icon icon icon
icon icon icon

Revanth Reddy: మామా అల్లుళ్లు.. నా సవాల్‌కు సిద్ధమా?: రేవంత్‌రెడ్డి

భారాస హయాంలో పాలమూరుకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు.

Updated : 23 Apr 2024 20:41 IST

బిజినపల్లి: భారాస హయాంలో పాలమూరు నేలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు. 70 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇక్కడి బిడ్డకు దక్కిందన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభలో రేవంత్‌ మాట్లాడారు. గతంలో కరీంనగర్‌లో ఓటమి భయంతోనే.. కేసీఆర్‌ పాలమూరు ఎంపీగా పోటీ చేశారని ఎద్దేవా చేశారు.

‘‘పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను పార్లమెంట్‌కు పంపిస్తే.. వారికి అన్యాయం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. దొంగలకు సద్ది మూటలు మోసే నేతలు మన జిల్లాలో కొందరు ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్త. డి.కె.అరుణ, ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌తో నాకు వివాదం ఏమీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల భాజపా అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాలేదు. ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఐపీఎస్‌కు రాజీనామా చేస్తే.. మేం అండగా నిలబడ్డాం. దొరల పెత్తనాన్ని సహించలేక రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడాలంటే ప్రవీణ్‌ కాంగ్రెస్‌లోకి రావొచ్చు కదా. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ను నియమించాలనుకున్నాం. కానీ, ఆయన తిరస్కరించారు. ఆయన ఐపీఎస్‌గా ఉండి ఉంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం డీజీపీగా నియమించేది.

భారాసను 4 కోట్ల తెలంగాణ ప్రజలు గోతిలో పూడ్చి పెట్టారు. మోదీ ఒకరకంగా మోసం చేస్తే.. కేసీఆర్‌ మరో రకంగా మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్‌ వ్యతిరేకంగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీ పూర్తికాలం అధికారంలో ఉంటుంది. పాలమూరులోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. బంగారు నేలగా మారుస్తాం. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? అని హరీశ్‌రావు అంటున్నారు. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా. నేను రుణమాఫీ పూర్తి చేస్తే... కేసీఆర్‌, హరీశ్‌రావు భారాసను రద్దు చేస్తారా?’’ అని రేవంత్‌రెడ్డి  సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని