున్న ప్రాంతాల్లోనూ ఆయనతో ప్రచారం చేయించుకోవచ్చని చెబుతున్నారు.

మరోవైపు దీనిపై భాజపా స్పందించింది. ఇది మధ్యంతర బెయిలేనని.. కేజ్రీవాల్‌ నిజాయతీపరుడని తేలినట్లు కాదని.. ఇది ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించదని దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img