icon icon icon
icon icon icon

Assembly Election Results: వెలువడుతున్న ఫలితాలు.. ఇండియా కూటమి కీలక నిర్ణయం

Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. ‘ఇండియా’ కూటమి సమావేశానికి ఆయా పార్టీలకు ఆహ్వానం పంపినట్లు సమాచారం.

Updated : 03 Dec 2023 15:13 IST

దిల్లీ: తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.  తెలంగాణలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న హస్తం పార్టీ.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో వెనకంజలో ఉంది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్‌లో కమలదళం హవా కొనసాగుతోంది. తెలంగాణ మినహా మిగతా మూడు రాష్ట్రాల్లోనూ భాజపాయే విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో భాజపాను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి  కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 6న దిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించింది. తదుపరి కార్యాచరణపై  చర్చించేందుకు కూటమిలోని పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా దిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  ఫోన్‌ చేసి చెప్పినట్లు సమాచారం. తాజా అసెంబ్లీ ఎన్నికలను ఇండియా కూటమి.. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోంది.  తెలంగాణ మినహా మిగతా చోట్ల వ్యతిరేక ఫలితాలు వస్తున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

నీతీశ్‌ కుమార్‌కు బాధ్యతలు అప్పగించండి

ప్రస్తుతం ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను కాంగ్రెస్‌ నిర్వర్తిస్తోంది. అయితే, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ పార్టీ జనరల్‌ సెక్రెటరీ నిఖిల్‌ మండల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి బాధ్యతలను కాంగ్రెస్‌కు ఇస్తే.. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని, అందువల్ల సారథ్య బాధ్యతలను జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టి.. కూటమి బాధ్యతలను కాంగ్రెస్‌ పట్టించుకోలేదని, అలాగని మంచి ఫలితాలు కూడా రాబట్టలేకపోయిందని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img