icon icon icon
icon icon icon

Revanth Reddy: హరీశ్‌రావు రాజీనామాపత్రం జేబులో పెట్టుకో: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘రైతు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావు రాజీనామా చేస్తామంటున్నారు. 

Updated : 24 Apr 2024 20:46 IST

వరంగల్‌: మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) స్పందించారు. ‘‘రైతు రుణమాఫీ చేస్తే హరీశ్‌రావు రాజీనామా చేస్తామంటున్నారు. ఆగస్టు 15లోపు రూ.2లక్షలు రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్‌రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలి. కేసీఆర్‌ మాదిరిగా హరీశ్‌రావు మాట తప్పవద్దు’’ అని సీఎం సూచించారు. 

రుణమాఫీ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish rao) బుధవారం ఉదయం సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ‘‘సీఎం సవాల్‌ను స్వీకరిస్తున్నా. ఇచ్చిన హామీలను అధికార పార్టీ నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. శుక్రవారం అసెంబ్లీ ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు నేను వస్తా. సీఎం రేవంత్‌ కూడా అక్కడికి వచ్చి ఆగస్టు 15లోపు రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేస్తానని ప్రమాణం చేయాలి. హామీని నిలబెట్టుకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ ఉప ఎన్నికలోనూ పోటీ చేయను. మాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేస్తారా?’’ అని ప్రశ్నించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై వరంగల్‌ సభలో సీఎం స్పందించారు.

కేసీఆర్‌.. పచ్చి అబద్ధాలు చెబుతున్నారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘ప్రజలకు నిస్వార్థంగా సేవలందించే నాయకులు కావాలి. ఎంపీ టికెట్‌ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్‌ను సంప్రదించలేదు. కడియం వద్దకు కాంగ్రెస్‌ పెద్దలను పంపించాం. మెదడు కరిగించి కాళేశ్వరం కట్టామని కేసీఆర్‌ చెబుతున్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. మేడిగడ్డ మేడిపండు అయింది.. సుందిళ్ల సున్న అయింది. అన్నారం ఆకాశంలో కలిసింది. కాంగ్రెస్‌, భారాస కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూడాలి. కేసీఆర్‌ను సూటిగా అడుగుతున్నా.. కాళేశ్వరం రండి చూద్దాం. అక్కడే కూర్చొని నిపుణులతో చర్చిద్దాం. కేసీఆర్‌కు దమ్మూ ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం రావాలి. ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవు.

అసెంబ్లీకి రాని కేసీఆర్‌... టీవీ స్టూడియోల్లో గంటలపాటు కూర్చొని ప్రగల్భాలు పలుకుతున్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. వరంగల్‌ అంటే దేశానికి తలమానికమైన పీవీ, కాళోజీ, జయశంకర్‌ గుర్తొస్తారు. హైదరాబాద్‌ మాదిరిగా వరంగల్‌కు  ఔటర్‌ రింగ్‌రోడ్డుతో పాటు ఎయిర్‌పోర్టు నిర్మిస్తాం. ఈ నగరానికి మహర్దశ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. కాకతీయ యూనివర్సిటీ నిర్వీర్యమైంది. వీసీతో పాటు బోధనాసిబ్బందిని నియమిస్తాం. యూనివర్సిటీని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్య అందిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img