icon icon icon
icon icon icon

Revanth Reddy: భాజపాకు ఓటు వేస్తే.. రాజ్యాంగాన్ని మార్చేస్తారు: సీఎం రేవంత్‌రెడ్డి

రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 02 May 2024 18:56 IST

ఆసిఫాబాద్‌: రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పుపై మాట్లాడుతున్నానన్న కారణంతోనే తనపై కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనలో 200 కేసులు పెట్టినా భయపడలేదని, మోదీ నన్ను బెదిరించగలరా? అని ప్రశ్నించారు. దిల్లీ సుల్తాన్‌లు తెలంగాణపై దాడి చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు ఇక్కడ సాగనివ్వబోనని అన్నారు. భాజపా కుట్రలను అడ్డుకుంటామన్నారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డే ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ ప్రసంగించారు.

 ‘‘పోడు భూముల సమస్యలపై కేసీఆర్‌ దృష్టి పెట్టలేదు. కేంద్ర మంత్రివర్గంలో గోండులకు భాజపా స్థానం ఇవ్వలేదు. తొలిసారిగా ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ను మహిళకు కేటాయించాం. ఆదిలాబాద్‌లో సీసీఐ మూతపడినా.. కేసీఆర్, మోదీ పట్టించుకోలేదు. మోదీ, కేసీఆర్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా ఆదిలాబాద్‌కు ఏమీ చేయలేదు. బలహీనవర్గాల కులగణన చేస్తున్నాం. అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతాం. రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆరెస్సెస్‌ ప్రయత్నిస్తోంది. 

1881 నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు జరుగుతున్నాయి. 2021లో జనగణన చేయాల్సి ఉన్నా..  అమిత్‌షా కుట్ర చేసి ఆపించేశారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే అజెండాతోనే 2021లో జనగణన చేయలేదు. రిజర్వేషన్లు రద్దు చేయాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి, 50 శాతం రాష్ట్రాలు ఒప్పుకోవాలి. భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోంది. దీని కోసమే 8 రాష్ట్రాల్లో కూటమి ప్రభుత్వాలను పడగొట్టారు. భాజపాకి వేసే ప్రతి ఓటు.. రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది. రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేయాలని భాజపా చూస్తోంది’’ అని రేవంత్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img