icon icon icon
icon icon icon

Revanth reddy: గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి: రేవంత్‌రెడ్డి

గజ్వేల్‌ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్‌ను  ఓడించలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 

Published : 04 May 2024 22:17 IST

 

కొత్తకోట: గజ్వేల్‌ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్‌ను ఓడించలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. ‘‘అమెరికాలో చదువుకునో, వారసత్వ రాజకీయాలతోనో మీ ముందుకు ముఖ్యమంత్రిగా రాలేదు. నేను చదువుకున్నది వనపర్తి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో. ఆనాడు చిన్నారెడ్డి గెలుపు కోసం గోడలపై రాతలు రాశా. మీ ఆశీర్వాదంతోనే ఈ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. మీ బిడ్డ సీఎం అయ్యి 150 రోజులు కాకముందే.. కొందరు దిగిపో అంటున్నారు. 

ఈ పాలమూరు బిడ్డను సీఎం పదవి నుంచి దించడానికి దిల్లీ నుంచి బయలుదేరారు. ఇంకొందరు శత్రువు పంచన చేరి మనల్ని ఓడించాలని చూస్తున్నారు. డీకే అరుణ కాంగ్రెస్‌ను ఓడించాలని చెబుతోంది. కాంగ్రెస్‌ ఆమెకు ఏం అన్యాయం చేసింది. గద్వాలకు ఎమ్మెల్యేగా చేసినందుకా? ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకా? అరుణకు ఇంత పేరు తెచ్చిపెట్టింది కాంగ్రెస్‌ కాదా? మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం దిల్లీలో మాట్లాడేవారు ఉండాలంటే వంశీ గెలవాలి. ముదిరాజ్‌ సోదరులను బీసీ డీ నుంచి ఏగా మార్చేందుకు సుప్రీంకోర్టులో సమస్యలు పరిష్కించేందుకు, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు వంశీచంద్‌రెడ్డి ఎంపీగా గెలవాలి. హరీశ్‌రావు రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి సిద్దిపేటకు పట్టిన శని వదిలిస్తా. భాజపా తెలంగాణకు ఇచ్చింది.. మోదీ తెచ్చింది ఏమీ లేదు గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి. పాలమూరు జిల్లాలో భాజపాని పాతరేయాలి. వంశీని లక్ష మెజార్టీతో గెలిపించాలి’’ అని రేవంత్‌రెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img